OLYMPICS: మళ్లీ మను మెరిసేనా... మూడో పతకం దక్కేనా

OLYMPICS: మళ్లీ మను మెరిసేనా... మూడో పతకం దక్కేనా
X
ఇవాళ ఒలింపిక్స్‌లో మరో ఫైనల్లో బరిలోకి దిగనున్న మనూ బాకర్‌.. విశ్వ క్రీడల్లో హాకీ జట్టు రికార్డు

ముచ్చటగా మూడో పతకం గెలవాలన్న పట్టుదలతో స్టార్‌ షూటర్‌ మను బాకర్‌... ఆమె హ్యాట్రిక్‌ కొట్టి ఇంతవరకూ భారత క్రీడా చరిత్రలో ఎవరూ సాధించిన ఘనత సాధిస్తే చూడాలన్న తలంపుతో అభిమానులు సిద్ధంగా ఉన్నారు. విశ్వ క్రీడల్లో మూడో పతకంపై కన్నేసిన మను బాకర్‌ ఇవాళ మహిళల 25 మీటర్ల పిస్టల్‌ ఫైనల్‌లో తలపడనుంది. ఇప్పటికే రెండు పతకాలు సాధించి మంచి టచ్‌లో ఉన్న మను... ఈ పతకాన్ని కూడా సాధిస్తే... క్రీడా చరిత్రలో ఆమె పేరును సువర్ణ అక్షరాలతో లిఖించుకున్నట్లే. ఇప్పటికే మహిళల 10 మీటర్ల పిస్టల్, మిక్స్‌డ్ టీమ్ 10 మీటర్ల పిస్టల్ ఈవెంలలో కాంస్య పతకాలను గెలుచుకున్న మను.. మూడో పతకం సాధించి కొత్త చరిత్ర సృష్టించాలని చూస్తోంది. ఆర్చరీలో దీపికా కుమారి మళ్లీ ఇవాళ బరిలో దిగనుంది.

భారత ఆర్చర్లు దీపికా కుమారి, భజన్ కౌర్‌లతో పాటు బాక్సర్ నిశాంత్ దేవ్ కూడా నేడు బరిలో దిగనున్నారు. మూడుసార్లు ఒలింపియన్ దీపికా కుమారి 18 ఏళ్ల భజన్ కౌర్‌తో కలిసి మహిళల వ్యక్తిగత ఆర్చరీలో పాల్గొననుంది. 16వ రౌండ్‌లో దీపికా జర్మనీకి చెందిన మిచెల్ క్రోపెన్‌తో తలపడనుంది. భజన్ రెండుసార్లు ఆసియా క్రీడల్లో పతక విజేత ఇండోనేషియాకు చెందిన డియానందా కొయిరునిసాతో తలపడనుంది. ఈ ఒలింపిక్స్‌లో ఇప్పటికే మిక్స్‌డ్ టీమ్ సిల్వర్ మెడల్ సాధించిన క్రోపెన్‌తో దీపిక రౌండ్ ఆఫ్ 16లో తలపడనుంది. పురుషుల 71 కేజీల క్వార్టర్ ఫైనల్‌లో భారత బాక్సర్ నిశాంత్ దేవ్ మార్కో అలోన్సో వెర్డే అల్వారెజ్‌తో తలపడనున్నాడు. గోల్ఫ్‌లో శుభంకర్ శర్మ, గగన్‌జీత్ భుల్లర్ రౌండ్ 3 కోసం పోటీ పడుతున్నారు.

భారత హాకీ జట్టు చరిత్ర సృష్టించింది. 2021 టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించి సుదీర్ఘ పతక నిరీక్షణకు తెరదించిన హాకీ జట్టు... ఈ ఒలింపిక్స్‌లోను పతకం దిశగా దూసుకుపోతోంది. ఈ క్రమంలో అర్ధ శతాబ్దం తర్వాత విశ్వ క్రీడల్లో ఆస్ట్రేలియాను ఓడించి సత్తా చాటింది. 52 ఏళ్ల తర్వాత తొలిసారిగా ఒలింపిక్స్‌లో ఆస్ట్రేలియాను భారత్ ఓడించింది. శుక్రవారం జరిగిన పురుషుల హాకీ పూల్ బీ చివరి మ్యాచ్‌లో భారత్ 3-2తో ఆస్ట్రేలియాను చిత్తు చేసింది. 1972 ఒలింపిక్స్ తర్వాత హాకీలో ఆస్ట్రేలియాను భారత్ ఓడించడం ఇదే తొలిసారి. భారత్ తరఫున అభిషేక్, హర్మన్‌ప్రీత్ సింగ్ (2) గోల్స్ చేయగా, ఆస్ట్రేలియా తరఫున థామస్ క్రెయిగ్, బ్లేక్ గోవర్స్ చెలరేగారు. ఈ విజయంతో భారత్ 5 మ్యాచుల్లో 10 పాయింట్లతో పూల్ బీలో రెండో స్థానానికి ఎగబాకింది. ఈ పూల్‌లో బెల్జియం అగ్రస్థానంలో ఉండగా... భారత్‌ రెండు... ఆస్ట్రేలియా మూడో స్థానంలో ఉంది. న్యూజిలాండ్‌పై విజయంతో ఈ ఒలింపిక్స్‌ను ప్రారంభించిన భారత్, అర్జెంటీనాపై డ్రా చేసుకుని... ఆపై ఐర్లాండ్‌ను ఓడించింది.

Tags

Next Story