IPL: ఐపీఎల్ జాతరకు వేళైంది

క్రికెట్ ప్రేమికుల హుషారును పెంచుతూ... ఇండియన్ ప్రీమియర్ లీగ్ నేటి నుంచి ఆరంభం కానుంది. క్రికెట్ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నIPL సందడికి వేళైంది. నేటి నుంచే 18వ సీజన్ ప్రారంభంకానుంది. డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఓపెనింగ్ మ్యాచ్ జరగనుంది. కోల్‌కతా లోని ఈడెన్ గార్డెన్ లో తొలి మ్యాచ్ జరగనుంది. సాయంత్రం7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. దాదాపు రెండు నెలలపాటు ఐపీఎల్ సందడి చేయనుంది. మే 25న ఫైనల్ జరగనుంది. కొత్త కెప్టెన్లు, మారిన ఆటగాళ్లు, నిబంధనలు.. ఇలాంటి అంశాలతో ఈసారి ఇండియన్ ప్రీమియర్ లీగ్ సరికొత్తగా ముస్తాబైంది. భారీ వేలంలో స్టార్ ఆటగాళ్లు ఫ్రాంచైజీలను మార్చగా.. కొందరు కెప్టెన్లు పాత జట్లకు వీడ్కోలు పలికారు. ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగే ప్రతీ మ్యాచ్‌ను ఆస్వాదించేందుకు అభిమానులు సిద్ధమయ్యారు.
ఈ ఐపీఎల్ ఈ మార్పులు తెలుసా..?
ఈసారి ఐపీఎల్ లో కీలక మార్పులు చేశారు. ఇప్పటికే కొనసాగుతున్న నిబంధనలకు తోడు మరికొన్నింటిని జత చేశారు. ముఖ్యంగా ఈ సీజన్ నుంచి బంతికి ఉమ్మి రాయడంపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయడంతో పేసర్లు అత్యంత ప్రభావం చూపే అవకాశం ఉంది. మంచు ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు అంపైర్ల అంగీకారంతో బంతిని మార్చే వెసులుబాటు కూడా ఉంది. అలాగే ఎత్తు వైడ్లు, ఆఫ్‌స్టంప్ ఆవల వైడ్లను తేల్చేందుకు డీఆర్‌ఎస్ ను వినియోగించనున్నారు.
ఆ జట్లు తలపడితే ఫుల్ క్రేజ్: హర్భజన్
అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్-పాక్ మ్యాచులకు ఏవిధంగా క్రేజ్ ఉంటుందో, IPL ఈవెంట్‌లో చెన్నై-ముంబై మ్యాచులకు అలాంటి క్రేజ్ ఉంటుందని హర్భజన్ సింగ్ అన్నారు. రెండు జట్లలో టాప్ ప్లేయర్స్ ఉన్నారని, అలానే మంచి ఫ్యాన్ బేస్ ఉందన్నారు. ధోనీ ఆట కోసం CSK ఫ్యాన్స్ ఏడాదిగా ఎదురు చూస్తున్నారని తెలిపారు. ఇప్పటి యువ క్రికెటర్లలో రియాన్ పరాగ్ గేమ్ తనకెంతో ఇష్టమని పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com