IPL: ఉత్కంఠపోరులో బెంగళూరు విజయం

చివరి బంతి వరకూ ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో చెన్నైను మరోసారి దురదృష్టం వెంటాడింది. చివరి బంతికు నాలుగు పరుగులు చేయాల్సిన దశలో ఒకే పరుగు రావడంతో చెన్నై కేవలం రెండు పరుగుల తేడాతో పరాజయం పాలైంది. 214 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన చెన్నై 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 211 పరుగులు చేసింది. ఆయుష్ మాత్రే 94, రవీంద్ర జడేజా 77 మెరుపులు మెరిపించారు. ఆర్సీబీ బౌలర్లలో లుంగి ఎంగిడి 3, కృనాల్ పాండ్య, యశ్ దయాళ్ చెరో వికెట్ తీశారు. మొదట బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లకు 5 వికెట్లు నష్టపోయి 213 పరుగులు చేసింది.
రాణించిన ఓపెనర్లు
మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీకి అద్భుతమైన ఆరంభం లభించింది. క్రీజులోకి వచ్చిన జాకబ్ బెతెల్, విరాట్ కోహ్లీ క్రీజ్‌లో ఉన్నంత వరకు రఫ్పాడించారు. 10వ ఓవర్‌లో బెతెల్(55) అర్ధశతకం బాది ఓట్ అయ్యాడు. కోహ్లీ బ్యాటింగ్ బాధ్యత తీసుకొని 28 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించాడు. కానీ 12వ ఓవర్లోనే సామ్ కుర్రాన్ చేతిలో పెవిలియన్‌కు చేరుకున్నాడు. కోహ్లీ 33 బంతుల్లో 62 పరుగులు చేశాడు. దేవదత్ పడిక్కల్(17) పతిరన బౌలింగ్‌లో వెనుదిరిగాడు. రొమారియో షెపర్డ్ చివరి రెండు ఓవర్‌లో ఆరు సిక్సులు, నాలుగు ఫోర్లతో బౌలర్ కు చెమటలు పట్టించాడు. దీంతో బెంగళూరు 213 పరుగులు చేసింది. అనంతరం చెన్నై బ్యాటర్ ఆయుష్ మాత్రే అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 48 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సులతో 94 పరుగులు చేశాడు. జడేజా 77 పరుగులు చేశాడు. చివరి ఓవర్లో యశ్ దయాల్ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో చెన్నైకి ఓటమి తప్పలేదు.
విధ్వంసం.. ఒకే ఓవర్లో 33 పరుగులు
IPL 2025లో భాగంగా CSKతో జరుగుతున్న మ్యాచ్ లో RCB బ్యాటర్ షెపర్డ్ విధ్వంసం సృష్టించాడు. ఖలీల్ అహ్మద్ వేసిన 19వ ఓవర్లో ఏకంగా 33 పరుగులు రాబట్టాడు. ఈ సీజన్ లో ఒక ఓవర్లో ఇదే అత్యధిక స్కోర్ కావడం విశేషం. షెపర్డ్ దెబ్బకు 6,6,4,6,6NB,0,4 పరుగులు వచ్చాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com