IPL: చరిత్ర సృష్టించిన బెంగళూరు

IPL: చరిత్ర సృష్టించిన బెంగళూరు
X
బెంగళూరు చరిత్రలో అత్యధిక లక్ష్య ఛేదన.. శతక్కొట్టిన లక్నో కెప్టెన్ రిషభ్ పంత్

రాయల్‌ ఛాలెంజర్స్ బెంగళూరు చరిత్ర సృష్టించింది. **ఐపీఎల్‌-18లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు క్వాలిఫయర్‌-1కు దూసుకెళ్లింది. **ఐపీఎల్‌ సీజన్‌లో బెంగళూరు జట్టు.. అత్యధిక లక్ష్యాన్ని ఛేదించింది. 228 పరుగుల లక్ష్యాన్ని మరో ఎనిమిది బంతులు మిగిలి ఉండగానే బెంగళూరు ఛేదించేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ భారీ స్కోరు చేసింది. చాలా రోజుల తర్వాత ఫామ్‌లోకి వచ్చిన లక్నో కెప్టెన్‌ రిషభ్‌ పంత్... బెంగళూరు బౌలర్లను శతక్కొట్టాడు. దీంతో లక్నో 227 పరుగుల భారీ స్కోరు చేసింది. రిషభ్ పంత్ 118 పరుగులతో ఆడేజంగా నిలిచాడు. అనంతరం కోహ్లీ, కెప్టెన్ జితేష్ శర్మ అద్భుత ఇన్నింగ్స్‌తో 18.4 ఓవర్లలోనే బెంగళూరు ఘన విజయం సాధించింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో బెంగళూరు రెండో స్థానానికి ఎగబాకింది. పంజాబ్‌తో బెంగళూరు తొలి క్వాలిఫయర్ వన్ ఆడనుంది. ఎలిమనేటర్‌లో ముంబైతో గుజరాత్‌ తలపడనుంది.

మళ్లీ ఫామ్‌లోకి పంత్...

ఐపీఎల్-2025కు ముందు జరిగిన మెగా ఆక్షన్‌లో ఏకంగా రూ.27 కోట్లకు అమ్ముడుపోయిన పంత్‌ మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. చివరి లీగ్‌ మ్యాచ్‌లో శతక్కొట్టాడు. ఇప్పటివరకూ 12 ఇన్నింగ్స్‌ల్లో 135 పరుగులే చేసిన పంత్ ఈ మ్యాచ్‌లో సెంచరీతో కదం తొక్కాడు. ఆర్సీబీతో జరుగుతున్న ఆఖరాటలో చెలరేగి బ్యాటింగ్ చేశాడు. ధనాధన్ బ్యాటింగ్‌తో అలరించిన పంత్‌... 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఓపెనర్ మాథ్యూ బ్రీక్ (14) ఔట్ అవ్వడంతో ముందే బ్యాటింగ్‌కు వచ్చిన పంత్.. ఆరంభం నుంచే బాదుడు మొదలుపెట్టాడు. బౌండరీల మీద బౌండరీలు కొట్టాడు. పవర్ ప్లే అనంతరం పంత్, మార్ష్ దూకుడుగా బ్యాటింగ్ చేశారు. పోటాపడి బౌండరీలు బాదారు. ప్రతీ ఓవర్‌లో ఈ జోడీ బౌండరీలు బాదడంతో లక్నో 10 ఓవర్లలోనే 100 పరుగులు చేసింది. మార్ష్ ఔటైనా.. పూరన్‌తో కలిసి పంత్ దూకుడుగా ఆడాడు. భువనేశ్వర్ కుమార్ వేసిన 18వ ఓవర్‌లో బౌండరీ బాది 54 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రిషభ్ పంత్‌కు ఇది రెండో ఐపీఎల్ సెంచరీ. సెంచరీ పూర్తయిన వెంటనే తన ట్రేడ్ మార్క్ ఫ్లిప్‌ డైవ్‌తో సెలెబ్రేట్ చేసుకున్నాడు. ఆ తర్వాత మరింత దూకుడుగా ఆడిన పంత్.. జట్టుకు 227 పరుగుల భారీ స్కోర్ అందించాడు. 61 బంతుల్లో 118*(11 ఫోర్లు, 8 సిక్సర్లు) పరుగులు చేశాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 135 పరుగులు మాత్రమే చేసిన అతడు ఈ రోజు ఒకప్పటి పంత్‌ను గుర్తు చేశాడు. అటు ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు పంత్ ఫామ్‌లోకి రావడం టీమిండియాకు మంచిదని చెప్పాలి. పంత్‌కు తోడుగా మిచెల్ మార్ష్(37 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో 67) హాఫ్ సెంచరీతో రాణించాడు. ఈ ఇద్దరూ రెండో వికెట్‌కు 155 పరుగులు జోడించారు. ఆర్‌సీబీ బౌలర్లలో నువాన్ తుషార, భువనేశ్వర్ కుమార్, రొమారియో షెపర్డ్ చెరో వికెట్ తీసారు.

జితేష్‌ శర్మ సంచలనం

228 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరుకు శుభారంభం దక్కింది. ఓపెనర్లు 5.4 ఓవర్లకే సాల్ట్- కోహ్లీ 61 పరుగులు జోడించారు. అనంతరం 30 పరుగులు చేసిన సాల్ట్ అవుటయ్యాడు. అనంతరం కోహ్లీ 30 బంతుల్లో 54 పరుగులు చేశాడు. అనంతరం మయాంక్ అగర్వాల్-జితేష్ శర్మ చెలరేగిపోయారు. అకెప్టెన్‌ జితేశ్‌ శర్మ (85:33 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స్‌లు) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. విరాట్‌ కోహ్లీ (54: 30 బంతుల్లో 10 ఫోర్లు), మయాంక్‌ అగర్వాల్‌ (41*: 23 బంతుల్లో 5 ఫోర్లు) దంచికొట్టారు. లఖ్‌నవూ బౌలర్లలో విలియమ్‌ ఒరూర్కే 2, అవేశ్‌ ఖాన్‌ ఒక వికెట్‌ పడగొట్టారు. ఈ మ్యాచ్‌తో లీగ్‌ దశ పూర్తయింది. ఈ నెల 29న క్వాలిఫయర్‌-1లో పంజాబ్‌తో బెంగళూరు ఢీకొట్టనుంది. ఇందులో గెలిచిన జట్టు ఫైనల్‌కు దూసుకెళుతుంది. ఓడిన జట్టు క్వాలిఫయర్‌-2లో తలపడనుంది.

Tags

Next Story