IPL: చెన్నై పరాజయాలకు బ్రేక్

ఐపీఎల్-18లో చెన్నై సూపర్‌కింగ్స్ పరాజయాల పరంపరకు బ్రేక్ పడింది. అయిదు ఓటముల తర్వాత ధోనీ సేనకు విజయం లభించింది. లఖ్‌నవూతో జరిగిన మ్యాచులో చెన్నై గెలుపొందింది. తొలుత లఖ్‌నవూను తక్కువ పరుగులకే కట్టడి చేసిన చెన్నై.. ఆ తర్వాత మరో మూడు బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. వరుసగా విఫలమవుతున్న ధోనీ చివరి వరకూ క్రీజులో నిలిచి విజయాన్ని అందించాడు.
తడబడ్డ లఖ్‌నవూ బ్యాటర్లు
టాస్ నెగ్గి బౌలింగ్ ఎంపిక చేసుకున్న చెన్నైకు శుభారంభం దక్కింది. నాలుగు ఓవర్లలోనే రెండు వికెట్లు పడగొట్టి లఖ్‌నవూను ఒత్తిడిలోకి నెట్టింది. దూకుడుగా ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఐడెన్ మార్క్‌రమ్‌ను మంచి క్యాచ్ అందుకున్న త్రిపాఠి పెవిలియన్‌కు పంపాడు. నికోలస్ పూరన్‌ను కాంబోజ్ ఎల్‌బీడబ్ల్యూగా ఔటయ్యాడు. దీంతో నాలుగు ఓవర్లకే రెండు వికెట్లు కోల్పోయి లక్నో కష్టాల్లో పడింది. మిచెల్ (30)ను క్లీన్ బౌల్డ్ చేసి రవీంద్ర జడేజా 50 పరుగుల పార్ట్‌నర్‌షిప్‌కు తెరదింపాడు. రిషబ్ పంత్ (63; 49 బంతుల్లో 4×4, 4×6) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడడంతో లఖ్‌నవూ 7 వికెట్లకు 166 పరుగులు చేసింది.
మరోసారి పనిచేసిన ధోనీ రివ్యూ
డీఆర్‌ఎస్‌కు ధోనీ రివ్యూ సిస్టం అని ఆయన అభిమానులు ముద్దుగా పిలుచుకుంటారు. అది నిజమేనని మరోసారి రుజువైంది. నాలుగో ఓవర్‌లో కాంబోజ్ వేసిన బంతి నికోలస్ పూరన్ ప్యాడ్లను తాకింది. అందరూ అప్పీల్ చేసినా అంపైర్ నాటౌట్‌గా ప్రకటించాడు. ఇక, అప్పుడే ధోనీ డీఆర్‌ఎస్‌కు వెళ్లారు. ఆ రివ్యూలో పూరన్ ఔటైనట్లు తేలింది. ఇక, మిస్టర్ కూల్, సీఎస్‌కే అభిమానులు మరోసారి సంబురాల్లో మునిగిపోయారు.
నిలిచిన ధోనీ, రషీద్
ఛేదనలో చెన్నైకి శుభారంభం దక్కింది. కొత్త ఓపెనర్, ఆంధ్ర కుర్రాడు షేక్ రషీద్ బౌండరీల మోత మోగిస్తూ చెన్నై ఛేదనను ధాటిగా ఆరంభించాడు. మరో ఓపెనర్ రచిన్ రవీంద్ర సైతం నిలకడగా ఆడడంతో చెన్నై 4 ఓవర్లకే 45 పరుగులు చేసింది. కానీ పార్ట్‌టైమ్ స్పిన్నర్ మార్‌క్రమ్.. రచిన్‌ను ఔట్ చేసి చెన్నైని కష్టాల్లోకి నెట్టాడు. శివమ్ దూబె నిలిచినా.. త్రిపాఠి (8), జడేజా (7), విజయ్ శంకర్ (9) పెవిలియన్‌కు క్యూ కట్టేశారు. చెన్నై చివరి 5 ఓవర్లలో 56 పరుగులు చేయాల్సిన దశలో ధోనీ (26 నాటౌట్; 11 బంతుల్లో 4×4, 1×6) రాణించడంతో 19.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com