IPL: తిలక్ తుఫానులో గుజరాత్ గల్లంతు

ఐపీఎల్లో ఎప్పుడూ అనూహ్య మలుపులు సాధారణమే. కానీ ఒక మ్యాచ్‌లో జట్టు దాదాపు ఓటమి అంచుల నుంచి తిరిగి వచ్చి, ప్రత్యర్థిపై పూర్తిగా ఆధిపత్యం చెలాయించడం మాత్రం అరుదైన విషయం. అలాంటి అరుదైన పోరాటానికి వేదికైంది అహ్మదాబాద్. ఒక దశలో చేతులు ఎత్తేసినట్లు కనిపించిన ముంబయి ఇండియన్స్, ఒక్క ఆటగాడి అసాధారణ ప్రదర్శనతో మ్యాచ్‌ను మాత్రమే కాదు—తమ సీజన్‌ను కూడా మళ్లీ గాడిలో పెట్టుకున్నట్టైంది. ఆ ఆటగాడు ఎవరో కాదు… తెలుగు కుర్రాడు తిలక్ వర్మ.
వర్తు వర్మ వర్తు
ముంబయి ఇండియన్స్‌కు ఈ సీజన్ ఆరంభం ఆశాజనకంగా ఉన్నప్పటికీ, ఆ తర్వాత వరుసగా నాలుగు ఓటములు జట్టును తీవ్ర ఒత్తిడిలోకి నెట్టాయి. పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉండటంతో ఈ మ్యాచ్ వారికి ‘డూ ఆర్ డై’లా మారింది. గుజరాత్ టైటాన్స్ వంటి బలమైన జట్టుతో పోరాటం అంటే మరో పరీక్షే. అయితే మ్యాచ్ ప్రారంభ దశలో చూసిన వాళ్లందరికీ ముంబయి మరోసారి ఓడిపోతుందని అనిపించింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ముంబయి ఇండియన్స్ ఆరంభం ఆశించినంత బాగాలేదు. ఓపెనర్లు త్వరగా ఔటవడంతో స్కోరు ముందుకు కదల్లేదు. మధ్యలో వచ్చిన బ్యాటర్లు కూడా ఎక్కువసేపు నిలబడలేకపోయారు. ముఖ్యంగా రబాడ బౌలింగ్ ముంబయి టాప్ ఆర్డర్‌ను కుదిపేసింది. పవర్‌ప్లే ముగిసే సరికి జట్టు 46 పరుగులకు మూడు కీలక వికెట్లు కోల్పోయింది. తర్వాత కూడా పరుగుల రేటు పెరగలేదు. 14 ఓవర్లు పూర్తయ్యే సరికి స్కోరు కేవలం 103/4 మాత్రమే. అప్పటికే మ్యాచ్ గుజరాత్ చేతుల్లోకి వెళ్లిపోయినట్లే కనిపించింది. ఈ సమయంలో క్రీజులో ఉన్న తిలక్ వర్మ కూడా చాలా నెమ్మదిగా ఆడుతున్నాడు. మొదటి 22 బంతుల్లో అతను చేసినవి కేవలం 19 పరుగులే. ఒక్క బౌండరీ కూడా లేదు. అలా కొనసాగితే ముంబయి 160 పరుగులు కూడా చేయలేనట్టే అనిపించింది. కానీ క్రికెట్లో ఒక్క క్షణం చాలు—గేమ్ మారిపోవడానికి. 15వ ఓవర్ నుంచి తిలక్ ఆట పూర్తిగా మారిపోయింది. ఒక్కసారిగా గేర్ మార్చిన అతను గుజరాత్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ముందుగా ప్రసిద్ధ్ కృష్ణ ఓవర్లో బౌండరీలు బాది వేగం పెంచాడు. తర్వాత రషీద్ ఖాన్ వంటి స్టార్ బౌలర్‌ను కూడా విడిచిపెట్టలేదు. అశోక్ శర్మ వేసిన ఓవర్లో అయితే అతను నిజంగా విధ్వంసం సృష్టించాడుఆ ఓవర్లో వరుసగా భారీ షాట్లు కొట్టి మ్యాచ్‌ను తారుమారు చేశాడు. తిలక్ వర్మ చివరి 23 బంతుల్లో చేసిన 82 పరుగులు మ్యాచ్‌కు టర్నింగ్ పాయింట్‌గా నిలిచాయి. చివరి ఓవర్లో కూడా అదే దూకుడు కొనసాగించి తన శతకాన్ని పూర్తి చేశాడు. మొత్తం 45 బంతుల్లో 101 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన తిలక్, తన కెరీర్లో తొలి ఐపీఎల్ సెంచరీ నమోదు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 7 సిక్సర్లు ఉండటం విశేషం.
చేసిన స్కోరు సరిపోతుందా అన్న సందేహం ఉన్నప్పటికీ, ముంబయి బౌలర్లు అద్భుత ప్రదర్శనతో అందరి అంచనాలను తారుమారు చేశారు. బుమ్రా తొలి బంతికే వికెట్ తీసి గుజరాత్‌పై ఒత్తిడి పెంచాడు. ఆ తర్వాత అశ్వని కుమార్ అద్భుతంగా బౌలింగ్ చేసి కీలక వికెట్లు తీసి మ్యాచ్‌ను పూర్తిగా ముంబయి వైపు తిప్పాడు. గుజరాత్ బ్యాటింగ్ పూర్తిగా విఫలమైంది. స్టార్ ఆటగాళ్లు గిల్, బట్లర్ త్వరగా ఔటవడం తో జట్టు కుదేలైంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
