IPL: రేపే ఐపీఎల్ 2026 మినీ వేలం.. ఆ ఆటగాళ్లకు భారీ ధర

క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న టాటా ఐపీఎల్ 2026 సీజన్ ప్లేయర్ వేలానికి రంగం సిద్ధమైంది. ఈసారి జరగబోయేది మెగా వేలం కాదు, మినీ వేలం. రేపు డిసెంబర్ 16 వ తేదీన అబుదాబి వేదికగా ఈ వేలం పాట జరగనుంది. మధ్యాహ్నం 1:00 గంటలకు అంటే భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2:30 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో ఆర్టీఎమ్ (RTM) కార్డ్ నిబంధన, వేలం ప్రక్రియ, ఆటగాళ్ల జాబితా ఆసక్తిని పెంచుతున్నాయి. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధికారికంగా విడుదల చేసిన సమాచారం ప్రకారం, ఐపీఎల్ 2026 వేలం కోసం మొత్తం 1390 మంది ఆటగాళ్లు రిజిస్టర్ చేసుకున్నారు. తుది జాబితాను 350 మందికి కుదించారు. ఇందులో 240 మంది భారతీయ ఆటగాళ్లు ఉండగా, 110 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. ఫ్రాంచైజీలు తమ జట్లను బలోపేతం చేసుకోవడానికి మొత్తం 77 ఖాళీలను భర్తీ చేయాల్సి ఉంది. ఇందులో 31 స్థానాలు విదేశీ ఆటగాళ్ల కోసం కేటాయించారు. ముఖ్యంగా, అత్యధిక రిజర్వ్ ధర అయిన రూ. 2 కోట్ల విభాగంలో 40 మంది ఆటగాళ్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఐపీఎల్ వేలంలో తరచుగా వినిపించే పదం 'రైట్ టు మ్యాచ్' (RTM) కార్డ్. అయితే, ఐపీఎల్ 2026 మినీ వేలంలో ఫ్రాంచైజీలకు ఆర్టీఎమ్ కార్డ్ ఉపయోగించే అవకాశం లేదు. నియమాల ప్రకారం, జట్లు తాము విడుదల చేసిన ఆటగాడిని మళ్లీ దక్కించుకోవడానికి ఈ కార్డును కేవలం మెగా వేలంలోనే ఉపయోగించగలవు. మినీ వేలంలో ఈ వెసులుబాటు ఉండదు. ఐపీఎల్ 2014 మెగా వేలానికి ముందు ప్రవేశపెట్టారు.
ఆ తర్వాత 2018 మెగా వేలంలో కూడా కొనసాగించారు కానీ 2022 సీజన్ ముందు దీనిని తొలగించారు. గతంలో మెగా వేలంపాటల్లో గరిష్ఠంగా మూడు ఆర్టీఎమ్ కార్డులను అనుమతించేవారు. ఈసారి ఐపీఎల్ వేలంలో యువ ప్రతిభకు పెద్దపీట వేశారు. షార్ట్‌లిస్ట్ చేసిన 350 మందిలో 224 మంది అన్‌క్యాప్డ్ (జాతీయ జట్టుకు ఆడని) భారతీయ ఆటగాళ్లు ఉండటం విశేషం.
క్యాప్డ్, అన్‌క్యాప్డ్ ఆటగాళ్ల వివరాలు
• క్యాప్డ్ ఇండియన్స్: 16 మంది
• క్యాప్డ్ ఓవర్సీస్ (విదేశీ): 96 మంది
• అన్‌క్యాప్డ్ ఇండియన్స్: 224 మంది
• అన్‌క్యాప్డ్ ఓవర్సీస్: 14 మంది
ఫ్రాంచైజీలు అందరూ కూడా తమ వ్యూహాలను సిద్దం చేశాయి. ఈ క్రమంలోనే భారీ పర్స్‌తో బరిలోకి దిగుతోన్న చెన్నై సూపర్ కింగ్స్.. తమ జట్టులో ఖాళీగా ఉన్న 9 స్లాట్లను భర్తీ చేసేందుకు పక్కా ప్రణాళికలు సిద్దం చేసింది. తొమ్మిదిలో నాలుగు విదేశీ స్లాట్లు ఉండగా.. వాటికోసం పక్కాగా కీలక ఆటగాళ్లను కొనుగోలు చేయనుంది. 6వ నెంబర్ ఫినిషర్, ఇండియన్ స్పిన్నర్, విదేశీ డెత్ ఓవర్ పేసర్, ఇండియన్ మిడిల్, డెత్ పేసర్, విదేశీ ఓపెనింగ్ బ్యాటర్, ఇండియన్ స్పిన్ ఆల్-రౌండర్, ఇండియన్ పేస్ ఆల్-రౌండర్, బ్యాకప్ ఇండియన్ ఫినిషర్, విదేశీ స్పిన్ ఆల్-రౌండర్ కోటాలను చెన్నై భర్తీ చేయాల్సి ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

