IPL: అదరగొట్టిన అయ్యర్ - రేసులోనే పంజాబ్

ఐపీఎల్-19 లీగ్ దశ చివరి దశకు చేరుకున్న సమయంలో ప్లేఆఫ్స్ పోరు మరింత ఉత్కంఠగా మారింది. ఒక దశలో వరుస విజయాలతో అగ్రస్థానంలో దూసుకెళ్లిన పంజాబ్ కింగ్స్, ఆ తర్వాత అనూహ్యంగా వరుస పరాజయాలతో తీవ్ర ఒత్తిడిలో పడింది. ఆరు వరుస విజయాలతో ప్లేఆఫ్స్ బెర్త్‌ను ముందుగానే ఖరారు చేసుకునే జట్టుగా కనిపించిన పంజాబ్, తర్వాత వరుసగా ఆరు మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూసి తన అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. అయితే కీలక సమయానికి తిరిగి పుంజుకున్న ఆ జట్టు, గెలిస్తేనే ఆశలు నిలిచే మ్యాచ్‌లో అసాధారణ ప్రదర్శనతో విజయం సాధించి ప్లేఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌తో జరిగిన కీలక పోరులో పంజాబ్ కింగ్స్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అసాధారణ ఇన్నింగ్స్‌తో జట్టును ముందుండి నడిపించాడు. అతడు కేవలం 51 బంతుల్లోనే 11 ఫోర్లు, 5 సిక్స్‌ల సాయంతో అజేయంగా 101 పరుగులు చేసి తన ఐపీఎల్ కెరీర్లో తొలి శతకాన్ని నమోదు చేశాడు. అతడికి ప్రభ్‌సిమ్రన్ సింగ్ నుంచి అద్భుత సహకారం లభించింది. ప్రభ్‌సిమ్రన్ 39 బంతుల్లో 69 పరుగులు చేసి పంజాబ్ విజయానికి బలమైన పునాది వేశాడు.
మొదట బ్యాటింగ్ చేసిన లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. ఓపెనర్ జోష్ ఇంగ్లిస్ ఇన్నింగ్స్‌కు ప్రధాన బలంగా నిలిచాడు. 44 బంతుల్లో 72 పరుగులు చేసి జట్టుకు బలమైన స్కోరు అందించడంలో కీలక పాత్ర పోషించాడు. అతడి ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లు ఉన్నాయి. మధ్యలో ఆయుష్ బదోని కూడా దూకుడుగా ఆడి 18 బంతుల్లో 43 పరుగులు చేశాడు. చివర్లో సమద్ 20 బంతుల్లో అజేయంగా 37 పరుగులు చేసి స్కోరును 200కు చేరువ చేశాడు. పంజాబ్ బౌలర్లు సరైన సమయంలో వికెట్లు పడగొట్టి ప్రత్యర్థి జోరును నియంత్రించారు. చాహల్ 25 పరుగులకు రెండు వికెట్లు తీయగా, యాన్సెన్ కూడా రెండు వికెట్లు పడగొట్టాడు. వీరి ప్రదర్శన కారణంగా లఖ్‌నవూ భారీ స్కోరు దిశగా వెళ్లకుండా ఆగిపోయింది. 197 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ ఆరంభంలోనే కష్టాల్లో పడింది. షమి తన పదునైన బౌలింగ్‌తో తొలి దశలోనే పంజాబ్‌ను ఒత్తిడిలోకి నెట్టాడు. ఇన్నింగ్స్ తొలి బంతికే ఫామ్‌లో ఉన్న ప్రియాంశ్‌ను డకౌట్ చేసిన షమి, తర్వాత కనోలీ వికెట్‌ను కూడా పడగొట్టాడు. దీంతో పంజాబ్ 22 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడింద ఈ క్లిష్ట సమయంలో కెప్టెన్ శ్రేయస్, ప్రభ్‌సిమ్రన్ బాధ్యత తీసుకున్నారు.
ప్రభ్‌సిమ్రన్ కేవలం 28 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకోగా, శ్రేయస్ 33 బంతుల్లోనే హాఫ్‌సెంచరీ సాధించాడు. ఇద్దరూ వేగంగా పరుగులు సాధించడంతో విజయ సమీకరణం సులభంగా మారింది. అయితే మంచి జోరుమీదున్న ప్రభ్‌సిమ్రన్‌ను అర్జున్ తెందుల్కర్ అద్భుత యార్కర్‌తో ఎల్బీగా వెనక్కి పంపాడు. కానీ శ్రేయస్ మాత్రం ఎలాంటి అవకాశమివ్వలేదు. షమి వేసిన 16వ ఓవర్లో వరుసగా మూడు భారీ సిక్స్‌లు బాది మ్యాచ్‌ను పూర్తిగా పంజాబ్ చేతుల్లోకి తీసుకొచ్చాడు. చివరకు మోసిన్‌ఖాన్ వేసిన 18వ ఓవర్ చివరి బంతిని శ్రేయస్ భారీ సిక్స్‌గా మలిచి జట్టుకు విజయాన్ని అందించడమే కాకుండా తన శతకాన్ని కూడా పూర్తి చేశాడు. అతడి మెరుపు ఇన్నింగ్స్ పంజాబ్‌కు అత్యంత కీలక సమయంలో ఊపిరి పోసింది.ఇక మ్యాచ్‌కు మరో ప్రత్యేక ఆకర్షణగా సచిన్ తెందుల్కర్ తనయుడు అర్జున్ తెందుల్కర్ నిలిచాడు. లఖ్‌నవూ తరఫున అతడు తొలిసారిగా బరిలోకి దిగాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
