IPL: రాజస్థాన్‌లోకి జడేజా..చెన్నైలోకి సంజూ శాంసన్

ఐపీఎల్ 2026కు ముందు ఆయా ఫ్రాంఛైజీల మధ్య జరిగిన ట్రేడ్ అభిమానుల్లో ఆసక్తి రేపుతోంది. తాజాగా ఎనిమిది మంది ఆటగాళ్ల ట్రేడ్ పూర్తయినట్టు ఐపీఎల్ ధ్రువీకరించింది. ముందునుంచి వార్తలు వస్తున్నట్లుగానే రవీంద్రజడేజా, సామ్‌కరణ్ రాజస్థాన్ రాయల్స్ గూటికి, సంజుశాంసన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోకి వచ్చారు. మహ్మద్ షమీ.. సన్‌రైజర్స్ హైదరాబాద్ నుంచి లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌కు మారాడు. సచిన్ తెందూల్కర్ కుమారుడు అర్జున్ తెందూల్కర్ ముంబయి ఇండియన్స్ నుంచి లఖ్‌నవూ జట్టులోకి వచ్చాడు. మయాంక్ మార్కండే కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు నుంచి ముంబయి టీమ్‌లోకి వచ్చాడు. నితీశ్ రాణా రాజస్థాన్ రాయల్స్ నుంచి ఢిల్లీ క్యాపిటల్స్‌కు, డోనోవన్ ఫెరీరా దిల్లీ క్యాపిటల్స్ నుంచి రాజస్థాన్ రాయల్స్ జట్టులోకి వచ్చారు.
సంజూ కోసం విశ్వ ప్రయత్నం
అనుకున్నట్టుగానే ఐపీఎల్ 2026 సీజన్లో సంజూ శాంసన్, చెన్నై సూపర్ కింగ్స్ టీమ్‌కి ఆడబోతున్నాడు. అతన్ని సీఎస్కే టీమ్‌కి ఇచ్చిన రాజస్థాన్ రాయల్స్, బదులుగా సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాని టీమ్‌లోకి తెచ్చుకుంది. చెన్నై సూపర్ కింగ్స్ తరుపున 12 సీజన్లు ఆడిన రవీంద్ర జడేజాకి ఐపీఎల్ 2025 సీజన్లో రూ.18 కోట్లతో రిటెన్షన్ దక్కింది. అయితే దాన్ని రూ.14 కోట్లకు తగ్గించి, ట్రేడ్ చేసుకుంది రాజస్థాన్ రాయల్స్. ఐపీఎల్ 2026 సీజన్లో రవీంద్ర జడేజా రూ.14 కోట్లు అందుకోబోతున్నాడు. అలాగే ఆల్‌రౌండర్ సామ్ కర్రన్ కూడా చెన్నై సూపర్ కింగ్స్ నుంచి రాజస్థాన్ రాయల్స్‌లోకి వెళ్లబోతున్నాడు. అతన్ని రూ.2.4 కోట్ల ప్రస్తుత ధరకే ట్రేడ్ చేసుకుంది రాజస్థాన్ రాయల్స్. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్, వికెట్ కీపర్ ఎమ్మెస్ ధోనీ, ఐపీఎల్ రిటైర్మెంట్ ఖాయం కావడంతో తన ప్లేస్‌ని రిప్లేస్ చేయగల సత్తా ఉన్న వికెట్ కీపింగ్ బ్యాటర్ కోసం చూసిన చెన్నై సూపర్ కింగ్స్, సంజూ శాంసన్ కోసం విశ్వ ప్రయత్నాలు చేసింది. తొలుత రవిచంద్రన్ అశ్విన్, శివమ్ దూబే వంటి ప్లేయర్లను రాజస్థాన్ రాయల్స్‌కి ఇచ్చేందుకు చెన్నై సూపర్ కింగ్స్ ఆఫర్ ఇచ్చింది. అయితే దానికి రాజస్థాన్ రాయల్స్ ఒప్పుకోలేదు. అశ్విన్, ఐపీఎల్ రిటైర్మెంట్ కూడా ఇవ్వడంతో ఇప్పుడు ఆ ఛాన్స్ కూడా లేదు.. ఎట్టకేలకు రవీంద్ర జడేజా, సామ్ కర్రన్‌లతో ఢీల్ ఫైనల్ చేసుకుంది.
ఎడమొహం-పెడమొహం
రాజస్థాన్ రాయల్స్‌ను ప్రతి ఏడాది అగ్ర స్థానంలో నిలపడంలో సంజు శాంసన్ కృషి చెప్పలేనిది. అయితే, ఐపీఎల్ 2025 తర్వాత రాజస్థాన్ మేనేజ్మెంట్తో ఎడమొహం పెడమొహంగా ఉంటున్నాడు. దీనికి ప్రధాన కారణంగా ఐపీఎల్ 2025 మెగా వేలంలో జోస్ బట్లర్‌ను రాజస్థాన్ వదిలేయడమే. ఈ విషయాన్ని సంజు శాంసన్ కూడా చాలా సందర్భాల్లో చెప్పాడు. గత సీజన్లో రూ. 18 కోట్లకు సంజుని రిటైన్ చేసుకున్న రాజస్థాన్ ఫ్రాంఛైజీ అతనితో ఎక్కువ మ్యాచ్‌లు కూడా ఆడించలేదు. చెన్నై సూపర్ కింగ్స్‌కి రవీంద్ర జడేజా ప్రధాన వెన్నెముకగా ఉన్నాడు. 2012లో సీఎస్కేలో చేరిన జడ్డూ టైటిల్స్ అందించడంలో కీలకంగా మారాడు. పదేళ్లకు పైగా సీఎస్కేతో అనుబంధం ఉన్న జడ్డూ మూడు టైటిల్స్‌లో కీలక పాత్ర పోషించాడు. ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు జడేజాని సీఎస్కే రూ.18 కోట్లకు రిటైన్ చేసుకుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

