IPL: ఐపీఎల్లో కరీంనగర్ కుర్రాడు

కరీంనగర్ జిల్లాకు చెందిన యువ క్రికెటర్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) వేదికపై తన ముద్ర వేసేందుకు సిద్ధమయ్యాడు. సైదాపూర్ మండలం వెన్నంపల్లికి చెందిన 21 ఏళ్ల పేరాల అమన్‌రావు.. మంగళవారం జరిగిన ఐపీఎల్ వేలంలో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ఎంపికయ్యారు. ఈ వేలంలో రాజస్థాన్ ఫ్రాంచైజీ అతడిని రూ. 30 లక్షలకు దక్కించుకుంది. ప్రస్తుతం అమన్ రావు హైదరాబాద్ అండర్-23 జట్టు తరఫున రంజీ క్రికెట్ టోర్నీలో రాణిస్తున్నారు. ఇటీవలే ముగిసిన సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నమెంట్లో అమన్ తన మెరుపులతో అందరి దృష్టిని ఆకర్షించారు. 160 స్ట్రైక్ రేట్‌తో రెండు అర్ధ సెంచరీలు సాధించి తన బ్యాటింగ్ సత్తాను చాటుకున్నారు. ఈ అద్భుత ప్రదర్శనే ఐపీఎల్ తలుపులు తెరిచేలా చేసింది.
పలువురు అమన్ రావును అభినందిస్తున్నారు. మొట్టమొదటి సారిగా కరీంనగర్ జిల్లాకు చెందిన కుర్రాడు ఐపీఎల్‌కు ఎంపిక కావడం హర్షణీయమని బీజేపీ నాయకులు, మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు అన్నారు. అమన్ రావు... అండర్ 23 ముస్తాక్ అలీ క్రికేట్ టోర్నమెంట్ ఆటలో 160 స్ట్రైక్ రేట్ తో గొప్పగా ప్రదర్శించి, 250 పైగా స్కోర్ సాదించారని ప్రశంసించారు. అమన్‌రావు తండ్రి పేరాల మధుసూదన్‌రావు కరీంనగర్ హిందూ క్రికెట్ జట్టులో సభ్యుడిగా కొన్నేళ్ల కిందట జిల్లా స్థాయి క్రికెట్ ఆడారని చెప్పారు. ఐపీఎల్‌కు ఎంపికైన అమన్ ఐపిఎల్ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్ టీం తరుపున గొప్ప ప్రదర్శన ఇచ్చి కరీంనగర్ జిల్లాకు మంచి పేరు తెచ్చిపెట్టాలని ఆశాభావం వ్యక్తం చేశారు. వేలంలో పాల్గొనేందుకు అమన్‌రావుకు పాస్‌పోర్టు లేకపోవడంతోకేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ దృష్టికి తీసుకెళ్లడంతో, వెంటనే స్పందించి ఒక్క రోజులో పాస్ పోర్ట్ ఇప్పించి, వేలంలో పాల్గొనేలా చేశారని చెప్పారు. బండి సంజయ్ కు అమన్ ధన్యవాదాలు తెలిపారు.
వారసత్వంగానే...
అమన్ రావుకు క్రికెట్ పట్ల మక్కువ వారసత్వంగానే లభించింది. ఆయన తండ్రి పేరాల మధుసూదన్‌రావు గతంలో కరీంనగర్ హిందూ క్రికెట్ జట్టులో సభ్యుడిగా జిల్లా స్థాయి క్రికెట్ ఆడారు. కుమారుడి ప్రతిభను గుర్తించి అతనికి మెరుగైన శిక్షణ అందించడం కోసం వీరి కుటుంబం కొన్నేళ్ల కిందట హైదరాబాద్‌కు వలస వెళ్లింది. కేవలం క్రీడల్లోనే కాకుండా.. రాజకీయంగా కూడా వీరి కుటుంబానికి మంచి గుర్తింపు ఉంది. అమన్‌రావు తాత పేరాల గోపాల్‌రావు గతంలో జిల్లా పరిషత్ వైస్ ఛైర్మన్‌గా సేవలందించారు. కరీంనగర్ మట్టి నుంచి ఎదిగిన ఒక యువకుడు దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన లీగ్‌లో భాగం కావడం జిల్లాకు గర్వకారణంగా మారింది. ఉత్కంఠభరితంగా సాగిన ఐపీఎల్ 2026 మినీ వేలం ముగిసింది. ఈ వేలంలో మొత్తం పది ఫ్రాంచైజీలు పోటీపడి రూ. 215.45 కోట్లు వెచ్చించి తమకు కావాల్సిన ఆటగాళ్లను సొంతం చేసుకున్నాయి. మొత్తం 77 మంది ఆటగాళ్లు అమ్ముడుపోగా.. అందులో 29 మంది విదేశీ ప్లేయర్లు ఉండటం గమనార్హం. ఈ వేలంలో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) ఫ్రాంచైజీ ఏకంగా రూ. 25.20 కోట్లు వెచ్చించి గ్రీన్‌ను దక్కించుకుంది. గ్రీన్‌తో పాటు శ్రీలంక పేసర్ మతీషా పతిరణను కూడా రూ. 18 కోట్లకు కేకేఆర్ దక్కించుకుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

