IPL: ఉత్కంఠభరిత మ్యాచ్‌లో లక్నోదే గెలుపు

IPL: ఉత్కంఠభరిత మ్యాచ్‌లో లక్నోదే గెలుపు
X
చివరి వరకూ పోరాడి ఓడిన ముంబై.. రాణించిన మార్ష్, సూర్యకుమార్

ఐపీఎల్‌లో చివరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచులో ముంబై ఇండియన్స్‌పై లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ విజయం సాధించింది. ఏకనా క్రికెట్ స్టేడియంలో ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో 12 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన లఖ్‌నవూ 203 పరుగులు చేసింది. అనంతరం 204 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్.. ఎల్ఎస్‌జీ కట్టుదిట్టమైన బౌలింగ్ కారణంగా 5 వికెట్లు కోల్పోయి 191 పరుగులకే పరిమితం కావాల్సి వచ్చింది.

మెరిసిన మార్ష్‌, మార్‌క్రమ్‌

తొలుత టాస్‌ ఓడి బ్యాటింగ్‌ చేసిన లఖ్‌నవూ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. ఓపెనర్లు మిచెల్‌ మార్ష్‌ (60: 31 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లు), మార్‌క్రమ్‌ (53: 38 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) దంచికొట్టారు. తొలి వికెట్‌కు ఈ జోడీ 76 పరుగులు చేసి జట్టుకు శుభారంభం అందించారు. మార్ష్ మెరుపులకు తోడు మార్కరం హాఫ్ సెంచరీతో ముంబై ముందు టఫ్ టార్గెట్ పెట్టింది. అయుష్‌ బదోనీ (30: 19 బంతుల్లో 4 ఫోర్లు), డేవిడ్‌ మిల్లర్‌ (27: 14 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్స్‌) రాణించారు. కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌ (2) మరోసారి విఫలమయ్యాడు. పూరన్‌ (12), అబ్దుల్‌ సమద్‌ (4), శార్దుల్‌ ఠాకూర్‌ (5*), ఆకాశ్‌ దీప్‌ (0), అవేశ్‌ ఖాన్‌ (2*) పరుగులు చేశారు. ముంబయి బౌలర్లలో కెప్టెన్‌ హార్దిక్‌ అదరగొట్టాడు. 4 ఓవర్లు వేసిన పాండ్య 36 పరుగులు ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. బౌల్ట్‌, అశ్వని కుమార్‌, విఘ్నేశ్‌ పుతుర్‌ ఒక్కో వికెట్‌ తీశారు.

చివరి వరకు పోరాడినా...

204 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన ముంబయికి రెండో ఓవర్లోనే షాక్‌ తగిలింది. ఆకాశ్‌ దీప్‌ బౌలింగ్‌లో ఓపెనర్‌ విల్‌ జాక్స్‌ (5) రవిబిష్ణోయ్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. ఆ తర్వాతి ఓవర్లో శార్దూల్‌ ఠాకూర్‌ బౌలింగ్‌లో రికెల్టన్‌ ఔటయ్యాడు. ఛేదనలో ఆదిలోనే ఒత్తిడి గురైన ముంబై ఇండియన్స్ మ్యాచ్ మొదట్లోనే వికెట్లు కోల్పోయి చిక్కుల్లో పడింది. ఆ తరువాత సూర్యకుమార్ కాస్త నెమ్మదిగా ప్రారంభించినా మిడిల్ ఓవర్స్‌లో వేగం పుంజుకున్నాడు. ఈ క్రమంలో భారీ షాట్ ఆడబోయి 67 పరుగుల వద్ద అవుటయ్యాడు. దిగ్వేశ్‌ వేసిన తొమ్మిదో ఓవర్‌ తొలిబంతికి నమన్‌ బౌల్డ్‌ అయ్యాడు. వికెట్‌ పడ్డప్పటికీ మరో ఎండ్‌లో ఉన్న సూర్యకుమార్‌ మరింత దూకుడుగా ఆడాడు. బిష్ణోయ్‌ బౌలింగ్‌లో ఫోర్‌ కొట్టిన సూర్య అర్ధశతకం (31 బంతుల్లో) చేశాడు. చివరి రెండు ఓవర్లలో ముంబయి విజయానికి 29 పరుగులు అవసరం కాగా.. ఆ జట్టు విజయం సాధిస్తుందని అంతా అనుకున్నారు. 19వ ఓవర్లో తొలి ఐదు బంతులకు కేవలం ఐదు సింగిల్సే వచ్చాయి. దీంతో ఇరుజట్లలోనే ఉత్కంఠ పెరిగింది. తిలక్‌ వర్మ పరుగులు తీయడానికి ఇబ్బంది పడ్డాడు. ఈక్రమంలో అదే ఓవర్‌లో రిటైర్‌ ఔట్‌గా పెవిలియన్‌ చేరాడు.

చివరి ఆరు బంతుల్లో...

చివరి ఓవర్లో 22 పరుగులు అవసరం అయ్యాయి. తొలి బంతికి హార్దిక్‌ సిక్స్‌ కొట్టాడు. రెండో బంతికి 2 పరుగులు తీశారు. తర్వాతి నాలుగు బంతుల్లో కేవలం ఒక సింగిలే తీశారు. దీంతో ముంబయి విజయం ముంగిట బోల్తాపడింది. చివరి ఓవర్లో 22 పరుగులు రాబట్టాల్సిన అవేశ్ ఖాన్ కట్టుదిట్టమైన బౌలింగ్ కారణంగా ముంబై కేవలం 10 పరుగులే రాబట్టి ఓటమి చవి చూడాల్సి వచ్చింది.

Tags

Next Story