IPL: ఒకటి కాదు..రెండు ఐపీఎల్ జట్లు అమ్మకానికి

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వచ్చే సీజన్‌కు ముందు కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంఛైజీ అమ్మకానికి సిద్ధమైనట్లు ప్రకటించగా, తాజాగా ఈ జాబితాలోకి రాజస్థాన్ రాయల్స్ కూడా చేరినట్లు తెలుస్తోంది. ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష్ గొయెంకా చేసిన ఒక సోషల్ మీడియా పోస్ట్ ఈ వార్తలకు బలాన్నిచ్చింది. "ఒకటి కాదు.. రెండు ఐపీఎల్ జట్లు అమ్మకానికి ఉన్నాయి. అవే ఆర్సీబీ, రాజస్థాన్ రాయల్స్. వీటిని దక్కించుకునేందుకు నలుగురైదుగురు కొనుగోలుదారులు రేసులో ఉన్నారు. పూణె, అహ్మదాబాద్, ముంబయి, బెంగళూరు, యూఎస్ఏ నుంచి కొత్త యజమానులు వస్తారేమో చూడాలి!" అని హర్ష్ గొయెంకా తన ‘ఎక్స్’ ఖాతాలో పేర్కొన్నారు. ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్‌గా మారి, క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ జట్టులో రాయల్స్ స్పోర్ట్స్ గ్రూప్‌కు 65 శాతం వాటా ఉంది. ఇదిలా ఉండగా, ఆర్సీబీ యాజమాన్య సంస్థ డియాజియో ఇప్పటికే ఫ్రాంఛైజీ విక్రయ ప్రక్రియను అధికారికంగా ప్రారంభించింది. ఈ విషయాన్ని బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్కు కూడా తెలియజేసింది. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆర్సీబీని కొనుగోలు చేసేందుకు ప్రముఖ పారిశ్రామికవేత్త అదర్ పూనావాలాతో పాటు మరో రెండు సంస్థలు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. ఈ పరిణామాలతో వచ్చే ఐపీఎల్ సీజన్లో ఈ రెండు జట్లు కొత్త యాజమాన్యాల చేతికి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఐపీఎల్ 2025 ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) అమ్మకానికి సిద్దంగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఆర్సీబీని హోంబాలే ఫిల్మ్స్ ప్రొడక్షన్ హౌస్ కొనుగోలు చేస్తుందని, డీల్ కూడా పూర్తయిందని వార్తలు వచ్చాయి. కానీ ఈ వ్యవహారంపై ఆర్సీబీ ఫ్రాంచైజీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
ఐపీఎల్ సీజన్ ముగిసిన వెంటనే..
ఆర్సీబీ ఫ్రాంచైజీకి ప్రస్తుతం డియాజియో ఇండియా యజమానిగా ఉంది. ఐపీఎల్ 2025 సీజన్ ముగిసిన వెంటనే ఆర్సీబీ ఫ్రాంచైజీని డియాజియో అమ్మకానికి పెట్టినట్లు వార్తలు వచ్చాయి. ఫ్రాంచైజీ విలువ సుమారుగా 2 బిలియన్ల అమెరికా డాలర్లుగా(రూ.17000 కోట్లు) ఉంటుందని అంచనా. డియాజియో కంపెనీ ప్రధాన వ్యాపారం మద్యం. డియాజియోకు అమెరికా అతిపెద్ద మార్కెట్. అయితే అక్కడ సుంకాలు పెరగడం, వినియోగదారుల తగ్గడంతో ప్రీమియం మద్యం అమ్మకాలపై ప్రభావం పడింది. దాంతో ఆ సంస్థ..ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటుంది. ఈ క్రమంలోనే ఆర్సీబీ ఫ్రాంచైజీని అమ్మడం ద్వారా వచ్చే డబ్బులను ప్రధాన వ్యాపారంపై పెట్టాలనే యోచనలో డియాజియో ఉన్నట్లు తెలుస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

