IPL: కోల్‌కత్తా ఆశలపై వరుణుడి నీళ్లు

IPL: కోల్‌కత్తా ఆశలపై వరుణుడి నీళ్లు
X
ప్లే ఆఫ్‌ రేసు నుంచి కోల్‌కత్తా అవుట్.. అభిమానుల ఆశలపై నీళ్లు

డిఫెండింగ్ ఛాంపియ‌న్ కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్‌ కు బిగ్ షాక్ తగిలింది. ప్లే ఆఫ్స్ చేరాల‌నుకున్న ఆ జ‌ట్టు ఆశ‌ల‌పై వ‌రుణుడు నీళ్లు చ‌ల్లాడు. శ‌నివారం చిన్నస్వామి స్టేడియంలో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుతో జ‌ర‌గాల్సిన మ్యాచ్ ర‌ద్దు అయింది. వ‌ర్షం కార‌ణంగా మ్యాచ్ నిర్వ‌హ‌ణ అసాధ్యం కావ‌డంతో ఇరుజ‌ట్లకు చెరొక పాయింట్ కేటాయించారు. దాంతో, ప్లే ఆఫ్స్ రేసు నుంచి అజింక్యా ర‌హానే బృందం నిష్క్రమించ‌గా.. ఆర్సీబీ మ‌రో రెండు మ్యాచుల్లో ఒక్కటి గెలిచినా నాకౌట్‌కు దూసుకెళ్లుతుంది.

అభిమానులకు నిరాశే

తొమ్మిది రోజుల తర్వాత ఐపీఎల్ 2025 పునఃప్రారంభం కావడంతో మళ్లీ ధనాధన్ వినోదాన్ని ఆస్వాదిద్దామనుకున్న అభిమానులకు నిరాశే ఎదురైంది. శనివారం చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆర్సీబీ, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ కనీసం టాస్ కూడా పడకుండానే మ్యాచ్ రద్దయింది. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించారు. మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉన్నట్లు వాతావరణ శాఖ ముందే అంచనా వేయగా.. అందుకు తగ్గట్టుగానే సాయంత్రం నుంచి వర్షం మొదలైంది. తొలుత చిన్నపాటి జల్లుగా మొదలై క్రమంగా జోరందుకుంది. తర్వాత వరుణుడు కొద్దిసేపు శాంతించడంతో మ్యాచ్‌ నిర్వహణకు వీలుగా మైదానాన్ని సిద్ధం చేయడానికి సిబ్బంది రంగంలోకి దిగారు. అయితే, కాసేపటికే మళ్లీ వాన మొదలైంది. వర్షం తగ్గితే కనీసం 5 ఓవర్ల మ్యాచ్‌నైనా నిర్వహించాలని చూశారు. కానీ, ఎడతెరిపి లేకుండా వాన కురువడంతో మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు.

కోల్‌కతా ఔట్

మ్యాచ్‌లో గెలిచి ప్లే ఆఫ్స్‌ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలనుకున్న కోల్‌కతా ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు. డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఉన్న కేకేఆర్‌ ఈ మ్యాచ్‌ రద్దవడంతో లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టింది. ప్రస్తుతం కేకేఆర్ 13 మ్యాచ్‌లు ఆడి 12 పాయింట్లతో ఉంది.

చివరి మ్యాచ్‌లో గెలిచినా...

చివరి లీగ్ మ్యాచ్‌లో గెలిచినా కోల్‌కతాకు పెద్దగా ప్రయోజనం ఉండదు. ఇక, కేకేఆర్‌పై గెలిచి అధికారికంగా ప్లే ఆఫ్స్‌ బెర్తును ఖరారు చేసుకుందామనుకున్న ఆర్సీబీకి నిరాశే ఎదురైంది. అయితే, 12 మ్యాచ్‌లు ఆడి 17 పాయింట్లతో ఉన్న బెంగళూరు.. మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో ఓడినా ప్లే ఆఫ్స్‌కు చేరేందుకు ఛాన్స్‌ ఉంటుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఆర్సీబీ అగ్రస్థానంలో ఉంది. అనంత‌రం ఇరుజ‌ట్ల సార‌థుల‌తో మాట్లాడి మ్యాచ్‌ను ర‌ద్దు చేస్తున్నట్టు చెప్పారు. దాంతో, ఇరుజ‌ట్లకు ఒక్కో పాయింట్ వ‌చ్చింది. అయితే.. ఈ మ్యాచ్‌పై భారీ ఆశ‌లు పెట్టుకున్న కోల్‌క‌తా గుండె ప‌గిలింది. 12 పాయింట్లతో ఆ జ‌ట్టు ఎలిమినేట్ అయింది. ఆర్సీబీకి ఇంకా రెండు మ్యాచ్‌లు ఉండ‌డంతో.. వాటిలో ఒక్క‌టి గెలిచినా ప్లే ఆఫ్స్ బెర్తు ద‌క్కనుంది. రేపు జ‌రుగ‌బోయే డ‌బుల్ హెడ‌ర్‌లో పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిట‌ల్స్ జ‌ట్లు ఓడిపోతే.. ర‌జ‌త్ పాటిదార్ బృందం నేరుగా ప్లే ఆఫ్స్ చేరుకుంటుంది.

చిన్నస్వామిపై తెల్ల పావురాలు

చిన్నస్వామి స్టేడియంపై నుంచి భారీగా తెల్ల పావురాలు తరలి వెళ్లడం హైలెట్‌‌గా నిలిచింది. కోహ్లీకి టెస్ట్ రిటైర్మెంట్‌కు ట్రిబ్యూట్‌గా అభిమానులు స్టేడియంలోకి తెల్ల జెర్సీలలో వచ్చారు. కాగా, తెల్ల పావురాలు కూడా స్టేడియంపై నుంచి ఎగరడంతో ప్రకృతి కూడా కింగ్ కోహ్లీకి ట్రిబ్యూట్ ఇచ్చిందని అందరు కామెంట్స్ చేస్తున్నారు. అంతకు ముందు చిన్నస్వామిలో కోహ్లీ టెస్ట్ స్టాట్స్‌ని ప్రదర్శించారు.

Tags

Next Story