IPL: పంజాబ్‌కు ఏడో విజయం

ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ మరో విజయం సాధించింది. ధర్మశాల వేదికగా జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌పై పంజాబ్ జట్టు 37 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ భారీ స్కోరు చేసింది. ప్రభ్‌సిమ్రన్ సింగ్ (91; 48 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్స్‌లు) దంచికొట్టడంతో పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 236 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం లక్ష్యఛేదనలో లక్నో 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 199 పరుగులకే పరిమితం అయింది. ఆయుష్ బదోనీ (74; 40 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్‌లు), అబ్దుల్ సమద్ (45: 24 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) పోరాడినా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. ఈ మ్యాచ్‌లో మిచెల్ మార్ష్ డకౌట్ కాగా.. మార్‌క్రమ్ (13), నికోలస్ పూరన్ (6), రిషభ్ పంత్ (18), డేవిడ్ మిల్లర్ (11) పరుగులు చేశారు. అర్ష్‌దీప్ సింగ్ (3/16) ఆరంభంలో వరుసగా మూడు వికెట్లు పడగొట్టి లక్నోకు గట్టి షాక్ ఇచ్చాడు. ఒమర్జాయ్ 2, చాహల్, యాన్సెన్ ఒక్కో వికెట్ తీశారు. ఈ విజయంతో పంజాబ్ ప్లే ఆఫ్స్‌కు మరింత చేరువైంది. ఆ జట్టు ఇప్పటివరకు 11 మ్యాచ్‌లో 7 విజయాలు సాధించింది.
బదోనీ, సమద్ పోరాటం
భారీ ఛేదనలో లక్నో ఆరంభంలోనే చతికిలపడింది. టాపార్డర్ పేలవ ఆటతీరుతో జట్టు ఏ దశలోనూ లక్ష్యం వైపు సాగలేకపోయింది. చివర్లో బదోని, సమద్ పోరాటం ఏమాత్రం సరిపోలేదు. కెప్టెన్ రిషభ్ పంత్ (18) నిరాశాజనక ప్రదర్శన ఈ మ్యాచ్‌లోనూ కొనసాగింది. ఓపెనర్లు మార్ష్ (0), మార్‌క్రమ్ (13)లను పేసర్ అర్ష్‌దీప్ మూడో ఓవర్‌లోనే అవుట్ చేయడంతో జట్టుకు గట్టి ఝలక్ తగిలింది. తన మరుసటి ఓవర్‌లోనే ప్రమాదకర పూరన్ (6)ను కూడా అర్ష్‌దీప్ వెనక్కిపంపడంతో 27/3 స్కోరుతో లక్నో కష్టాల్లో పడింది. పది ఓవర్లలోనే సగం వికెట్లు కోల్పోయిన వేళ యువ ఆటగాళ్లు బదోని, సమద్ తెగువ చూపారు. ఆరో వికెట్‌కు 81 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. బదోని మాత్రం ధాటిని కొనసాగిస్తూ 18వ ఓవర్‌లో 6,6,4తో 18 రన్స్ అందించాడు. చివరి ఓవర్‌లో 49 రన్స్ కావాల్సిన వేళ.. తొలి బంతికే బదోని అద్భుత ఇన్నింగ్స్ ముగియడంతో లక్నో చేసేదేమీ లేకపోయింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com