IPL: "బిగ్ త్రీ"కి ఏమైంది?

ఐపీఎల్ 2026 సీజన్ రసవత్తరంగా సాగుతున్నప్పటికీ, టీమిండియా స్టార్ బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తిల పేలవ ప్రదర్శన అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ముంబై ఇండియన్స్ తరఫున బరిలోకి దిగిన బుమ్రా, ఈ సీజన్లో ఆడిన మూడు మ్యాచులలో 11 ఓవర్లు వేసి 88 పరుగులు సమర్పించుకున్నాడే తప్ప, కనీసం ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయాడు. వికెట్ల వేటలో విఫలమవుతున్నప్పటికీ, 8.00 ఎకానమీతో బుమ్రా కొంత నియంత్రణ చూపిస్తున్నా, వికెట్ల ఖాతా తెరవకపోవడం అటు అభిమానులను, ఇటు జట్టు యాజమాన్యాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. మరోవైపు పంజాబ్ కింగ్స్ పేసర్ అర్షదీప్ సింగ్ సైతం ఇదే తరహా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. ఈ సీజన్లో ఇప్పటివరకు మూడు మ్యాచులు ఆడిన అర్షదీప్, 10 ఓవర్లలో దాదాపు 99 పరుగులు ఇచ్చి వికెట్ తీయడంలో విఫలమయ్యాడు. తన స్వింగ్ బౌలింగ్‌తో బ్యాటర్లను ఇబ్బంది పెట్టే అర్షదీప్, ఈ ఎడిషన్‌లో లయ దొరకక తడబడుతున్నాడు. కట్టుదిట్టంగా బంతులేయడమే కాకుండా డెత్ ఓవర్లలో కీలక పాత్ర పోషించే ఈ యంగ్ పేసర్, వికెట్ల వేటలో వెనుకబడిపోవడం పంజాబ్ కింగ్స్ బౌలింగ్ విభాగంపై ప్రభావం చూపుతోంది. ఇక కోల్‌కతా నైట్ రైడర్స్ 'మిస్టరీ స్పిన్నర్' వరుణ్ చక్రవర్తి పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. ఆడిన రెండు మ్యాచులలో కేవలం 6 ఓవర్లు వేసిన వరుణ్, ఏకంగా 13కు పైగా ఎకానమీతో 79 పరుగులు ధారాళంగా ఇచ్చాడు. బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టే తన స్పిన్ మ్యాజిక్ ఈ సీజన్లో పనిచేయకపోవడంతో పాటు, వికెట్లు తీయలేకపోవడం కేకేఆర్ శిబిరంలో కలవరం రేపుతోంది. ప్రస్తుతం ఐపీఎల్ తొలి దశలోనే ఉన్నాం కాబట్టి, రానున్న మ్యాచులలో అయినా ఈ స్టార్ బౌలర్లు ఫామ్‌లోకి వచ్చి తమ మార్కు వికెట్లతో సత్తా చాటుతారని క్రికెట్ ప్రేమికులు ఆశిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
