SRH: సన్‌రైజర్స్‌ హైదరాబాద్ ఆశలు వర్షార్పణం

SRH: సన్‌రైజర్స్‌ హైదరాబాద్ ఆశలు వర్షార్పణం
X
వర్షం వల్ల హైదరాబాద్‌- ఢిల్లీ మ్యాచ్ రద్దు... ప్లే ఆఫ్ ఆశలు పూర్తిగా ఆవిరి

హైదరాబాద్‌ వేదికగా ఎస్‌ఆర్‌హెచ్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దు అయింది. దీంతో ఇరుజట్లకు చెరో పాయింట్‌ ఇచ్చారు. దీంతో హైదరాబాద్‌ ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి వైదొలిగింది. తొలుత టాస్‌ ఓడి బౌలింగ్‌కు దిగిన దిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. అశుతోష్‌ శర్మ (41), స్టబ్స్‌ (41) రాణించారు. ఇన్నింగ్స్‌ ముగిసిన అనంతరం వర్షం ప్రారంభం కావడంతో హైదరాబాద్‌ జట్టు బ్యాటింగ్‌కు దిగలేదు. వర్షం ఎక్కువగా కురవడంతో మైదానంలో భారీగా వర్షపు నీరు నిలిచింది. దీంతో మ్యాచ్‌ నిర్వహించేందుకు వీలు కుదరకపోవడంతో రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. ఈ మ్యాచ్ గెలిచి ఉంటే సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు కాస్తో కూస్తో ప్లే ఆఫ్స్ అవకాశాలు ఉండేవి. వర్షం కారణంగా రద్దవ్వడంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఖాతాలో ఓ పాయింట్ చేరింది. దాంతో 11 మ్యాచ్‌ల్లో ఆరెంజ్ ఆర్మీ మూడు విజయాలతో 7 పాయింట్స్‌తో 8వ స్థానంలో నిలిచింది. చివరి మూడు మ్యాచ్‌లు గెలిచిన ఆరెంజ్ ఆర్మీ ఖాతాలో 13 పాయింట్స్ చేరుతాయి.

ఢిల్లీ ఆశలు సంక్లిష్టం

మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్‌ ప్లే ఆఫ్స్ అవకాశాలు కూడా సంక్లిష్టంగా మారాయి. ఆ జట్టు 11 మ్యాచ్‌ల్లో 6 విజయాలు.. ఓ మ్యాచ్ రద్దుతో 13 పాయింట్స్‌‌తో ఐదో స్థానంలో కొనసాగుతోంది. ఢిల్లీ ప్లే ఆఫ్స్ చేరాలంటే చివరి మూడు మ్యాచ్‌ల్లో కనీసం రెండు విజయాలు సాధించాలి. అప్పుడే 17 పాయింట్స్‌తో టోర్నీలో ముందుడుగు వేస్తోంది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్ గెలిచి ఉంటే ఆ జట్టు పరిస్థితి మరోలా ఉండేది.

జట్టులోకి హర్ష్ దూబే

ఈ మ్యాచులో గాయపడిన స్మరణ్‌ రవిచంద్రన్‌ స్థానంలో విదర్భ లెఫ్డ్‌ ఆర్మ్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ హర్ష్‌ దూబేను జట్టులోకి తీసుకుంది. హర్ష్‌ను బేస్‌ ధర రూ. 30 లక్షలకు సొంతం చేసుకుంది. కొద్ది రోజుల ముందే స్మరణ్‌ ఆసీస్‌ స్పిన్నర్‌ ఆడమ్‌ జంపాకు ప్రత్యామ్నాయంగా జట్టులోకి వచ్చాడు. స్మరణ్‌ ఒక్క మ్యాచ్‌ కూడా ఆడకుండానే గాయంతో సీజన్‌ మొత్తానికి దూరమయ్యాడు. అంతకుముందు జంపా రెండు మ్యాచ్‌లు ఆడి ప్రాక్టీస్‌ సందర్భంగా గాయపడ్డాడు.

Tags

Next Story