JADEJA: నా సమయం ముగిసింది: జడేజా

టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా టెస్టు ఫార్మాట్లో దిగ్గజంగా కొనసాగుతున్నప్పటికీ, రోహిత్ శర్మ నిష్క్రమణ తర్వాత టెస్టుల్లో కెప్టెన్‌గా లేదా వైస్ కెప్టెన్‌గా అతన్ని ఎంపిక చేయడానికి సెలక్షన్ కమిటీ వెనకడుగు వేసింది. ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ తరపున కీలక ప్రదర్శన చేసిన తర్వాత, కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టే సమయం తనకు ముగిసిందని జడేజా అంగీకరించాడు. 15 ఏళ్లకు పైగా సాగిన కెరీర్లో మూడోసారి ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న జడేజాను కెప్టెన్సీ గురించి ప్రశ్నించగా... ఆసక్తికర సమాధానమిచ్చాడు. రెండో రోజు ఆట ముగిసిన తర్వాత విలేకరులతో మాట్లాడుతూ ''లేదు, ఇప్పుడు కెప్టెన్సీ చేపట్టే సమయం ముగిసిపోయింది’’ అని చిరునవ్వుతో చెప్పాడు.
వినపడని జడేజా పేరు
రోహిత్ శర్మ కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత జడేజా పేరు కెప్టెన్సీ, వైస్-కెప్టెన్సీ రేసులో పెద్దగా వినిపించలేదు. యువ బ్యాటర్ శుభ్‌మన్ గిల్‌కు టీమిండియా టెస్ట్ సారథ్య బాధ్యతలు దక్కాయి. జడేజా కూడా తనకు టీమిండియా కెప్టెన్సీ బాధ్యతలు చెపట్టే అవకాశాలు లేవని అంగీకరించాడు.దాంతో సీనియర్ ఆటగాడిగా జట్టులో కొనసాగుతున్నాడు. ఇంగ్లండ్‌తో ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్‌లో జడేజా అద్భుత ప్రదర్శన కనబర్చాడు. 137 బంతుల్లో 89 పరుగులు చేసి తృటిలో శతకాన్ని చేజార్చుకున్నాడు. శుభ్‌మన్ గిల్‌తో కలిసి 6వ వికెట్‌కు 203 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. దాంతో ఈ మ్యాచ్‌లో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 587 పరుగులు భారీ స్కోర్ చేసింది. ఓవరాల్ గా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో జడేజా 41 మ్యాచ్‌లు ఆడాడు. బ్యాటింగ్ లో 40 యావరేజ్ తో 2010 పరుగులు చేయగా..వీటిలో మూడు సెంచరీలు.. 13 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. బౌలింగ్ లోనూ అద్భుతంగా రాణించి 132 వికెట్లను పడగొట్టాడు. వీటిలో 6 సార్లు 5 వికెట్ల ఘనతను అందుకున్నాడు. 2022 నుంచి జడేజా టెస్ట్ ర్యాంకింగ్స్ లో నెంబర్ స్థానంలో కొనసాగుతున్నాడు.
గిల్ కెప్టెన్సీపై జడేజా ప్రశంసలు
కెప్టెన్శుభ్మన్ గిల్ బ్యాటింగ్‌పై జడేజా ప్రశంసల జల్లు కురిపించాడు. 'నిజాయితీగా చెప్పాలంటే.. శుభ్‌మన్ గిల్ ఆత్మవిశ్వాసం అద్భుతం. బ్యాటింగ్ చేస్తున్నప్పుడు అతను అసలు కెప్టెన్‌గా కనిపించలేదు. అదనపు బాధ్యతలను సమర్థవంతంగా మోస్తున్నాడు. ఈ రోజు దురదృష్టవశాత్తు ఔటయ్యాడు తప్పా.. ఈ ఇన్నింగ్స్‌లో అతను ఔట్ అవుతాడని నాకు అనిపించలేదు. చాలా బాగా ఆడాడు. మేము బ్యాటింగ్ చేసేటప్పుడు భాగస్వామ్యాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనేదానిపై చర్చించుకున్నాం.’అని జడేజా చెప్పుకొచ్చాడు.
సీనియర్ జడ్డూనే
ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న భారత జట్టులో అత్యంత సీనియర్ ఆటగాడు ఎవరంటే రవీంద్ర జడేజానే. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు టెస్టుల నుంచి తప్పుకున్నాక, బుమ్రా పై పని ఒత్తిడి లేకుండా చేసేందుకు బీసీసీఐ అతడికి సారథ్యం ఇవ్వలేదు. ఈ క్రమంలో రవీంద్ర జడేజానే తదుపరి భారత టెస్టు కెప్టెన్ అవుతాడని చాలా మంది భావించారు. అయితే.. యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్‌కు నాయకత్వ బాధ్యతలను బీసీసీఐ అప్పగించింది. గిల్‌తో కలిసి జడేజా 203 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో భారత్ భారీ స్కోరు వైపు దూసుకెళ్లింది. అయితే, జోష్ టంగ్ వేసిన షార్ట్-పిచ్ బంతిని పుల్ చేయబోయి జడేజా ఔటయ్యాడు. ఆ తర్వాత గిల్ (269) వాషింగ్టన్ సుందర్ (42)తో కలిసి 144 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి భారత్ 587 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా వ్యాఖ్యలతో గిల్ కు సారధిగా అందరి మద్దతు లభిస్తుందనే చర్చ మొదలైంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com