BUMRAH: ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా బుమ్రా

టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రాను ప్రతిష్టాత్మక ఐసీసీ అవార్డు వరించింది. 2024కు సంబంధించి ‘క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు’ను బుమ్రా సొంతం చేసుకున్నాడు. సర్ గ్యారిఫీల్డ్ సోబర్స్ పేరిట ఇచ్చే ఈ అవార్డుకు బుమ్రా ఎంపికైనట్టు ఐసీసీ ప్రకటించింది. లాంగ్, షార్ట్ ఫార్మాట్‌లలో తన బౌలింగ్‌తో ప్రత్యర్థిపై ఆధిపత్యం చెలాయించినందుగానూ అతడిని ఈ గుర్తింపు దక్కింది. ఈ ప్రతిష్టాత్మక అవార్డు కోసం బుమ్రాతోపాటు ఇంగ్లాండ్ నుంచి జో రూట్, హ్యారీ బ్రూక్, ట్రావిస్ హెడ్(ఆస్ట్రేలియా) పోటీ పడ్డారు. కానీ, ఆ ముగ్గురిని భారత పేసర్ వెనక్కినెట్టి అవార్డును సొంతం చేసుకున్నాడు. మరోవైపు ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లోనూ బుమ్రా నెంబర్ 1 స్థానంలో ఉన్నాడు. టెస్టుల్లో అత్యంత వేగంగా 200 వికెట్లు పడగొట్టిన బౌలర్‌గానూ అతడికి పేరుంది. దీంతో సర్ గ్యారిఫీల్డ్ సోబర్స్ అవార్డు గెలిచిన తొలి భారత పేసర్‌గా రికార్డు నెలకొల్పాడు. మొత్తంగా ఈ అవార్డు సాధించిన ఐదో భారత క్రికెటర్. అతని కంటే ముందు రాహుల్ ద్రవిడ్(2004), సచిన్ టెండూల్కర్(2010), రవిచంద్రన్ అశ్విన్(2016), విరాట్ కోహ్లీ(2017, 2018) ఉన్నారు. ఇప్పటికే టెస్టు క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కైవసం చేసుకున్నాడు. అలాగే, టెస్టు, టీ20 టీమ్ ఆఫ్ ది ఇయర్ జట్లలో అతనికి చోటు దక్కింది.
టెస్టు క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా బుమ్రా
భారత పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా 2024 సంవత్సరానికి గాను ఐసీసీ టెస్టు ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు వరించింది. గతేడాది 13 టెస్టులు ఆడిన జస్‌ప్రీత్ బుమ్రా మొత్తం 71 వికెట్లు పడగొట్టాడు. 2024లో జనవరి 4న దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టులో 8 వికెట్లు పడగొట్టిన బుమ్రా.. ఇంగ్లాండ్‌పై 19 వికెట్లు, బంగ్లాదేశ్‌పై 11 వికెట్లు, న్యూజిలాండ్‌పై 3 వికెట్లు, ఆస్ట్రేలియాపై 38 వికెట్లు తీసి అద్భుత ప్రదర్శన చేశాడు.
ఆరో భారత క్రికెటర్..
టెస్టు క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్న ఆరో భారత క్రికెటర్‌గా బుమ్రా నిలిచాడు. రాహుల్ ద్రవిడ్ (2004), గౌతమ్ గంభీర్ (2009), వీరేంద్ర సెహ్వాగ్ (2010), రవిచంద్రన్ అశ్విన్ (2016), విరాట్ కోహ్లీ (2018) బుమ్రా కంటే ముందు ఈ అవార్డు అందుకున్నారు. 2024 ఐసీసీ టెస్టు జట్టులోనూ బుమ్రా చోటు దక్కింది. గతేడాది టెస్టుల్లో బుమ్రా అద్భుతమైన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. 13 మ్యాచ్‌ల్లో 71 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలోనే 2024లో సుదీర్ఘ ఫార్మాట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు సృష్టించాడు.
వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా మంధాన
ఐసీసీ మహిళా వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా భారత మహిళల జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన ఎంపికైంది. 2024లో 13 ఇన్నింగ్స్‌లు ఆడిన మంధాన.. క్యాలెండర్ ఇయర్‌లో మునుపెన్నడూ లేని విధంగా 747 పరుగులు చేసింది. 57.86 సగటుతో, 95.15 స్ట్రైక్ రేట్‌తో అత్యధిక రన్స్ సాధించిన మహిళా క్రికెటర్ల జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది. ఇందులో నాలుగు సెంచరీలు, 3 హాఫ్ సెంచరీలున్నాయి. లారా, టామీ బ్యూమాంట్, హేలీ మాథ్యూస్‌ను వెనక్కి నెట్టి అవార్డుకు ఎంపికైంది. మంధాన గతేడాది వన్డేల్లో అదరగొట్టింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com