BUMRAH: ఛాంపియన్స్ ట్రోఫీలో బుమ్రా ఆడతాడా..? లేదా..?
త్వరలో జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా పేసు గుర్రం బుమ్రా ఆడతాడా లేదా అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఇటీవల బుమ్రా వెన్ను నొప్పితో బాధపడడంతో ఆస్ట్రేలియాతో జరిగిన ఐదో టెస్టులో బౌలింగ్ చేయలేదు. అయితే, బుమ్రా గాయంపై బీసీసీఐ ఇప్పటి వరకు ఎలాంటి అప్‌డేట్ ఇవ్వకపోవడం అనుమానాలకు తావిస్తోంది. బోర్డు మౌనంగా ఉండటంతో బుమ్రా పరిస్థితిపై ఆందోళన నెలకొంది. ఈ క్రమంలోనే ఛాంపియన్స్ ట్రోఫీ ఆడతాడా?లేదా? అనే దానిపై అనుమానాలు నెలకొన్నాయి. దూరమైతే మాత్రం టీమిండియాకు భారీ షాక్ తగిలినట్లేనని మాజీలు అంచనా వేస్తున్నారు.
వచ్చే నెల 19 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ
వచ్చే నెల 19 నుంచి చాంపియన్స్ ట్రోఫీ మొదలుకానుంది. టోర్నీలో పాల్గొనే జట్లను ప్రకటించడానికి ఐసీసీ విధించిన గడువు ఈ నెల 12. బీసీసీఐ ఏ క్షణంలోనైనా భారత జట్టును ప్రకటించొచ్చు. బుమ్రా లేకుండా భారత జట్టును ఊహించుకోవడం కష్టమే. ఇటీవల అతను భీకర ఫామ్‌లో ఉన్నాడు. ఆసిస్ టూరులో 32 వికెట్లతో రెచ్చిపోయాడు. వెన్ను గాయంతో బాధపడిన బీసీసీఐ మెడికల్ టీమ్ అతన్ని స్కానింగ్‌కు తీసుకెళ్లింది. ఆ తర్వాతి రోజు మైదానంలోకి వచ్చినా కేవలం బ్యాటింగే చేశాడు. బౌలింగ్ చేయలేదు. ఆ మ్యాచ్ అనంతరం బుమ్రా పరిస్థితిపై బీసీసీఐ ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి అప్‌డేట్ ఇవ్వలేదు.
అత్యుత్తమ బౌలర్ బుమ్రానే: ఆసీస్ మాజీ కెప్టెన్
టీమ్‌ఇండియా స్టార్ పేసర్ బుమ్రా అన్ని ఫార్మాట్లలో అత్యుత్తమ బౌలర్ అతడు అని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖెల్ క్లార్క్ ప్రశంసించారు. ‘బోర్డర్ గావస్కర్ ట్రోఫీ ముగిసిన అనంతరం బుమ్రా ప్రదర్శన గురించి నేను ఆలోచించాను. అన్ని ఫార్మాట్లలో అతడే అత్యుత్తమ బౌలర్ అని నా అభిప్రాయం. ఎలాంటి పరిస్థితుల్లోనైనా, ఎలాంటి ఫార్మాటైనా.. అతడు రాణిస్తాడు. అదే అతడిని గొప్ప బౌలర్‌గా మార్చింది’ అని అన్నారు.
కెప్టెన్‌గా బుమ్రా వద్దు: మాజీ క్రికెటర్
టెస్టు కెప్టెన్‌గా భారత స్టార్ బౌలర్ బుమ్రాను చేయనున్నట్లు వస్తున్న వార్తలపై మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ స్పందించారు. ‘బుమ్రాను సారథిగా నియమించడం సరైన ఆలోచన కాదు. జట్టు కోసం తన జీవితాన్ని ధారపోసిన ఏకైక బౌలర్ బుమ్రా. ఇతర బౌలర్ల నుంచి సరైన సహకారం లేకున్నా ఎంతో ఒత్తిడిని ఎదుర్కొంటాడు. అతను కెప్టెన్ కావొద్దని బలంగా కోరుకుంటున్నా. పంత్ లేదా కేఎల్ రాహుల్ భారత సారథి అవ్వాలనుకుంటున్నా’ అని అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com