CT: నేడే బుమ్రాపై స్పష్టత

ప్రతిష్టాత్మక ఛాంపియన్స్ ట్రోఫీలో భారత పేసు గుర్రం బుమ్రా బరిలో దిగుతాడా? లేదా? అన్నది మరికొన్ని గంటల్లో తేలనుంది. ఈ మెగా టోర్నీలో బుమ్రా ఆడటంపై బీసీసీఐ నేడు తుది నిర్ణయం తీసుకోనుంది. ఆస్ట్రేలియా పర్యటన చివర్లో వెన్నునొప్పితో ఇబ్బంది పడ్డ బుమ్రా.. ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీలో కోలుకుంటున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో మార్పులు చేర్పులకు నేటితో గడువు ముగియనుంది. మరోవైపు బుమ్రా ఫిట్‌నెస్‌పై బీసీసీఐ అధికారికంగా స్పందించింది. అతని ఫిట్‌నెస్‌పై అప్డేట్ కోసం ఎదురుచూస్తున్నట్టు తెలిపింది. ప్రస్తుతం వెన్ను నొప్పికి చికిత్స తీసుకుంటూ జాతీయ క్రికెట్ అకాడమీలో ఉన్న బుమ్రా మరో రెండు రోజులు అక్కడే ఉండనున్నారు. ఎన్‌సీఏ బుమ్రాకి అన్ని చికిత్సలు చేసి నివేదికను బీసీసీఐకి ఇవ్వనుంది.
గ్రూపు ఏలో ఉన్న టీమిండియా
ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు పాకిస్తాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్‌లతో పాటు గ్రూప్ Aలో ఉంది. టీం ఇండియా తన అన్ని మ్యాచ్‌లను దుబాయ్‌లో ఆడుతుంది. రోహిత్ జట్టు ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో తొలి మ్యాచ్ ఆడనుంది, ఆ తర్వాత ఫిబ్రవరి 23న పాకిస్థాన్‌తో తలపడనుంది. ఆ తర్వాత వారు చివరి గ్రూప్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో తలపడతారు.
అలా అయితేనే భారత్‌కి కప్పు
ఇంగ్లండ్‌తో జరిగిన రెండో వన్డేలో భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ సెంచరీ చేయడంపై మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ స్పందించారు. ‘రోహిత్ తిరిగి ఫామ్‌లోకి వచ్చినందుకు సంతోషంగా ఉంది. నేను మ్యాచ్ చూడలేదు. కానీ, అతను బాగా బ్యాటింగ్ చేశాడని విన్నాను. సెంచరీ చేసినందుకు అతడిని అభినందిస్తున్నాను. ఛాంపియన్స్ ట్రోఫీలో రోహిత్ ఇదే దూకుడు ప్రదర్శిస్తే భారత్ విజేతగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు’ అని అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com