JIO HOTSTAR: జియో హాట్‌స్టార్ ఎందుకు తప్పుకుంది?

ఐపీఎల్ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ని రూ.37 వేల కోట్లకు విక్రయించింది బీసీసీఐ. డిజిటల్ రైట్స్ అమ్మకంలో ఇదో సంచలన రికార్డు. అలాగే ఐసీసీ ఈవెంట్స్‌కి సంబంధించిన డిజిటల్ రైట్స్ కోసం రూ.29 వేల కోట్లు చెల్లించింది జియో హాట్‌స్టార్. అయితే రెండేళ్లకే ఈ ఒప్పందం నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించింది షాక్ ఇచ్చింది జియో హాట్‌స్టార్.. భారీగా నష్టాలు వస్తుండడంతో మరో రెండేళ్ల కాంట్రాక్ట్ ఉన్నప్పటికీ, ఈ ఒప్పందం నుంచి తప్పుకుంటున్నట్టుగా తెలిపింది జియో హాట్‌స్టార్..2026 ఫిబ్రవరిలో ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. ఈ ఈవెంట్లో 20 దేశాల నుంచి జట్లు పాల్గొనబోతున్నాయి. అయితే ఈ టోర్నీకి 2 నెలల ముందు ఐసీసీ ఈవెంట్స్ డిజిటల్ స్ట్రీమింగ్కి సంబంధించిన రైట్స్‌ని వదులుకోవడానికి సిద్ధమైంది జియో.
భారీ నష్టాల కారణంగా హాట్‌స్టార్ తొలుత డిస్నీ పిక్చర్స్‌లో కలిసింది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌గా మారింది. ఆ తర్వాత కొన్ని నెలలకు జియోతో ఒప్పందం కుదుర్చుకుంది. జియో టీవీ, జియో సినిమా ఇలా అనేక రకాల యాప్స్‌ని ఉచితంగా అందించిన జియో, హాట్ స్టార్ సేవలకు సబ్‌స్క్రిప్షన్‌ని కొనసాగించింది. అయితే 2024-27 ఐసీసీ ఈవెంట్స్ ప్రసారాల కోసం 3 బిలియన్ డాలర్ల ఒప్పందం, జియో హాట్‌స్టార్‌కి పెద్ద తలనొప్పిగా మారింది.. భారత స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రిటైర్మెంట్ తర్వాత భారత్‌లో క్రికెట్ క్రేజ్ అమాంతం పడిపోయింది. స్టేడియంలో జనాలు పలుచబడడం చూసి, క్రికెట్ విశ్లేషకులు కూడా షాక్ అయ్యారు. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2024 టోర్నీకి మంచి వ్యూయర్షిప్ వచ్చింది. ఆ తర్వాత 2025 ఛాంపియన్స్ ట్రోఫీకి కూడా మంచి ఆదరణ లభించింది. ఆ తర్వాత ఐసీసీ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్, ఐసీసీ మహిళల వన్డే వరల్డ్ కప్ వంటి టోర్నీలకు అభిమానుల నుంచి ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాలేదు...
గత ఏడాది టీ20 ప్రపంచకప్ విజయానంతరం రోహిత్, కోహ్లీ ఒకేసారి పొట్టి క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. భారత్ కప్పు గెలవడం, అందులో రో-కో భాగం కావడంతో ఆదరణ పరంగా సూపర్‌హిట్ అయింది. ఈ టోర్నీలో టీమ్ఇండియా మ్యాచ్‌లకు వ్యూయర్షిప్ భారీగా వచ్చింది. కానీ ఆ టోర్నీతో రో-కో రిటైరవడంతో టీ20 జట్టుకు ఆకర్షణ తగ్గిపోయింది. తర్వాత భారత టీ20 జట్టు సిరీస్‌ల మీద సిరీస్‌లు గెలుస్తోంది. కానీ రో-కో ఉండగా అభిమానుల్లో ఉన్న ఉత్సాహం ఇప్పుడు లేదన్నది వాస్తవం. టీ20 మ్యాచ్‌లు అంటే ఎవరు ఆడినా స్టేడియాలు నిండుతాయి కానీ.. రోహిత్, కోహ్లీ ఆడుతుంటే స్టేడియాల్లో ఉండే సందడి వేరు. ఈ ఏడాది వీళ్లిద్దరూ టెస్టులకు కూడా గుడ్‌బై చెప్పారు. వీళ్లిద్దరూ రిటైరయ్యాక భారత టెస్టు జట్టు మ్యాచ్‌లు ఆడుతుంటే స్టేడియాలు జనాల్లేక వెలవెలబోతున్నాయి. టెస్టులపై అంతకంతకూ ఉత్సాహం తగ్గుతున్నప్పటికీ.. రో-కోలను చూడడానికి స్టేడియానికి అభిమానులు వచ్చేవారు. కానీ వారు రిటైరయ్యాక టెస్టులపై విముఖత ఇంకా పెరిగిపోయింది. వెస్టిండీస్‌తో సిరీస్ సందర్భంగా వెయ్యి మంది కూడా స్టేడియంలో లేని పరిస్థితి చూశాం. దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు టికెట్ల ధరలు బాగా తగ్గించి అభిమానులను రప్పించే ప్రయత్నం చేశారు. పడిపోతున్న వ్యూయర్షిప్ను మాత్రం పెంచలేకపోతున్నారు. వచ్చే ఫిబ్రవరి, మార్చి నెలల్లో భారత్ టీ20 ప్రపంచకప్‌నకు ఆతిథ్యమివ్వబోతోంది. అయినా జియో హాట్‌స్టార్ మీడియా హక్కుల ఒప్పందం నుంచి తప్పుకోవడం వెనక రో-కో ఎఫెక్ట్ ఉందంటున్నారు విశ్లేషకులు. జియో హాట్‌స్టార్ ఓటీటీకి మామూలుగానే నష్టాలు వస్తున్నాయి. . ఐసీసీ ఈవెంట్ల మీడియా హక్కుల కోసం భారీగా డబ్బులు చెల్లించాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

