OLYMPICS: వరల్డ్ ఫాస్టెస్ట్ ఉమెన్ అల్ఫ్రెడ్

ఒలింపిక్స్‌లో వంద మీటర్ల పరుగులో పెను సంచలనం నమోదైంది. మహిళల వంద మీటర్ల పరుగులో ఛాంపియన్ షాకారీ రిచర్డ్‌సన్‌కు షాక్ ఇస్తూ సెయింట్ లూసియాకు చెందిన జూలియన్ ఆల్ఫ్రెడ్ స్వర్ణం గెలుచుకుంది. 10.72 సెకన్లలో లక్ష్యాన్ని చేరి ఆల్ఫ్రెడ్ కొత్త చరిత్రను సృష్టించింది. షాకారీ రిచర్డ్ సన్ 10.87 సెకన్లలో లక్ష్యాన్ని చేరి రజతం సాధించగా... అమెరికాకే చెందిన మెలిస్సా జెఫెర్సన్ 10.92తో కాంస్యాన్ని ముద్దాడింది. సెయింట్ లూసియాకు ఇదే తొలి ఒలింపిక్ పతకం కావడం విశేషం. తొలి పతకమే గోల్డ్ మెడల్ రావడం... అదీ అథ్లెటిక్స్‌లో వంద మీటర్ల పరుగులో రావడంతో సెయింట్ లూసియాలో సంబరాలు అంబరాన్ని అంటాయి. ప్రజలు వీధుల్లోకి వచ్చి వేడుకలు చేసుకున్నారు. ఈ పతకం గెలిచిన అనంతరం ఆల్ఫ్రెడ్ కన్నీటి పర్యంతం అయింది. తాను ఇన్నేళ్లు పడ్డ శ్రమకు ఫలితం లభించిందని ఉబ్బితబ్బిబయింది.
లక్ష్యసేన్ లక్ష్యాన్ని సాధిస్తాడా..?
తన కెరీర్‌లోనే కీలక మ్యాచ్‌కు భారత బ్యాడ్మింటన్ స్టార్ లక్ష్యసేన్ సిద్ధమయ్యాడు. ఇప్పటికే ఒలింపిక్స్‌లో సెమీఫైనల్ చేరిన తొలి భారత బ్యాడ్మింటన్ పురుష ఆటగాడిగా చరిత్ర సృష్టించిన లక్ష్యసేన్ ఇప్పుడు పైనల్‌కు చేరుకుని కొత్త చరిత్ర సృష్టించాలని గట్టి పట్టుదలతో ఉన్నాడు. ఈ విశ్వక్రీడల్లో తనకంటే మెరుగైన ర్యాంక్ ఉన్న ఆటగాళ్లను కూడా మట్టికరిపించి సెమీస్‌లో అడుగుపెట్టిన లక్ష్యసేన్‌కు ఇప్పుడే అసలైన సవాల్ ఎదురుకానుంది. డెన్మార్క్‌కు చెందిన విక్టర్ అక్సెల్‌సెన్‌తో లక్ష్య తలపడనున్నాడు. గత రికార్డులన్నీ విక్టర్‌కే అనుకూలంగా ఉన్నా లక్ష్యసేన్ ఈ ఒలింపిక్స్‌లో పోరాడుతున్న విధానం అద్భుతంగా ఉంది. విజయాన్ని అంత తేలిగ్గా వదులుకోని లక్ష్య... విక్టర్‌కు షాక్ ఇస్తే భారత్‌కు మరో పతకం ఖాయమేనట్లే.
ఖలీఫ్‌కు కాంస్యం ఖాయం
ఒలింపిక్స్‌లో వివాదస్పద బాక్సర్‌గా ముద్రపడి... వివాదానికి కేంద్ర బిందువుగా మారిన అల్జీరియా బాక్సర్ ఇమాన్ ఖలీఫ్..కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంది. ఓ వైపు ఆమె జెండర్‌పై వివాదం చెలరేగుతున్న వేళ... క్వార్టర్ ఫైనల్లో ఘన విజయం సాధించి సెమీఫైనల్లో అడుగుపెట్టిన ఖలీఫ్.... కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంది. అసలు విశ్వ క్రీడల్లో ఇమాన్ ఖలీఫ్... ఎంపికపైనే ఇప్పుడు వివాదం చెలరేగుతోంది. దీనిపై ఒలింపిక్స్ నిర్వహక కమిటీ స్పష్టత ఇచ్చినా వివాదం మాత్రం ఆగడం లేదు. పురుష క్రోమోజోమ్‌లు ఉన్న అథ్లెట్‌ను అసలు ఒలింపిక్స్‌కు ఎలా అనుమతిస్తారంటూ చాలా మంది నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. ఈ విమర్శలు చెలరేగుతుండగానే ఖలీఫ్ పతకాన్ని ఖాయం చేసుకుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com