JYOTHI: నిజంగానే ఆమె "హర్డిల్"క్వీన్

విజయం కేవలం ఒక్కరోజులో వచ్చేది కాదు. ఆ విజయం వెనుక ఏళ్ల తరబడి చేసిన పోరాటం. కష్టం, త్యాగం ఉంటాయి. ఓటములను జయించిన పట్టుదలతో ముందుకు సాగించే ప్రయాణమే దాని చివరి ఫలితం. గమ్యాన్ని చేరుకున్నవారిని మనం అభినందించడమే కాదు.. వారు చేసిన ప్రయాణాన్ని గౌరవించాలి. ఎందుకంటే వారి విజయం వ్యక్తిగతం కాదు. అది దేశానికి స్ఫూర్తి. అలాంటి స్ఫూర్తినిచ్చే క్రీడాకారిణే భారత హర్డిల్ క్వీన్, తెలుగు తేజం జ్యోతి యర్రాజీ. కానీ ఆమెకు తన గుర్తింపు కోసం ఇంకా పోరాడాల్సి రావడం సగటు భారతీయుడిగా బాధ కలిగిస్తోంది.
జ్యోతి యర్రాజీ 100 మీటర్ల హార్డిల్స్‌ను 12.96 సెకన్లలో పూర్తి చేసి జాతీయ రికార్డు సృష్టించారు. ఇప్పటివరకు తొమ్మిది సార్లు జాతీయ రికార్డులను తిరగరాశారు. 20కి పైగా అంతర్జాతీయ పతకాలు సాధించింది. ఒలింపిక్స్‌లో భారత జెండాను గర్వంగా మోసి భారత క్వీన్‌గా నిలిచారు. విశాఖకు చెందిన జ్యోతి నేపథ్యం చాలా సాధారణం. ఆమె తండ్రి ఓ సెక్యూరిటీ గార్డు. నెలకు కేవలం రూ.6 వేల జీతం మాత్రమే కుటుంబానికి ప్రధాన ఆదాయం. తల్లి ప్రైవేట్ ఆసుపత్రిలో ఉద్యోగం. భార్త బాధ్యలో ఆమెకు సగం అన్నట్లు సాగుతున్న జీవితాలు. ఇటువంటి పరిస్థితుల నుంచి వచ్చింది మన జ్యోతి. పరిగెత్తేందుకు సరైన షూస్ కూడా లేని స్థితి నుంచి.. ఒలింపిక్స్ స్థాయికి ఎదగడం చిన్న విషయం కాదు. ఇది ఆమె అహర్నిశల కృషికి చక్కని నిదర్శనం. అయినా ఇన్ని విజయాలు సాధించిన జ్యోతి ఎందుకు ఇంకా ఎదురు చూడాల్సి వస్తోంది అనేది.. నా ప్రశ్న. మనసున్న వారందరిలోనూ బహుశా అందరిలోనూ ఇదే ప్రశ్న వేధిస్తునే ఉంటుంది.
“నాకంటే జూనియర్లకు నిబంధనలేమీ చూడకుండా ప్రోత్సాహకాలు ఇస్తున్నారు. అది ఆనందమే. కానీ నా విషయంలో మాత్రం జీఓలు, పాలసీలు అడ్డుగా నిలుస్తున్నాయి” అని జ్యోతి ఆవేదన వ్యక్తం చేసింది. పేద కుటుంబాల నుంచి వచ్చే అనేక మంది యువ క్రీడాకారుల భవిష్యత్తుకు సంబంధించిన ప్రశ్న ఇది. జాతీయ స్థాయిలో నిలిచిన అథ్లెట్‌కే న్యాయం జరగకపోతే.. కొత్త తరం పిల్లలు క్రీడలను కెరీర్‌గా ఎంచుకునే ధైర్యం ఎలా చేస్తారు?, ఎ తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రోత్సహిస్తారు? అనేది ప్రశ్న. ప్రస్తుతం జ్యోతి దక్షిణ మధ్య రైల్వేలో జూనియర్ క్లర్క్‌గా పనిచేస్తోంది. రిలయన్స్ ఫౌండేషన్ ఆమెకు శిక్షణ, పోషకాహారంలో సహాయం చేస్తోంది. ఇది మంచి విషయమే. కానీ దేశానికి పతకాలు తెచ్చిన క్రీడాకారిణి కార్పొరేట్ సహాయంపై ఆధారపడాల్సి రావడం మనం ఆలోచించాల్సిన అంశం. క్రీడాకారులను పతకాలు వచ్చినప్పుడు మాత్రమే కాదు, వారి నిరంతర శ్రమకు, త్యాగానికి కూడా గౌరవం ఇవ్వాలి.
జ్యోతి కథ ఒక స్పష్టమైన సందేశం ఇస్తోంది. వికసిత్ భారత్ అంటే ఆర్థిక వృద్ధి, మౌలిక వసతుల అభివృద్ధి మాత్రమే కాదు. ఆరోగ్య సమాజం, క్రమశిక్షణ, జాతీయ గర్వం కూడా వికాసానికి మూలస్తంభాలే. ఈ మూడు లక్షణాలను ఒకేసారి పెంపొందించే శక్తి క్రీడలకు ఉంది. వికసిత్ భారత్‌లో క్రీడలు అదనపు అంశం కాకుండా కేంద్ర బిందువు ఉండాలి. క్రీడాకారులకు గౌరవం, భద్రత, సమాన న్యాయం అందించినప్పుడే భారత్ అభివృద్ధి చెందిన దేశంగా నిలుస్తుంది. అప్పుడే జ్యోతీ యర్రాజీ వంటి భారత క్వీన్లు మరింతమంది పుట్టుకోస్తారు. ఓటమి నీడలో నడిచిన అడుగులే.. విజయ శిఖరంపై నిలబెడతాయి. చివరిగా చెమట బొట్టు కథగా రాసిన రోజే.. గెలుపు చరిత్రగా మారుతుందనే విషయం గుర్తించాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

