KCR: కేసీఆర్‌కు మళ్లీ అనారోగ్యం.. ఫామ్‌హౌస్‌కు వైద్యులు.!

తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మళ్లీ అస్శస్థతకు గురయ్యారు. కేసీఆర్ మరోసారి అనారోగ్యానికి గురయ్యాడన్న వార్తతో తెలుగు రాష్ట్రాల్లో ఆందోళన రేపింది. కేసీఆర్ అనారోగ్యానికి గురవ్వడంతో వెంటనే వైద్య బృందం ఫాంహౌజ్ కు చేరుకుంది. ఆయన పర్సనల్ డాక్టర్స్ వెంటనే ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌కు చేరుకున్నారు. ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌కు ప్రత్యేకంగా వైద్యం అందించారు. పరిస్థితి విషమంగా ఉంటే హైదరాబాద్‌కు తరలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కేసీఆర్ అనారోగ్య వార్తలతో గులాబీ శ్రేణులు తీవ్ర ఆందోళనకు గురయ్యాయి. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి తెలియగానే మాజీమంత్రి హరీశ్ రావు ఇప్పటికే ఫామ్‌హౌస్‌కు చేరుకున్నారు. కాగా చికిత్స అనంతరం ఆయన ఆరోగ్యం కుదుట పడింది. ఆయన అస్వస్థత నుంచి కోలుకుంటున్నారని తెలుస్తోంది. కొంతకాలంగా కేసీఆర్ తరచూ అనారోగ్యానికి గురవుతున్నారు. జులై నెలలోనూ ఆయన అనారోగ్యానికి గురయ్యారు. యశోధ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న అనంతరం రికవరీ అయ్యారు. ఆస్పత్రిలో చికిత్స పొంది డిశ్చార్జయిన అనంతరం కేసీఆర్ హైదరాబాద్‌లోని నంది నగర్ నివాసంలో విశ్రాంతి పొందారు. ఆ తర్వాత తిరిగి ఫాం హౌజ్‌కు వెళ్లిపోయారు. ఆ తర్వాత ఆయన వరుసగా సమీక్షలు నిర్వహించారు. స్థానిక ఎన్నికల తో పాటు జూబ్లీహిల్స్ ఎన్నిక, కాళేశ్వరం ప్రాజెక్టు కేసు విషయమై పార్టీ శ్రేణులతో ఆయన సుదీర్ఘ చర్చలు జరిపారు. కాగా తిరిగి ఆయన అనారోగ్యానికి గురి కావడంతో బీఆర్ఎస్ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
అసెంబ్లీకి కేసీఆర్ హాజరవుతారా?
తెలంగాణ రాజకీయాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు అంశం మరోసారి రాజకీయ వేడిని రగిలిస్తోంది. జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలోని కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు దాఖలు చేసిన పిటిషన్లపై తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ సుప్రీంకోర్టునుఆశ్రయించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అదే సమయంలో, కాళేశ్వరం అంశంపై అసెంబ్లీలో చర్చ జరిగిన తర్వాతే తదుపరి చర్యలు తీసుకుంటామని కాంగ్రెస్ ప్రభుత్వం హైకోర్టుకు తెలియజేసింది. ఈ పరిణామాల నడుమ బీఆర్ఎస్ అసెంబ్లీలో గట్టిగా సమాధానం ఇవ్వాలని భావిస్తోంది. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రూ.లక్ష కోట్లతో చేపట్టిన ఒక ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో అవకతవకలు, అవినీతి జరిగాయనే ఆరోపణల నేపథ్యంలో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ 655 పేజీల నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది, ఇందులో కేసీఆర్, హరీశ్ రావు, ఇతర ఉన్నతాధికారులపై తీవ్ర ఆరోపణలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ శాసనసభకు హాజరవుతారా లేదా అన్న ఆసక్తి నెలకొంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com