KING KOHLI: గంభీర్ గుర్తుపెట్టుకో..ఆడి పేరు కోహ్లీ

విరాట్ కోహ్లీ బ్యాట్ నుంచి వచ్చిన అద్భుతమైన 53వ వన్డే సెంచరీ.. టీమిండియాకు రెండో వన్డేలో విజయాన్ని అందించలేకపోయింది. అయితేనేం, ఈ ఇన్నింగ్స్‌కు మాజీ క్రికెటర్లు, అభిమానుల నుంచి మాత్రం విపరీతమైన ప్రశంసలు దక్కాయి. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వరుసగా రెండో వన్డేలోనూ సెంచరీ బాదడంతో భారత క్రికెట్ వర్గాల్లో ఆనందం ఉప్పొంగింది. రాయ్‌పూర్‌లో సౌత్ ఆఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ తన కెరీర్లో 53వ వన్డే శతకాన్ని పూర్తి చేశాడు. రాంచీలో సాధించిన 135 పరుగుల భారీ ఇన్నింగ్స్ తర్వాత, 35 ఏళ్ల కోహ్లీ ఈ మ్యాచ్‌లోనూ 93 బంతుల్లో 102 పరుగులు చేశాడు. తనదైన కచ్చితత్వం, దూకుడుతో కూడిన బ్యాలెన్స్, వికెట్ల మధ్య వేగవంతమైన పరుగులతో భారత్ భారీ స్కోరుకు పునాది వేశాడు.
కోహ్లీ లేని క్రికెట్ అంటే శూన్యం
ఈ ఆధునిక దిగ్గజం కోహ్లీ నుంచి వచ్చిన మరో మాస్టర్ క్లాస్ ఇన్నింగ్స్‌ను మాజీ క్రికెటర్లు, కామెంటేటర్లు, సహచర ఆటగాళ్లు సోషల్ మీడియాలో తెగ మెచ్చుకున్నారు. అభినందనల వెల్లువలో మాజీ భారత బ్యాటర్ మొహమ్మద్ కైఫ్ చేసిన వ్యాఖ్యలు ప్రత్యేకంగా నిలిచాయి. కోహ్లీ ఇన్నింగ్స్‌ను 'ప్యూర్ వింటేజ్' అని పేర్కొంటూ, కైఫ్ 'ఎక్స్'లో ఒక సంచలన ప్రకటన చేశారు. "కోహ్లీ లేని క్రికెట్ అంటే శూన్యం… ప్యూర్ వింటేజ్!" అని రాసుకొచ్చారు. కోహ్లీకున్న అపారమైన ఆకర్షణకు, అతని సెంచరీలను అభిమానులు, మాజీ ఆటగాళ్లు ఎంత ముఖ్యంగా చూస్తారో చెప్పడానికి ఈ వ్యాఖ్య అద్దం పడుతోంది. "విరాట్ కోహ్లీకి వంద అంటే వేరే మత్తు ఉంటుంది... కింగ్‌కు బ్యాక్-టు-బ్యాక్ సెంచరీలు. 53వ వన్డే సెంచరీ. విరాట్ ఉన్నాడు అంటే ఏదైనా సాధ్యమే ,” అని పోస్ట్ చేశారు.
నంబర్ 3లో అత్యధిక సెంచరీలు
విరాట్ కోహ్లీ తన ODI కెరీర్లో ఎక్కువ భాగం నంబర్ 3 స్థానంలో బ్యాటింగ్ చేశాడు. అతను ఇప్పుడు ODI క్రికెట్లో నంబర్ 3 స్థానంలో బ్యాటింగ్ చేస్తూ 46 సెంచరీలు సాధించాడు, ఇది ప్రపంచ రికార్డు. ఇంతకుముందు నంబర్ 3 స్థానంలో బ్యాటింగ్ చేస్తూ అత్యధిక సెంచరీలు సాధించిన రికార్డు భారత్‌కు చెందిన సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. టెండూల్కర్ మూడో స్థానంలో బ్యాటింగ్ చేస్తూ 45 ODI సెంచరీలు సాధించాడు. 2027 వన్డే ప్రపంచకప్‌లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలను ఆడించకూడదని భారత ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ అనుకుంటున్నారని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. కానీ విరాట్, రోహిత్ బ్యాటింగ్ తీరు చూస్తే.. వారిని జట్టు నుంచి పక్కన పెట్టడం కష్టం మాత్రమే కాదు, అసాధ్యం కూడా. 2027 ప్రపంచకప్ సమయానికి రో-కోలకు దాదాపు 39 ఏళ్లు ఉంటాయి. అందుకే వారి భవిష్యత్తు గురించి నిరంతరం చర్చ జరుగుతోంది. కానీ ఇద్దరూ హాఫ్ సెంచరీఎం సెంచరీలతో చెలరేగుతూ.. జట్టుకు తాము ఎంత ముఖ్యమో నిరూపిస్తున్నారు. టీ20, టెస్ట్ నుంచి రిటైర్ అయ్యారు. విరాట్‌తో పాటు రోహిత్ కూడా గత మూడు మ్యాచ్‌ల్లో సెంచరీ, హాఫ్ సెంచరీతో అద్భుతమైన ఫామ్‌ను ప్రదర్శించాడు. ఆధునిక యుగంలో కోహ్లీ అత్యుత్తమ వన్డే బ్యాట్స్‌మన్. రాంచీలో 120 బంతుల్లో 11 ఫోర్లు, ఏడు సిక్సర్లతో 135 పరుగులు చేశాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

