IND vs NZ: టీమిండియా బ్యాటర్ల ఊచకోత

న్యూజిలాండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో భారత జట్టు అప్రతిహత దూకుడుతో ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. భారీ లక్ష్యాలు, ఒత్తిడి పరిస్థితులు ఏమాత్రం ప్రభావం చూపకుండా, భారత బ్యాటింగ్ విభాగం విధ్వంసకర ప్రదర్శనతో మరోసారి అభిమానులను ఉర్రూతలూగించింది. రెండో టీ20లో 209 పరుగుల లక్ష్యాన్ని కేవలం 15.2 ఓవర్లలోనే ఛేదించిన భారత్, టీ20 క్రికెట్ చరిత్రలోనే అరుదైన ఘనతను సాధించింది. ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, శివమ్ దూబె బ్యాట్లతో చెలరేగిపోగా, న్యూజిలాండ్ బౌలింగ్, ఫీల్డింగ్ పూర్తిగా చేతులెత్తేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ క్రికెట్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 208 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. ఈ స్కోరు చూస్తే మ్యాచ్ కివీస్ వైపే మొగ్గు చూపుతుందనిపించినా, భారత్ బ్యాటింగ్ విధ్వంసం ముందు ఆ మొత్తం క్షణాల్లోనే కరిగిపోయింది.
న్యూజిలాండ్ ఇన్నింగ్స్ ఆరంభం నుంచే దూకుడుగా సాగింది. భారత పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌ను లక్ష్యంగా చేసుకున్న ఓపెనర్లు తొలి మూడు ఓవర్లలోనే 40కి పైగా పరుగులు రాబట్టారు. అయితే నాలుగో ఓవర్లో హర్షిత్ రాణా అద్భుతంగా బౌలింగ్ చేస్తూ డెవాన్ కాన్వేను ఔట్ చేయడంతో భారత్‌కు తొలి బ్రేక్ లభించింది. ఆ ఓవర్ మెయిడెన్‌గా మారడం విశేషం. ఆ తర్వాత వరుణ్ చక్రవర్తి మరో ఓపెనర్ టిమ్ సీఫర్ట్‌ను పెవిలియన్‌కు పంపడంతో కివీస్‌కు షాక్ తగిలింది. అయినప్పటికీ రచిన్ రవీంద్ర తన దూకుడును తగ్గించలేదు. స్పిన్నర్లు, పేసర్లు అన్న తేడా లేకుండా బంతులను సిక్స్‌లకు తరలిస్తూ భారత బౌలర్లపై ఒత్తిడి పెంచాడు. గ్లెన్ ఫిలిప్స్, డెరిల్ మిచెల్ కూడా కీలక సమయాల్లో పరుగులు జోడించారు. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పరుగుల వేగం కొంత తగ్గింది.
209 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత క్రికెట్ జట్టుకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. సంజు శాంసన్, అభిషేక్ శర్మ తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. కానీ ఆ దశలో క్రీజులో నిలిచిన ఇషాన్ కిషన్ ఏమాత్రం ఒత్తిడికి లోనుకాలేదు. మూడో ఓవర్ నుంచే బౌలర్లపై విరుచుకుపడ్డాడు. జాక్ ఫౌక్స్ వేసిన ఓవర్లో వరుస బౌండరీలు, సిక్స్‌తో మ్యాచ్ దిశను మార్చేశాడు. స్పిన్నర్ శాంట్నర్‌పై కూడా ఇషాన్ వెనుకాడలేదు. కేవలం 21 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేసి, భారత్ ఛేదనకు బలమైన పునాది వేశాడు. ఇషాన్‌కు అండగా మరోవైపు సూర్యకుమార్ యాదవ్ తన సహజ శైలిలో బ్యాటింగ్ చేశాడు. ఫీల్డ్ అంతటా షాట్లు ఆడుతూ, బౌలర్ల లైన్ లెంగ్త్‌ను పూర్తిగా చెడగొట్టాడు. ఒకే ఓవర్లో 25 పరుగులు రాబట్టి కివీస్ క్యాంప్‌లో ఆందోళన పెంచాడు. ఇషాన్ ఔటైనా, అప్పటికే మ్యాచ్ భారత్ వైపు పూర్తిగా మళ్లిపోయింది.
ఇషాన్ ఔట్ తర్వాత సూర్యతో కలిసి శివమ్ దూబె కూడా దూకుడుగా ఆడాడు. అవసరమైన రన్‌రేట్ ఎప్పటికీ అదుపులోనే ఉండగా, సూర్య-దూబె జోడీ సిక్స్‌లతో ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. చివరికి భారత్ 28 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. సూర్యకుమార్ యాదవ్ అజేయంగా నిలిచి మ్యాచ్‌ను ముగించడం విశేషం. ఈ మ్యాచ్‌లో భారత్ నమోదు చేసిన ఛేదన టీ20 క్రికెట్ చరిత్రలోనే వేగవంతమైన 200 పైచిలుకు లక్ష్య ఛేదనగా రికార్డులకెక్కింది. గతంలో పాకిస్థాన్ చేసిన రికార్డును భారత్ బద్దలు కొట్టింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
