KOHLI: క్రెడిట్ తీసుకోవాలని చూసి కోహ్లీపై నిందలా: బీజేపీ

ఐపీఎల్ విజయోత్సవాల వేళ చిన్నస్వామి స్టేడియం వద్ద చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనపై కర్ణాటక ప్రభుత్వం విడుదల చేసిన నివేదిక కీలక విషయాలను వెల్లడించింది. దానిలో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ పేరును ప్రస్తావించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సిద్ధరామయ్య ప్రభుత్వంపై బీజీపే విమర్శలు గుప్పించింది. ఆర్సీబీ విజయానికి ప్రభుత్వం క్రెడిట్ తీసుకోవాలని చూసిందని, ఇప్పుడు ఫ్రాంచైజీని, కోహ్లీని నిందిస్తోందని దుయ్యబట్టింది. హైకోర్టు ఆదేశాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఈ నివేదికను బయటపెట్టింది. పోలీసుల నుంచి అనుమతులు తీసుకోకుండానే విధాన సౌధ నుంచి చిన్నస్వామి స్టేడియం వరకు జరిగే విజయోత్సవ ర్యాలీలో పాల్గొనాల్సిందిగా ప్రజలను ఆహ్వానిస్తూ ఆర్సీబీ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టింది. అభిమానులతో కలిసి ఈ విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నట్లు విరాట్ మాట్లాడిన వీడియో క్లిప్‌ను షేర్ చేసిందని ఆ రిపోర్ట్ పేర్కొంది. ఇవన్నీ చిన్నస్వామి స్టేడియానికి భారీగా ప్రజలు తరలి రావడానికి దోహదం చేశాయని వెల్లడించింది. ‘‘ఆర్సీబీ ఒక్కటే ప్రజలను ఆహ్వానించలేదు. కాంగ్రెస్ కూడా వారిని ఆహ్వానించింది. నివేదిక ప్రకారం ఆర్సీబీది మాత్రమే తప్పు అయితే.. ప్రభుత్వం పోలీసు అధికారులను ఎందుకు సస్పెండ్ చేసినట్టు..? ఈవెంట్ నిర్వహిస్తామని ఆర్సీబీ నుంచి సమాచారం ఉంటే.. ప్రభుత్వం అనుమతి నిరాకరించిఉండాలి. ఆ విజయానికి క్రెడిట్ తీసుకోవడం కోసమే.. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ప్రజలను ఆహ్వానించారు. ఇప్పుడు గొప్ప ఆటగాడు కోహ్లీ, ఆర్సీబీ మీద నిందలు వేయడం తప్పు’’ అని బీజేపీ నేత అరవింద్ బెల్లాడ్ విమర్శించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com