KOHLI: కోహ్లీ అంటే ఫామ్ అనుకుంటివా.. "క్లాస్"

తనపై, తన భవిష్యత్‌పై వస్తున్న ఎన్నో ఊహాగానాలకు, విమర్శలకు విరాట్ కోహ్లీ ఒక్క ఇన్నింగ్స్‌తో, కొన్ని మాటలతో సమాధానం చెప్పాడు. ఫార్మాట్ ఏదైనా, వయసు ఎంతైనా తన క్లాస్ శాశ్వతమని మరోసారి నిరూపించాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన ఉత్కంఠభరిత తొలి వన్డేలో అద్భుత శతకంతో (135 పరుగులు, 120 బంతుల్లో) చెలరేగి జట్టుకు విజయాన్నందించడమే కాకుండా, తన టెస్టు పునరాగమనంపై వస్తున్న పుకార్లకు కూడా ఫుల్స్టాప్ పెట్టాడు. ఈ మ్యాచ్‌లో కీలక దశలో క్రీజులోకి వచ్చిన కోహ్లీ, కెప్టెన్ కేఎల్ రాహుల్ (60), రోహిత్ శర్మ (57)లతో కలిసి కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. 37 ఏళ్ల వయసులోనూ కుర్రాడిలా క్రీజులో కదలాడుతూ, దక్షిణాఫ్రికా బౌలర్లను ఉతికారేశాడు. తన క్లాసిక్ కవర్ డ్రైవ్‌లతో, అద్భుతమైన షాట్లతో అలరించి కెరీర్లో మరో చిరస్మరణీయ శతకాన్ని నమోదు చేశాడు. తాను వన్డే క్రికెట్ మాత్రమే ఆడతానని కోహ్లీ స్పష్టంగా చెప్పాడు. “ఇది ఎప్పుడూ ఇలాగే ఉంటుంది. నేను ఒకే ఫార్మాట్ ఆడుతున్నాను” అని కోహ్లీ అన్నాడు. దీని అర్థం కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ కావాలని నిర్ణయించుకున్న తర్వాత, దానిని వెనక్కి తీసుకోవడం గురించి కూడా ఆలోచించడం లేదు.
అనుమానాలు పచాపంచలు
నిజానికి కోహ్లి ఇటీవల గొప్ప ఫామ్‌లో లేడు. ఆస్ట్రేలియాతో సిరీస్‌లో తొలి రెండు వన్డేల్లోనూ డకౌట్ అయితే ఇతడికి ఇక కష్టమేనా అనుకున్నారు. మూడో వన్డేలో కాస్త పుంజుకుని అర్ధసెంచరీతో సిరీస్‌ను పూర్తి చేశాడు విరాట్. అయినా అభిమానులకు సంతృప్తి లేదు. పైగా జోరు మీదున్న దక్షిణాఫ్రికాపై అతడు ఎలా ఆడతాడో అనే ఆందోళన తోడైంది. కానీ ఫామ్ తాత్కాలికం.. క్లాస్ శాశ్వతం అనే మాటని నిరూపిస్తూ రాంచిలో రెచ్చిపోయాడు కోహ్లి. ట్రేడ్‌మార్కు షాట్లకు అద్భుతమైన టైమింగ్‌ను జత చేసి సఫారీ బౌలర్ల పని పట్టాడు. మళ్లీ ఫామ్ లోకి వచ్చి తానేంటో నిరూపించుకున్నాడు.
ఎన్ని రికార్డులో....
రాంచీలో 3 సెంచరీలు:
రాంచీ స్టేడియంలో కోహ్లీకి ఇది మూడో సెంచరీ. ఈ మైదానంలో ఆడిన 5 ఇన్నింగ్స్‌లలో 3 సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీతో కోహ్లీ ఏకంగా 173 సగటు, 110 స్ట్రైక్ రేట్‌తో 519 పరుగులు చేశాడు.
మూడు వేదికల్లో 3 సెంచరీలు:
భారత్‌లో మూడు వేర్వేరు వేదికలలో (విశాఖపట్నం, పూణే, రాంచీ) 3 సెంచరీలు సాధించిన మొట్టమొదటి భారతీయ బ్యాటర్‌గా కోహ్లీ రికార్డు సృష్టించాడు. ఇంతకు ముందు సచిన్ టెండూల్కర్ కేవలం వడోదరలో మాత్రమే ఈ ఫీట్‌ను సాధించాడు.
సౌతాఫ్రికా పై రికార్డు: సౌతాఫ్రికా పై అత్యధిక సెంచరీలు (6) చేసిన భారత ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు. వార్నర్, సచిన్ 5 సెంచరీలు) రికార్డును కోహ్లీ అధిగమించాడు.
చరిత్రలో 7000వ సెంచరీ: అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో నమోదైన 7000వ సెంచరీ ఇదే కావడం మరో విశేషం.
స్వదేశంలో 50+ స్కోర్లు: భారత గడ్డపై వన్డేల్లో 59వ సారి 50 లేదా అంతకంటే ఎక్కువ స్కోరు చేసి, స్వదేశంలో అత్యధిక 50+ స్కోర్ల రికార్డును కోహ్లీ సచిన్ టెండూల్కర్ (58) నుంచి సొంతం చేసుకున్నాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

