KOHLI: వన్డేల్లోనూ విరాట్ శకం ముగిసినట్లేనా..?

ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో భారత్ రెండు వికెట్ల తేడాతో ఓడిపోవడంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కోల్పోయింది. దాదాపు ఏడు నెలల విరామం తర్వాత భారత జట్టులోకి తిరిగి వచ్చిన విరాట్ కోహ్లీ.. తొలి రెండు వన్డేల్లో ఘోరంగా విఫలమయ్యాడు. రెండు మ్యాచ్‌ల్లోనూ కోహ్లీ డకౌట్ అయ్యాడు. ముఖ్యంగా రెండో వన్డేలో 4 బంతులు ఆడి డకౌట్ అయిన తర్వాత విరాట్ కోహ్లీ తన గ్లౌవ్స్‌ను అడిలైడ్ ప్రేక్షకులకు చూపించడంతో ఇది అన్ని ఫార్మాట్ల నుంచి ఆయన రిటైర్మెంట్కు సంకేతమనే ఊహాగానాలు మొదలయ్యాయి.
అభిమానులకు అభివాదం
అవుట్ అయిన అనంతరం విరాట్ కోహ్లీ పెవిలియన్‌కు వెళ్తూ అడిలైడ్ ఓవల్ ప్రేక్షకుల వైపు చూశాడు. ఆ సమయంలో అతడి ముఖంపై చిరునవ్వు కనిపించింది. ఆపై నిశ్శబ్దంగా తన కుడి చేతిని పైకెత్తాడు. అప్పుడు కోహ్లీ ముఖంలో ఎలాంటి కోపం లేదు, నిరాశ లేదు.. లోతైన నిశ్శబ్దం మాత్రమే కనిపించింది. మనం ఇక్కడ మరలా కలవకపోవచ్చు అని కోహ్లీ చెప్పడానికి ప్రయత్నిస్తున్నట్లు అనిపించింది. పెవిలియన్‌కు వెళ్తూ అభిమానులకు అభివాదం చేయడంతో సోషల్ మీడియాలో కొత్త చర్చ మొదలైంది. సెస్ అనంతరం వన్డే ఫార్మాట్‌కు వీడ్కోలు చెబుతాడా? అనే సందేహం అభిమానుల్లో నెలకొంది. ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారిపోయింది. అడిలైడ్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల (టెస్టులు, వన్డేలు, టీ20లు) జాబితాను పరిశీలిస్తే.. ఆస్ట్రేలియన్ బ్యాట్స్‌మెన్ ఆధిక్యంలో ఉన్నారు. టాప్ 15 బ్యాట్స్మెన్లలో ఒకే ఒక్క విదేశీ ఆటగాడు ఉన్నాడు.. అది విరాట్ కోహ్లీనే.
గవాస్కర్ కీలక వ్యాఖ్యలు
ఈ క్రమంలో సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ.. భారత క్రికెట్‌కు విరాట్ కోహ్లీ చేసిన భారీ సేవలను దృష్టిలో ఉంచుకుని.. ఒకట్రెండు వైఫల్యాలు సహజమేనని.. అవి కోహ్లీకి అనుమతించదగినవేనని పేర్కొన్నారు. విరాట్ కోహ్లీలో ఇంకా చాలా క్రికెట్ మిగిలి ఉందని సునీల్ గవాస్కర్ నమ్మకంగా చెప్పారు. అంతే కాకుండా సిరీస్‌లోని మూడో వన్డేలో సిడ్నీ వేదికగా ఈ స్టార్ బ్యాటర్ భారీ ఇన్నింగ్స్ ఆడతారని ఆయన జోస్యం కూడా చెప్పారు. "చూడండి, ఆ మనిషి 14,000 కంటే ఎక్కువ పరుగులు, 52 వన్డే సెంచరీలు, 32 టెస్ట్ సెంచరీలు చేశాడు. అతను వేల వేల పరుగులు చేశాడు, కాబట్టి ఒకటి రెండు వైఫల్యాలు సహజం, అవి అతనికి అనుమతించబడతాయి" అని అన్నారు. "జరిగిన దాని గురించి ఎక్కువగా ఆలోచించవద్దు. అతనిలో చాలా క్రికెట్ మిగిలి ఉంది, చాలా క్రికెట్ ముందుంది. బహుశా సిడ్నీలో కోహ్లీ నుంచి ఒక పెద్ద ఇన్నింగ్స్ చూడవచ్చు. అడిలైడ్.. టెస్ట్, వన్డే స్థాయిలలో ఆస్ట్రేలియాలో కోహ్లీకి ఇష్టమైన మైదానం. అక్కడ విరాట్ కోహ్లీ సెంచరీలు చేశాడు, అందుకే ఇక్కడ కూడా భారీ స్కోరు ఆశించారు. కానీ అది జరగలేదు," అని సునీల్ గవాస్కర్ వ్యాఖ్యానించారు. 2008 ఆగస్టు 18న శ్రీలంకపై అరంగేట్రం చేసినప్పటి నుంచి, అంతర్జాతీయ క్రికెట్లో విరాట్ కోహ్లీ వరుసగా రెండు వన్డేల్లో డకౌట్ కావడం 6275 రోజుల తర్వాత ఇదే తొలిసారి.అంతేకాకుండా తన అపారమైన 75 వన్డే సిరీస్‌ల కెరీర్లో ఒకే వన్డే సిరీస్‌లో కోహ్లీ రెండు డకౌట్లు నమోదు చేయడం కూడా ఇదే మొదటిసారి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

