HAMPI: చరిత్ర సృష్టించిన కోనేరు హంపి

HAMPI: చరిత్ర సృష్టించిన కోనేరు హంపి
X
ఫిడే మహిళల గ్రాండ్‌ ప్రి చెస్‌ టోర్నీ విజేతగా తెలుగు తేజం

తెలుగుతేజం కోనేరు హంపి సరికొత్త చరిత్ర సృష్టించింది. గ్రాండ్‌మాస్టర్‌ కోనేరు హంపి ఫిడే మహిళల గ్రాండ్‌ ప్రి చెస్‌ టోర్నీ విజేతగా నిలిచింది. పుణె వేదికగా నిర్వహించిన ఈ చెస్‌ టోర్నీలో ఫైనల్ సమయానికి చైనాకు చెందిన జు జినర్‌తో కలిసి మన హంపి అగ్రస్థానంలో కొనసాగింది. ఫైనల్‌ రౌండ్‌లో కోనేరు హంపి బల్గేరియాకు చెందిన నుర్గుయిల్‌ సలిమోవాపై 1-0 తేడాతో గెలిచింది. మరో గ్రాండ్ మాస్టర్ జు జినర్‌ సైతం రష్యాకు చెందిన పొలినా షువలోవాపై గెలుపొందింది. దీంతో ఇద్దరూ మొదటి స్థానంతో ఫైనల్‌ను ముగించారు. అయితే.. అత్యుత్తమ టై-బ్రేక్‌ ఆధారంగా హంపి టైటిల్‌ విజేతగా నిలిచింది. మరో తెలుగమ్మాయి ద్రోణవల్లి హారిక.. ముంగంతూల్ బత్ఖుయాగ్ (మంగోలియా)తో; వైశాలి.. సలోమ్‌ మెలియా (జార్జియా)తో; దివ్య దేశ్‌ముఖ్‌.. ఎలీనా కష్లిన్‌స్కాయా (రష్యా)తో తమ గేమ్‌లను డ్రాగా ముగించారు.**

రిటైర్‌మెంట్‌పై స్పష్టత

రిటైర్మెంట్​పై తనకు ఇప్పుడే ఆలోచన లేదని కోనేరు హంపి ఇటీవలే స్పష్టం చేశారు. 2024 సంవత్సరం కష్టతరంగా గడిచిందని, ఆటపరంగా ఒత్తిడి ఎదుర్కొన్నట్లు చెప్పారు. ఒకానొక దశలో ఆటకు వీడ్కోలు పలకాలని అనుకున్నానని, కానీ న్యూయార్క్​లో జరిగిన ప్రపంచ ర్యాపిడ్ ఛాంపియన్​షిప్​లో విజేతగా నిలవడంతో తనపై తనకు నమ్మకం ఏర్పడినట్లు చెప్పారు. భవిష్యత్తులో గ్రాండ్ ఫ్రిక్స్ టోర్నీలతోపాటు మరిన్ని అంతర్జాతీయ టైటిళ్లు గెలవడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు హంపి చెప్పారు. చదరంగానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మంచి ప్రోత్సాహం అందిస్తున్నాయని చెప్పిన హంపి, ప్రస్తుతం క్రీడాకారులు ఆడేందుకు గతంలో కంటే ఇప్పుడు ఎన్నో అవకాశాలు ఉన్నాయని చెప్పారు. చదరంగంలో సాంకేతికత సైతం కీలకపాత్ర పోషిస్తుందని హంపి తెలిపారు.**

గెలుపు ఉత్సాహాన్ని ఇచ్చింది

ప్రస్తుత తరం యువత చాలా కష్టపడాలని, ఓడిపోయినప్పుడు బాధ పడకూడదని తెలిపారు. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని ముందుకు సాగాలని సూచించారు. అదే విధంగా ప్రస్తుతం సరైన కోచ్​ని ఎంపిక చేసుకోవడం కూడా చాలా ముఖ్యమని చెప్పారు. అదే విధంగా ఇప్పట్లో రిటైర్​మెంట్​ ఆలోచన లేదని, ప్రస్తుత గెలుపు మరింత ఉత్సాహాన్ని ఇచ్చిందని అన్నారు. మరిన్ని విజయాలు సాధిస్తానని హంపి స్పష్టం చేశారు.

Tags

Next Story