Leo Messi-InterMiami: చివరి నిమిషంలో మెస్సీ మ్యాజికల్ ఫ్రీకిక్ గోల్

Leo Messi Debut at Inter Miami: ఫుట్‌బాల్ మేటి ఆటగాడు, ఫుట్‌బాల్ మాంత్రికుడు లియోనల్ మెస్సీ(Lionel Messi) అమెరికా లీగ్‌లో తాను ఆడిన మొదటి మ్యాచ్‌లోనే గోల్ కొట్టి చారిత్రాత్మక దృశ్యం ఆవిష్కరించాడు. అదీ సాధారణంగా కొట్టే టాప్-ఇన్ గోల్ కాదు. చివరి నిమిషంలో 25 గజాల దూరం నుంచి గోడ కట్టిన ప్రత్యర్థుల మీదుగా, గోల్ కీపర్‌కి దొరక్కుండా బోల్తా కొట్టిస్తూ గోల్ కొట్టి తన ఆగమనాన్ని ఘనంగా చాటి చెప్పాడు. దీంతో 20000 మందితో నిండిపోయిన స్టేడియం దద్దరిల్లిపోయింది.
తన అర్జెంటీనా(Argentina) జాతీయ జట్టు తరపున, బార్సిలోనా(FC Barcelona), పారిస్ సెయింట్-జెర్మైన్(PSG) క్లబ్‌ల తరఫున చాలా సార్లు ఫ్రీకిక్ గోల్స్ కొట్టిన మెస్సీ మరోసారి మాయచేశాడు. ఫ్రీకిక్ అవకాశాన్ని గోల్‌గా మలవడంలో మెస్సీ లాంటి కొద్దిమంది ఆటగాళ్లే సిద్ధహస్తులు.
ఫుట్‌బాల్ దిగ్గజం, ఇంటర్ మియామీ(Inter Miami) సహ యజమాని డేవిడ్ బెక్‌హాం ఆనందంతో ఉప్పొంగిపోయాడు. చివరి నిమిషంలో గోల్‌తో 11 వరుస పరాజయాలతో ఉన్న ఇంటర్ మియామీ జట్టుకి విజయం అందించి పెట్టాడు.
శనివారం(IST) లీగ్స్ కప్(Leagues)లో భాగంగా క్రజ్ అజుల్(Cruz Azul)తో జరిగిన మ్యాచ్‌లో 2-1 గోల్స్ తేడాతో ఇంటర్ మియామీ జట్టుని గెలిపించాడు.
అందరూ ఎదరుచూసిన క్షణాలు..
మెస్సీ ఆటని చూడటానికి అభిమానులు కోట్లాది కళ్లతో ఎదురుచూశారు. కానీ మ్యాచ్ ఆడే 11 మంది ఆటగాళ్లలో మెస్సీ(Messi) కనిపించలేదు. రెండవ అర్ధభాగంలో మియామీ ఆటగాడు బెంజమిన్ సబ్ అవ్వడంతో 54వ నిమిషంలో మెస్సీ గ్రౌండ్‌లోకి అడుగుపెట్టాడు.
తర్వాత 10 నిమిషాలకే అల్‌క్రజ్ జట్టు గోల్ చేసి స్కోర్లు సమం చేసింది. మెస్సీ గోల్స్ కొట్టడానికి ఎంతప్రయత్నించినా లాభం లేకపోయింది. 90 నిమిషాల పూర్తి సమయానికి ఇరు జట్లు 1-1తో సమంగా ఉన్నాయి. 5 నిమిషాల ఎక్స్‌ట్రా సమయంలో వచ్చిన ఫ్రీకిక్ అవకాశాన్ని మెస్సీ గోల్‌గా మలిచి అభిమానులను పారవశ్యంలో ముంచెత్తాడు.
తరలివచ్చిన సెలెబ్రిటీస్..
లియోనల్ మెస్సీ ఆటని చూడటానికి వివిధ రంగాలకు చెందిన సెలెబ్రిటీస్ హాజరయ్యారు. బాస్కెట్‌బాల్ దిగ్గజం లెబ్రాన్ జేమ్స్, టెన్నిస్ దిగ్గజం సెరెనా విలియమ్స్, సెలెబ్రిటీ కిమ్ కర్ధాషియన్ స్టేడియంలో ప్రత్యక్షంగా వీక్షించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com