David De Gea: మాంచెస్టర్ యునైటెడ్‌కి వీడ్కోలు పలికిన స్టార్ గోల్‌కీపర్

David De Gea: మాంచెస్టర్ యునైటెడ్‌కి వీడ్కోలు పలికిన స్టార్ గోల్‌కీపర్

మాంచెస్టర్ యునైటైడ్‌ టీంతో గోల్‌ కీపర్ డేవిడ్ డీజియా దీర్ఘకాల బంధం తెగిపోయింది. ఈ మేరకు తను జట్టుని వీడుతున్నట్లు ప్రకటించాడు. మాంచెస్టర్‌ జట్టుతో 12 సంవత్సరాల పాటు కొనసాగిన డి జియా ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. 2011లో స్పెయిన్‌లోని అట్లెటికో మాడ్రిడ్ జట్టు నుంచి ఇంగ్లాండ్‌లోని మాంచెస్టర్ యునైటెడ్‌లో చేరి అప్పటినుంచి కొనసాగుతున్నాడు.

"మాంచెస్టర్ యునైటెడ్ అభిమానులకి వీడ్కోలు సందేశం ఇవ్వాలనుకుంటున్నాను. 12 సంవత్సరాలుగా మీరు నా పట్ల చూయించిన అంతులేని అభిమానానికి, ప్రేమకి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను.సర్ అలెక్స్ ఫెర్గూసన్ ఈ క్లబ్‌లోకి తెచ్చిన రోజు నుంచి మనం ఎన్నో సాధించాం. ఈ క్లబ్‌తో ఇన్ని విజయాలు సాధిస్తానని నేను ఎన్నడూ అనుకోలేదు. ప్రపంచంలోనే అతిపెద్దైన ఈ క్లబ్ జెర్సీ ధరించి జట్టుకు ప్రాతినధ్యం వహించి, నాయకత్వం వహించిన ప్రతీ సారి గర్వంగా ఫీలయ్యాను. ఇప్పుడు కొత్త సవాళ్లని స్వీకరించడానికి ఇదే సరైన సమయం. నన్ను మలిచిన మాంచెస్టర్ నన్ను వీడి పోదు. నా హృదయంలో మాంచెస్టర్‌కి ప్రత్యేక స్థానం ఉంటుంది. " అని భావోద్వేగ పోస్ట్ చేశాడు.

మాంచెస్టర్ యునైటెడ్ తన ట్విట్టర్‌లో "ఎప్పటికీ యునైటెడ్ లెజెండ్. క్లబ్ తరపున నీ సేవలకు ధన్యవాదాలు" అని వీడ్కోలు మెసేజ్ పెట్టింది.

12 సంవత్సరాలుగా మాంచెస్టర్‌ యునైటెడ్‌తో 545 మ్యాచ్‌లు ఆడిన డీ జియా జట్టు తరఫున ఎన్నో వ్యక్తిగత, టీం విజయాల్లో పాలుపంచుకున్నాడు. యునైటెడ్ జట్టుకు గోల్ పోస్ట్‌కి అడ్డుగోడలా నిలబడి ఎన్నోసార్లు జట్టుకు మధురానుభూతుల్ని అందించాడు.


147 క్లీన్‌షీట్లతో యునైటెడ్ తరఫున ఆడుతూ ఒకే జట్టు తరఫున ఎక్కువ క్లీన్‌షీట్లు నమోదు చేసిన కీపర్లలో 2వ స్థానం సాధించాడు. ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో 4వ స్థానంలో ఉన్నాడు. 2 సార్లు గోల్డెన్ గ్లోవ్ అవార్డుకు ఎంపికయ్యాడు. గోల్‌ పోస్ట్ వద్ద 1,157 సేవ్‌లతో ప్రీమియర్ లీగ్ చరిత్రలో అత్యధిక సేవ్‌లు చేసిన కీపర్లలో 3వ స్థానంలో నిలిచాడు. అలాగే లీగ్‌లో 415 మ్యాచులు ఆడి, ఎక్కువ మ్యాచ్‌లు గోల్‌కీపర్లలో 7వ స్థానంలో ఉన్నాడు.


యునైటెడ్ జట్టు తరఫున ప్రీమియర్ లీగ్ టైటిల్, FAకప్, 2 సార్లు లీగ్ కప్, 3 కమ్యూనిటీ షీల్డ్ టైటిళ్లు, 2016-17 యూరోపా లీగ్ టైటిల్‌ను సాధించాడు. జట్టు తరఫున బెస్ట్ ఆటగాడిగా 4 సార్లు సర్ మాట్ బస్బీ ట్రోఫీని అందుకున్నాడు. స్పెయిన్ తరఫున 45 అంతర్జాతీయ మ్యాచులు ఆడాడు.

Tags

Read MoreRead Less
Next Story