Manoj Tiwary: రిటైర్మెంట్‌పై వెనక్కి తగ్గిన మనోజ్‌ తివారీ

Manoj Tiwary: రిటైర్మెంట్‌పై వెనక్కి తగ్గిన మనోజ్‌ తివారీ
బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడితో చర్చల అనంతరం నిర్ణయం... రంజీ ట్రోఫీలో బెంగాల్‌ను నడిపించనున్న మనోజ్‌ తివారీ

ప‌శ్చిమ బెంగాల్ క్రీడా శాఖ మంత్రి (West Bengal Sports Minister) మ‌నోజ్ తివారీ(Manoj Tiwary) రిటైర్మెంట్ నిర్ణయం వెన‌క్కి తీసుకున్నాడు. బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (Cricket Association Of Bengal) అధ్యక్షుడు స్నేహాశిష్ గంగూలీతో సమావేశం అనంతరం 37 ఏళ్ల తివారీ ఈ నిర్ణయం తీసుకున్నాడు. స్నేహశిష్‌ గంగూలి అభ్యర్థన మేరకు రిటైర్మెంట్‌ ప్రకటించిన ఐదు రోజుల్లోనే మనోజ్‌ మ‌న‌సు మ‌ర్చుకున్నాడు. అత‌ను మ‌ళ్లీ రంజీ ట్రోఫీ (Ranji Trophy)ల్లో బెంగాల్ త‌ర‌ఫున ఆడ‌నున్నాడు. విలేఖరుల సమావేశంలో ఈ విషయాన్ని తివారీ అధికారికంగా ప్రకటించాడు.


ఈ నెల 3న అన్ని రకాల క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు మనోజ్ తివారీ ప్రకటించాడు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనోజ్ తివారీ వంటి సీనియర్ ఆటగాడి సేవలను కోల్పోవడం బెంగాల్ రంజీ జట్టుకు మైనస్‌గా మారే అవకాశాలున్నాయి. దీంతో స్నేహాశిష్ గంగూలీ నేరుగా రంగంలోకి దిగి తివారీతో చర్చలు జరిపాడు. రెండు గంటల చర్చ అనంతరం రిటైర్మెంట్ నిర్ణయంపై తివారీ వెనక్కి తగ్గాడు. దీంతో తివారీ వచ్చే రంజీ సీజన్ కూడా ఆడనున్నాడు. తివారీ కెప్టెన్సీలో గత రంజీ సీజన్‌లో బెంగాల్ జట్టు రనరఫ్‌గా నిలిచింది.


2004 డిసెంబర్‌లో ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. రంజీల్లో గొప్ప తివారీ ప‌ది వేల ప‌రుగుల మైలురాయికి చేరువ‌లో ఉన్నాడు. మ‌రో 98 ర‌న్స్ కొడితే అత‌ను 10 వేల క్లబ్‌లో చేర‌తాడు. 2006-07 రంజీ ట్రోఫిలో మనోజ్ తివారీ దుమ్ములేపాడు. 99 సగటుతో 796 పరుగులు చేశాడు. ఇప్పటివ‌ర‌కూ మనోజ్‌ తివారీ 141 ఫ‌స్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు. 29 సెంచ‌రీలు, 45 హాఫ్ సెంచ‌రీలు బాదాడు. మ‌నోజ్ తివారీకి దేశ‌వాళీ క్రికెట్‌(Domestic Cricket)లో తిరుగులేని రికార్డు ఉంది. 208-19లో విజ‌య్ హ‌జారే ట్రోఫీ(Vijay Hazare Trophy)లో 366 ప‌రుగుల‌తో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. రంజీ ట్రోఫీలో బెంగాల్ జ‌ట్టుకు కెప్టెన్‌గా వ్యవ‌హ‌రించాడు.


టీమిండియా తరపున మనోజ్‌ తివారీ ఆడినా... అనుకున్నంత రాణించలేక పోయాడు. 2008లో అత‌ను కామ‌న్‌వెల్త్ బ్యాంక్ సిరీస్‌లో ఆస్ట్రేలియాపై వ‌న్డేల్లో అరంగేట్రం చేశాడు. మిడిలార్డర్‌లో గ‌ట్టి పోటీ ఉండ‌డంతో కేవ‌లం 12 వ‌న్డేలు, 3 టీ20ల్లో మాత్రమే అత‌డికి అవ‌కాశం వ‌చ్చింది. ఆడింది 12 మ్యాచ్‌లే అయినా వ‌న్డేల్లో సెంచ‌రీతో మెరిశాడు. కానీ, ఆ త‌ర్వాత అవ‌కాశాలు ద‌క్కలేదు. దాంతో, ఐపీఎల్‌పై దృష్టి పెట్టిన తివారీ ఢిల్లీ డేర్‌డెవిల్స్(Delhi Daredevils), కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్‌(Kolkata Knight Riders), కింగ్స్ ఎలెవ‌న్ పంజాబ్(Kings XI Punjab), రైసింగ్ పూణే సూప‌ర్ జెయింట్స్‌(Rising Pune Supergiants) ఫ్రాంచైజీలకు ప్రాతినిధ్యం వ‌హించాడు.

Tags

Read MoreRead Less
Next Story