Marlon Samuels : అవినీతి కేసులో దోషిగా మర్లోన్ శామ్యూల్స్

వెస్టిండీస్‌కు ఎన్నో చిరస్మరణీయమైన విజయాలు అందించి... దిగ్గజ ఆటగాళ్లల్లో ఒకడిగా గుర్తింపు పొందిన మాజీ క్రికెటర్ మర్లోన్ శామ్యూల్స్(Marlon Samuels) అవినీతి కేసు (Corruption)లో దోషిగా తేలాడు. రెండేళ్ల క్రితం శామ్యూల్స్ తనకు వస్తు, ధన రూపంలో అందిన కానుకల గురించి అవినీతి నిరోధక శాఖ అధికారులకు కూడా చెప్పకుండా దాచిపెట్టి నిబంధనలను ఉల్లంఘించాడు. అంతేకాదు తాను ఉన్న ఫైవ్ స్టార్ హోటల్ బిల్లు రూ. 62,362ను కూడా దాచేశాడు. ఈ ఆరోపణలపై విచారణ చేపట్టిన అవినీతి నిరోధక శాఖ అధికారులకు సహకరించకుండా విచారణ ఆలస్యానికి కారణమయ్యాడు. గతంలోనూ ఇలా చాలాసార్లు ప్రవర్తించి శామ్యూల్స్ వార్తల్లో నిలిచాడు.
ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు(Emirates Cricket Board) యాంటీ కరప్షన్ కోడ్(Anti-Corruption Code) ప్రకారం నాలుగు నిబంధనల ఉల్లంఘనకు పాల్పడినట్టు శామ్యూల్స్ అంగీకరించాడు. 2021 సెప్టెంబర్‌లో ఈ స్టార్ క్రికెటర్‌పై అవినీతి ఆరోపణలు రావడంతో అంతర్జాతీయ క్రికెట్ మండలి(ICC) కేసు నమోదు చేసింది. రెండేళ్ల తర్వాత ఈ విండీస్ మాజీ ఆటగాడు తన నేరాన్ని కోర్టు సమక్షంలో ఒప్పుకున్నాడు. అతడికి ఎలాంటి శిక్ష వేయాలనే దానిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని ICC వెల్లడించింది.
విండీస్ గొప్ప క్రికెటర్లలో ఒకడైన శామ్యూల్స్ 18 ఏళ్ల పాటు జాతీయ జట్టుకు ఆడాడు. శామ్యూల్స్ రెండు సార్లు టీ20 ప్రపంచ కప్(T20 World Cup) గెలిచిన జట్టులో సభ్యుడు. 2012, 2016లో కరీబియన్ జట్టు పొట్టి ప్రపంచ కప్ గెలవడంలో శామ్యూల్స్ కీలక పాత్ర పోషించాడు. తన కెరీర్‌లో 71 టెస్టులు, 207 వన్డేలు, 67 టీ20ల్లో కలిపి 11,134 పరుగులు చేశాడు. బంతితోనూ రాణించి 152 వికెట్లు తీశాడు.
2000లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగ్రేటం చేసిన మర్లోన్ శామ్యూల్స్.. వెస్టిండీస్ జట్టుతో పాటు ప్రపంచవ్యాప్తంగా పలు టీ20 ఫ్రాంచైజీలకు ప్రాతినిధ్యం వహించాడు. ఐపీఎల్‌లో ఢిల్లీ డేర్ డెవిల్స్, పుణె వారియర్స్ తరపున ఆడాడు. అంతేకాదు మెల్‌బోర్న రెనిగేడ్స్, పెషావర్ జల్మీ తరపునా ప్రాతనిధ్యం వహించాడు. ఎన్నో మ్యాచ్‌లను ఒంటి చేత్తో గెలిపించిన శ్యామ్సూల్స్.. పలు కాంట్రవర్సీలతోనూ వార్తల్లో నిలిచాడు.
2012లో కొలంబోలో జరిగిన టీ20 ప్రపంచ కప్ ఫైనల్‌లో.. శ్రీలంక జట్టుపై 56 బంతుల్లో 78 పరుగులు చేశాడు. 2016లో కోల్‌కతలో జరిగిన టీ20 ప్రపంచ కప్ ఫైనల్‌లో.. ఇంగ్లండ్ జట్టుపై 66 బంతుల్లో 85 రన్స్ చేసి.. వెస్టిండీస్‌ను గెలిపించాడు. ఇలా ఎన్నో సార్లు కీలక ఇన్సింగ్స్ ఆడి జట్టుకు చిరస్మరణీయ విజయాలను అందించాడు శామ్యూల్స్.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com