Paris Olympics: ఒలింపిక్స్‌లో ఆడేందుకు వేలు తొలగించుకున్న ఆస్ట్రేలియా హాకీ ప్లేయర్ ..

గాయమైన వేలికి శస్త్రచికిత్స చేయించుకున్నా ఇప్పట్లో కోలుకునే పరిస్థితి లేకపోవడం, మరోవైపు, ఒలింపిక్స్ క్రీడలు సమీపిస్తుండడంతో ఆస్ట్రేలియా హాకీ ఆటగాడు మట్ డాసన్ తీసుకున్న ఓ నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరిచింది.
డిఫెండర్ అయిన డాసన్ కుడిచేతి ఉంగరపు వేలికి ఇటీవల పెద్ద గాయమైంది. శస్త్ర చికిత్స చేసుకున్నా కోలుకునేందుకు చాలా సమయం పట్టనుంది. అదే జరిగితే ఈ నెల 26 నుంచి ప్రారంభం కానున్న ఒలింపిక్స్‌కు దూరమవుతాడు. దీనిని జీర్ణించుకోలేకపోయిన డాసన్.. ఎలాగైనా దేశం తరపున ఒలింపిక్స్‌లో ఆడాలని నిర్ణయించుకున్నాడు. అందుకోసం కఠిన నిర్ణయం తీసుకున్నాడు. అందులో భాగంగా గాయమైన వేలి పైగాన్ని పూర్తిగా తొలగించుకుని దేశంపైనా, ఆటపైనా అతడికున్న మక్కువను చాటుకున్నాడు.
వేలు తొలగించుకోవడానికి ముందు విషయాన్ని భార్యకు చెప్పానని, ఆమె వద్దని వారించిందని చెప్పాడు. అయినప్పటికీ నిర్ణయం మార్చుకోలేదని వివరించాడు. కాగా, ఆరేళ్ల క్రితం హాకీ స్టిక్ తగలడంతో దాదాపు కంటిచూపు కోల్పేయేంత పని అయింది. అప్పుడు కూడా ధైర్యంగా ఉండి కంటి చూపును కాపాడుకోగలిగాడు. ఇప్పుడు మళ్లీ వేలిని తొలగించుకుని మరోమారు వార్తల్లోకి ఎక్కాడు.
ఈ నిర్ణయంపై ఆస్ట్రేలియా పురుషుల జట్టు కోచ్ కొలిన్ బ్యాచ్ దీనిపై స్పందిస్తూ.. ఆటపై అతడి ప్రేమను అభినందించాడు. ‘వేగంగా కోలుకోవడానికి వేలు తొలగింపు మంచి మార్గం. కానీ, అతడు ఏం చేయాలన్నది నేను మాత్రం నిర్ణయించకూడదు. అతడు పారిస్‌లో ఆడటానికి పూర్తిగా కట్టుబడి ఉన్నాడు. అతడు చాలా గ్రేట్’ అని పేర్కొన్నాడు. 2024 ఒలింపిక్స్‌లో జులై 27న హాకీ మ్యాచ్‌లు మొదలుకానున్నాయి. ప్రస్తుతం మాట్ ఒక బ్యాండైడ్ ధరించి ప్రాక్టీస్ చేస్తున్నాడు. మైదానంలో అతడు చురుగ్గా కనిపించాడని చెప్పాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com