Max Verstappen : ఎఫ్1 ప్రపంచ ఛాంపియన్‌గా వెర్‌స్టాపెన్..!

ఏడాది కాలంగా వరుస విజయాలతో విజృంభిస్తున్న ఫార్ములావన్ (ఎఫ్1) రేసర్ మ్యాక్స్ వెర్‌స్టాపెన్ ప్రపంచ చాంపియన్‌షిప్ టైటిల్ సొంతం చేసుకున్నాడు. అదివారం సాయింత్రం తీవ్ర ఉత్కంఠభరితంగా సాగిన అబుదాబి గ్రాండ్ ప్రిలో రెడ్‌బుల్ డ్రైవర్ వెర్‌స్టాపెన్ విజేతగా నిలిచాడు. ఏడుసార్లు ప్రపంచ చాంపియన్ లూయిస్ హామిల్టన్ (మెర్సిడెస్) తో కలిసి ఈ రేసుకు ముందు 369.5 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్న 24 ఏండ్ల వెర్‌స్టాపెన్ తాజా విజయంతో 26 పాయింట్లు ఖాతాలో వేసుకొని ఓవరాల్‌గా 395.5 పాయింట్లతో విశ్వవిజేతగా నిలువగా.. ఎనిమిదో టైటిల్‌తో రికార్డు సృష్టించాలనుకున్నహామిల్టన్ కేవలం 2.256 సెకన్ల తేడాతో రెండో స్థానానికి పరిమితమయ్యాడు.
2013 తర్వాత రెడ్‌బుల్ డ్రైవర్‌కు ఇదే తొలి ఎఫ్1 టైటిల్ కాగా.. అప్పటి నుంచి ప్రతిసారీ చాంపియన్‌షిప్ సొంతం చేసుకుంటూ వస్తున్న మెర్సిడెస్‌కు ఈ సారి నిరాశ ఎదురైంది. విజయం అనంతరం మాట్లాడిన వెర్‌స్టాపెన్ సంతోషం వ్యక్తం చేశాడు. " నిజంగా నమ్మలేకపోతున్నా. నేను ప్రపంచ చాంపియన్‌ను అనే ఊహ నన్ను నిలువనివ్వడం లేదు. అమితానందంలో మాటలు రావడం లేదు. మరో పది, పదిహేనేండ్లు ఇదే జోరుతో దూసుకెళ్లాలనుకుంటున్నా" అని చెప్పాడు. తొలిసారి ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన వెర్‌స్టాపెన్.. ఆ టైటిల్ అందుకున్న నాలుగో అత్యంత పిన్న వయస్సు రేసర్ కావడం విశేషం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com