MAXWELL: వన్డేల్లో ముగిసిన మాక్స్‌వెల్‌ శకం

MAXWELL: వన్డేల్లో ముగిసిన మాక్స్‌వెల్‌ శకం
X
ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌, విధ్వంసకర బ్యాటర్ గ్లెన్‌ మాక్స్‌వెల్‌ సంచలన నిర్ణయం

ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌, విధ్వంసకర బ్యాటర్ గ్లెన్‌ మాక్స్‌వెల్‌ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ వన్డేలకు వీడ్కోలు పలుకుతున్నట్లు సంచలన ప్రకటన చేశాడు. ఈ ప్రకటనతో మ్యాక్సీ 13 ఏళ్ల సుదీర్ఘ వన్డే కెరీర్‌ ముగిసింది. మాక్స్‌వెల్‌ రిటైర్ మెంట్ ను క్రికెట్ ఆస్ట్రేలియా కూడా ధ్రువీక‌రించింది. ఆస్ట్రేలియా తరపున 2012లో వన్డేల్లోకి అడుగుపెట్టిన మాక్స్‌వెల్‌.. ఇప్పటివరకు 149 మ్యాచ్‌లు ఆడాడు. దాదాపు ఎనిమిదేళ్ల నుంచి టెస్టులకు కూడా దూరంగా ఉన్నాడు. ఇప్పుడు వన్డేలకు కూడా వీడ్కోలు పలికాడు. ఇక మాక్స్‌వెల్‌ కేవలం టీ20ల్లో మాత్రమే ఆడనున్నాడు. యువ ఆట‌గాళ్లకు అవకాశమిచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు గ్లెన్‌ మాక్స్‌వెల్ వెల్లడించాడు. పదే పదే గాయాల బారిన పడడం కూడా మాక్సీ రిటైర్మెంట్‌కు ప్రధాన కారణమని మాజీలు గుర్తు చేస్తున్నారు. ఇటీవల మ్యాక్స్ వెల్ వరుసగా గాయపడుతూ మ్యాచులకు దూరమవుతున్నాడు.

వన్డే కెరీర్ ఇలా..

149 వన్డేలు ఆడిన మాక్స్‌వెల్ 4,000 పరుగులు చేశాడు. ఇందులో 4 శతకాలు, 23 అర్ధశతకాలు ఉన్నాయి. వన్డేల్లో మ్యాక్సీ అత్యధిక స్కోర్ 201 నాటౌట్. వన్డేల్లో 77 వికెట్లు కూడా ప‌డ‌గొట్టాడు. ఆస్ట్రేలియా తరపున చివరి వన్డే ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీలో ఆడాడు. 2015, 2019, 2023లో ఆస్ట్రేలియా ప్రపంచకప్ సాధించడంలో మాక్స్‌వెల్ కీలక పాత్ర పోషించాడు. వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌ 2023లో అఫ్గానిస్తాన్‌పై మాక్సీ ఆడిన ఇన్నింగ్స్ అతడి కెరీర్ లోనే హైలెట్. ఈ ఇన్నింగ్స్ ఆ ప్రపంచకప్ కే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గాయం అయినా ఒంటి కాలితో అఫ్గానిస్తాన్‌పై డ‌బుల్ సెంచ‌రీ బాది ఆస్ట్రేలియాను సెమీఫైన‌ల్‌కు చేర్చాడు.

వరుసగా రిటైర్మెంట్లు

ఇటీవలి కాలంలో ఆస్ట్రేలియా స్టార్స్ అందరూ రిటైర్మెంట్‌ ప్రకటించారు. 2024 జనవరిలో డేవిడ్ వార్నర్, 2024 అక్టోబర్‌లో మాథ్యూ వేడ్, 2025 ఫిబ్రవరిలో మార్కస్ స్టోయినిస్, 2025 మార్చిలో స్టీవ్ స్మిత్ రిటైర్ అయ్యారు. తాజాగా గ్లెన్‌ మాక్స్‌వెల్ వీడ్కోలు పలికాడు. దాంతో 2026 వన్డే ప్రపంచకప్‌కి ఆసీస్ కొత్త జట్టుని సిద్ధం చేసుకోవాల్సి ఉంది.

Tags

Next Story