Mbappe: సౌదీ క్లబ్ నుంచి ఎంబాపెకి కళ్లుచెదిరే ఆఫర్

Mbappe: ఫ్రాన్స్ ఫుట్‌బాల్ వరల్డ్ కప్ విజేత, పీఎస్‌జీ క్లబ్(PSG) ఆటగాడు కిలియన్ ఎంబాపెకి సౌదీ అరేబియా లీగ్(Saudi Pro League) నుంచి కళ్లుచెదిరే ఆఫర్ వచ్చింది. క్రీడారంగ చరిత్రలోనే ఏ ఆటగాడికి అటువంటి ఆఫర్ ఇప్పటివరకు ఎవరికీ రాలేదు. అతనికి ఏడాదికి 700 మిలియన్ డాలర్లు(రూ.2,718 కోట్లు) చెల్లించడానికి సౌదీకి చెందిన అల్ హిలాల్ క్లబ్ ఆఫర్ ముందుంచింది. ఈ ఆఫర్‌కి పిఎస్‌జీ యాజమాన్యం సుముఖంగానే ఉంది. ఎంబాపెతో చర్చలు జరపడానికి సౌదీ క్లబ్‌కి అనుమతి కూడా ఇచ్చింది. ఇక నిర్ణయం ఎంబాపె చేతిలోనే ఉంది. ఇప్పటికే సౌదీ లీగ్‌లో ఆడుతున్న ఫుట్‌బాల్ మేటి ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో అల్ నాసర్ క్లబ్ తరపున ఆడుతున్నాడు. ఇప్పుడు చాలా మంది ఫుట్‌బాల్ ఆటగాళ్లకు సౌదీ లీగ్ జట్లు గాలం వేస్తున్నాయి.
ప్రస్తుతం తాను ఆడుతున్న PSG క్లబ్‌తో ఎంబాపె కాంట్రాక్ట్‌ను పునరుద్ధరించుకోవడానికి సుముఖంగా లేడు. ఈ విషయంపై ఇది వరకే బోర్డుకు తన నిర్ణయం వెల్లడించినట్టు సమాచారం. PSG తో కాంట్రాక్ట్ పునరుద్ధరించుకోవడానికి గడువు జులై 1 దాకా ఉండేది. 2023-34 సీజన్ తర్వాత ఎంబాపె ఫ్రీ ఏజెంట్‌గా అవనున్నాడు. ఎంబాపెతో కాంట్రాక్ట్ రెన్యువల్ కోసం పీఎస్‌జీ క్లబ్ యాజమాన్యం శతవిధాలుగా ప్రయత్నించింది. ఇప్పటికీ ప్రయత్నిస్తోంది. ఎంబాపే సుముఖంగా లేకుంటే ఈ సమ్మర్ ట్రాన్స్‌ఫర్ విండోలో ఏ క్లబ్ నుంచి అయితే ఎక్కువ ఆఫర్ వస్తుందో ఆ క్లబ్‌కి విక్రయించాలని భావిస్తోంది. ఈ సీజన్‌లోనే మరో దిగ్గజ ఆటగాడు లియోనల్ మెస్సీ కూడా PSGని వీడి అమెరికాలోని ఇంటర్ మియామీ(Inter Miami) క్లబ్‌లో చేరిన సంగతి తెలిసిందే.
కొద్దిరోజుల క్రితమే PSG జట్టు పర్యటించే జపాన్, సౌత్ కొరియా పర్యటన నుంచి ఎంబాపె తప్పుకున్నాడు. దీంతో PSGని వీడతాడనే అనుమానాలు బలపడ్డాయి.
ఈ ఫ్రెంచ్ వరల్డ్ కప్ విజేత కోసం ప్రముఖ స్పెయిన్ ఫుట్‌బాల్ క్లబ్ రియల్ మాడ్రిడ్ చాలా రోజుల నుంచి సీరియస్‌గా ప్రయత్నిస్తోంది. ప్రతీ ట్రాన్స్‌ఫర్ విండో సమయంలో రియల్ మాడ్రిడ్ ఆఫర్లు చేయడం, అప్పుడే పీఎస్‌జీతో ఎంబాపే కాంట్రాక్ట్ పొడిగించుకోవడం వంటివి పరిపాటిగా మారాయి. కానీ ఈసారి ఇక అలాంటి అవకాశం లేదు. ఖచ్చితంగా ఏదో ఒక క్లబ్‌లో ఎంబాపే చేరాల్సిందే..!
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com