Asian Games: ఆసియా క్రీడల్లో భారత్‌కు తొలి స్వర్ణం

ఆసియా క్రీడల్లో భారత్ ఖాతాలో తొలి బంగారు పతకం చేరింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో భారత జట్టు స్వర్ణ పతకం సాధించింది. ప్రపంచ ఛాంపియన్ రుద్రాంక్ష్ పాటిల్, ఒలింపియన్ దివ్యాన్ష్ పన్వర్, ఐశ్వరీ తోమర్‌తో కూడిన టీమ్ బంగారు పతకాన్ని గెలిచింది. అంటే కాకుండా క్వాలిఫికేషన్ రౌండ్‌లో సాధించిన పాయింట్స్ ద్వారా ప్రపంచ రికార్డును కూడా బద్దలుకొట్టింది. క్వాలిఫికేషన్ రౌండ్‌లో భారత పురుషుల జట్టు ఏకంగా 1893.7 పాయింట్లు సాధించింది. ఈ క్రమంలో చైనా నెలకొల్పిన 1893.3 పాయింట్ల రికార్డు బద్దలైంది. అలాగే పురుషుల ఫోర్ రోయింగ్ ఈవెంట్‌లో భారత్ ఖాతాలో కాంస్య పతకం చేరింది. జస్విందర్, భీమ్, పునీత్, ఆశిష్‌లతో కూడిన జట్టు 6:10.81 సెకన్ల టైమింగ్ నమోదు చేసి కాంస్య పతకాన్ని సాధించింది.
10 మీటర్ల ఎయిర్‌రైఫిల్ విభాగంలో జట్టుగా స్వర్ణం గెలిచిన రుద్రాంక్ష్ పాటిల్, ఐశ్వరీ తోమర్, దివ్యాన్ష్ పన్వర్ వ్యక్తిగతంగానూ ఫైనల్‌కు చేరుకోవడం విశేషం. ఫైనల్ కోసం జరిగిన పోటీల్లో రుద్రాంక్ష్ మూడో స్థానం, తోమర్ ఐదోస్థానం, దివ్యాన్ష్ ఎనిమిదో స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించారు. మరోవైపు మెన్స్ ఫోర్ రోయింగ్ ఈవెంట్‌లోనూ భారత్ కాంస్య పతకం దక్కించుకుంది. ఆసియా పోటీల్లో భారత్ పతకాల వేట కొనసాగిస్తోంది. తొలి రోజు ఆదివారం భారత్‌కు ఐదు పతకాలు దక్కిన సంగతి తెలిసిందే. వీటిలో రోయింగ్‌లో రెండు రజతాలు, ఓ కాంస్యం.. షూటింగ్‌లో ఓ రజతం, కాంస్యం ఉన్నాయి.
ఆసియా క్రీడలు 2023 సెప్టెంబరు 23న మొదలయ్యాయి. ఇవి అక్టోబర్ 8 వరకు చైనాలోని హాంగ్‌జౌలో జరగనున్నాయి. 19వ ఆసియా క్రీడల ప్రారంభ వేడుక సెప్టెంబర్ 23న హాంగ్‌జౌ ఒలింపిక్ స్పోర్ట్స్ సెంటర్ స్టేడియంలో జరిగింది. ఈ గ్రాండ్ ఓపెనింగ్ వేడుకలో భారత పురుషుల హాకీ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్, స్టార్ మహిళా బాక్సర్ లోవ్లినా బోర్గోహైన్ జెండా బేరర్లుగా వ్యవహరించారు. ఈ ఏడాది ఆసియా క్రీడల్లో భారత్ నుంచి 655 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఆసియా క్రీడల చరిత్రలో ఈసారి భారత్ నుంచి అత్యధికంగా క్రీడాకారులు పాల్గొంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com