MEXICO: మెక్సికో ఫుట్‌బాల్ మైదానంలో నరమేధం

మెక్సికోలో తుపాకుల మోత మరోసారి ప్రజలను భయాందోళనకు గురిచేసింది. క్రీడలతో నిండాల్సిన ఫుట్‌బాల్ మైదానం ఒక్కసారిగా హింసకు కేంద్రంగా మారింది. మ్యాచ్ ముగిసిన తర్వాత అభిమానులు మైదానంలోనే ఉన్న సమయంలో సాయుధ దుండగులు దాడికి పాల్పడి విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 12 మందికి పైగా తీవ్రంగా గాయపడటంతో ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ దారుణ ఘటన మెక్సికో మధ్య ప్రాంతంలోని గ్వానాహువాటో రాష్ట్రంలో చోటుచేసుకుంది. గ్వానాహువాటోలోని సలమంకా నగరంలో ఆదివారం రాత్రి స్థానిక కమ్యూనిటీ ఫుట్‌బాల్ గ్రౌండ్లో ఈ కాల్పులు జరిగాయి. సాకర్ మ్యాచ్ ముగిసిన అనంతరం కొందరు ప్రేక్షకులు మైదానంలోనే ఉండగా, అక్కడికి వచ్చిన గుర్తు తెలియని సాయుధులు ఒక్కసారిగా కాల్పులకు దిగారు.
100 రౌండ్ల కాల్పులు
దుండగులు దాదాపు 100 రౌండ్లకు పైగా కాల్పులు జరిపారు. ఈ దాడిలో 10 మంది అక్కడికక్కడే మరణించగా, మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఒక మహిళ, ఒక చిన్నారి కూడా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని వైద్య వర్గాలు పేర్కొంటున్నాయి. ఘటన సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, భద్రతా బలగాలు సంఘటనా స్థలానికి చేరుకుని పరిసర ప్రాంతాన్ని దిగ్బంధించారు. గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నారు. కాల్పుల ఘటనకు గల స్పష్టమైన కారణాలు ఇంకా తెలియరాలేదని పోలీసులు తెలిపారు.
సాధారణ నేరం కాదు...
ఈ ఘటనపై సలమంకా మేయర్ సీజర్ ప్రియెటో తీవ్రంగా స్పందించారు. ఇది సాధారణ నేరం కాదని, ఆర్గనైజ్డ్ క్రైమ్ ముఠాల మధ్య కొనసాగుతున్న ఆధిపత్య పోరులో భాగమేనని ఆయన పేర్కొన్నారు. తమ నగరంలో శాంతి భద్రతలను పునరుద్ధరించేందుకు కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని ఆయన కోరారు. నేర ముఠాలు స్థానిక అధికారులను లొంగదీసుకునే ప్రయత్నాలు చేస్తున్నాయని, పరిస్థితి తీవ్రంగా ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గ్వానాహువాటో రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన ప్రాంతమైనప్పటికీ, గత కొన్నేళ్లుగా మెక్సికోలోనే అత్యధిక హత్యలు నమోదవుతున్న రాష్ట్రంగా మారింది. ముఖ్యంగా చమురు దోపిడీ, డ్రగ్స్ అక్రమ రవాణాకు సంబంధించిన గ్యాంగ్‌ల మధ్య తీవ్ర స్థాయిలో ఆధిపత్య పోరు కొనసాగుతోంది. ఈ రాష్ట్రంలో చురుకుగా పనిచేస్తున్న జాలిస్కో న్యూ జనరేషన్ కార్టెల్, సాంటా రోసా డి లిమా కార్టెల్ మధ్య తరచుగా హింసాత్మక ఘర్షణలు జరుగుతున్నాయి.
తాజాగా ఫుట్‌బాల్ మైదానంలో జరిగిన కాల్పులు కూడా ఈ రెండు గ్యాంగ్‌ల మధ్య సాగుతున్న వార్‌లో భాగమేనని భద్రతా వర్గాలు అనుమానిస్తున్నాయి. ప్రజల సమూహాలు ఉండే ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడం ద్వారా ప్రత్యర్థి గ్యాంగ్‌లకు భయాన్ని సృష్టించడమే లక్ష్యమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఘటన మెక్సికోలో కొనసాగుతున్న డ్రగ్ ముఠాల హింసకు మరోసారి అద్దం పట్టింది. క్రీడా కార్యక్రమాలు, ప్రజా సమావేశాలు కూడా భద్రమేనా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేయగా, అదనపు బలగాలను సలమంకా నగరానికి తరలించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
