MODI: క్రీడల్లో బంధుప్రీతికి తెర: మోదీ

క్రీడల్లో, జట్టు ఎంపికలో బంధుప్రీతికి, అవకతవకలకు దశాబ్దం క్రితమే తెరపడిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఇప్పుడు అత్యంత పేద కుటుంబాలకు చెందిన పిల్లలు కూడా ప్రతిభ, కఠోర శ్రమతో అత్యున్నత స్థాయికి ఎదగొచ్చని ‘సంసద్ ఖేల్ మహోత్సవ్’ కార్యక్రమంలో ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ‘‘2014కు ముందున్న పద్ధతులకు తెరపడింది. అత్యంత పేద కుటుంబాల పిల్లలు కూడా ఇప్పుడు అత్యున్నత స్థాయికి ఎదగగలరు. ప్రతి ఏడాది క్రీడలకు రూ.3,000 కోట్లకు పైగా బడ్జెట్ కేటాయిస్తున్నాం. 2014కు ముందు రూ.1,200 కోట్లు మాత్రమే క్రీడల బడ్జెట్ ఉండేది. దేశంలోని ప్రతి క్రీడాకారుడికి చెప్పేదొక్కటే.. మీరు ఆడుతున్నది విజయం కోసం కాదు.. దేశం కోసం. త్రివర్ణ పతాకం గౌరవం, ప్రతిష్ఠ కోసం ఆడుతున్నారు. ఆటల్లో అత్యుత్తమ ప్రదర్శన చేసేలా తమ పిల్లలను తల్లిదండ్రులు ప్రోత్సహించాలి’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
పలువురు యువ క్రీడాకారులతో ప్రధాని సరదాగా సంభాషించి వారిలో స్ఫూర్తిని నింపారు. అస్సాంలోని దర్రాంగ్-ఉదల్గురి నియోజకవర్గానికి చెందిన శాంతి కుమారి అనే కబడ్డీ ప్లేయర్తో మాట్లాడుతూ.. పదో తరగతి పరీక్షలకు మరియు ఆమె క్రీడా భవిష్యత్తుకు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే సైకిల్ పోలో మరియు కబడ్డీ రెండు క్రీడల్లోనూ రాణిస్తున్న 14 ఏళ్ల బాలికను అభినందిస్తూ, సరైన సమయంలో ఒకే క్రీడపై దృష్టి సారించాలని సూచించారు. నీరజ్ అనే యువ బాక్సర్తో మాట్లాడుతూ.. "నువ్వు దేశం కోసం మెడల్ తీసుకువస్తావని నమ్మవచ్చా?" అని అడిగి నవ్వులు పూయించారు. ప్రభుత్వం క్రీడాకారుల డైట్, శిక్షణ బాధ్యతలను తీసుకుంటుందని, వారు కేవలం సాధన పైనే దృష్టి పెట్టాలని ప్రధాని భరోసా ఇచ్చారు. యువతలో టీమ్ వర్క్, నాయకత్వ లక్షణాలను పెంపొందించే ఒక గొప్ప ఉద్యమమని ప్రధాని అభివర్ణించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

