MODI: విశ్వ విజేతలతో ప్రధాని మోదీ ఆసక్తికర సంభాషణ

తొలిసారి వన్డే ప్రపంచ కప్‌ను నెగ్గిన అనంతరం భారత మహిళా క్రికెటర్లు ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిశారు. ఈ సందర్భంగా ప్రతి ప్లేయర్‌తో సరదాగా ముచ్చటించిన ప్రధాని.. అనంతరం క్రికెటర్ల కోసం స్నాక్స్ ఏర్పాటు చేశారు. ఆ సమయంలో బ్యాటర్ ప్రతీకా రావల్ కోసం మోదీ స్వయంగా స్నాక్స్ తీసుకురావడం నెటిజన్లను ఆకట్టుకుంది. స్మృతి కోసం భేల్ తెప్పించా, దీప్తికి ఇష్టమైన పనీర్ కూడా ఉందంటూ ప్రధాని నవ్వులు పూయించారు. గురువారమే ప్రధాని మోదీని క్రికెటర్లు కలవగా ఆ వీడియోను ప్రధానమంత్రి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
దీప్తీ టాటూ గురించి...
భారత స్టార్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మ వేయించుకున్న హనుమాన్ టాటూ గురించి ప్రధాని మోదీ ప్రత్యేకంగా అడిగారు. ‘హనుమంతుడి టాటూ ఉంది. అది ఎలా సాయపడింది?’ అని అడగ్గా.. ‘‘నాకు హనుమంతుడంటే చాలా ఇష్టం. నేను ఎక్కువగా నమ్ముతా. నా ఆటతీరు మెరుగుకావడానికి వ్యక్తిగతంగా నాకు సాయపడింది ఈ టాటూ’’ అని దీప్తి సమాధానం ఇచ్చింది. మైదానంలో దాదాగిరి ఏంటి? అని ప్రధాని సరదాగా ప్రశ్నించగా.. ‘అలాంటిది ఏం లేదు సార్. బౌలింగ్ వేసే క్రమంలో దూకుడు ప్రదర్శిస్తా’ అని దీప్తి చెప్పింది. ఈ టోర్నీలో గాయపడిన ప్రతీకా రావల్ ప్రధానితో భేటీకి వీల్‌ఛెయిర్‌లో వచ్చింది. సంభాషణ అనంతరం క్రికెటర్లు స్నాక్స్ తింటుండగా.. ప్రతీక వాటిని తీసుకోవడానికి ఇబ్బంది పడటం మోదీ గుర్తించారు. దీంతో ప్రధాని ఆమె దగ్గరకు వెళ్లి.. ‘నీకు ఎవరూ ఏమీ ఇవ్వట్లేదా? నీకు ఏది ఇష్టం?’ అని అడిగారు. ఆ తర్వాత స్నాక్స్ తీసుకెళ్లి ప్రతీకకు ఇవ్వడంతో ఆమె ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు. అప్పుడు మోదీ స్పందిస్తూ.. ‘ఇది నీకు ఇష్టమా? కాదా?’ అని సరదాగా అడగడంతో క్రికెటర్లంతా చిరునవ్వులు చిందించారు. ప్రధానితో జట్టు సభ్యులంతా ఫొటో దిగిన సమయంలో ప్రతీక మెడలో పతకం కన్పించడం నెట్టింట చర్చకు దారితీసింది. ఐసీసీ రూల్స్ సవరించి ఆమెకు పతకం ఇచ్చిందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ఇదే ఫొటోలో అమన్‌జ్యోత్ మెడలో పతకం లేదు. దీంతో స్నేహపూర్వకంగా అమన్‌జ్యోత్ మెడల్‌ను ప్రతీకకు ఇచ్చి ఉంటుందా?అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. దీనిపై ప్రతీక గానీ.. బీసీసీఐ గానీ స్పందించలేదు.
మా అమ్మకు మీరే హీరో
పేసర్ అరుంధతి రెడ్డి,మోదీ మధ్య జరిగిన ఓ ఆసక్తికర సంభాషణ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అరుంధతి రెడ్డి తన తల్లి పంపిన ఓ ప్రత్యేక సందేశాన్ని ప్రధానికి తెలియజేసింది. ఈ సమావేశంలో మాట్లాడే అవకాశం రావడంతో అరుంధతి ప్రధానితో, "మీతో మాట్లాడే అవకాశం వస్తుందని నేను అనుకోలేదు. మా అమ్మ మీకు పంపిన ఒక సందేశాన్ని చెప్పాలనుకుంటున్నాను. ఆమెకు మీరు హీరో అట" అని తెలిపింది. అరుంధతి మాటలకు ప్రధాని మోదీ చిరునవ్వుతో స్పందించారు.
'వంట నూనె వాడకం తగ్గించండి
భారత ఐసీసీ మహిళల ప్రపంచ కప్ విజేతలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమావేశం అయ్యారు. చారిత్రాత్మక విజయం సాధించినందుకు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ నేతృత్వంలోని జట్టు సభ్యులను ప్రధాని అభినందించారు. వారితో సంభాషణ సందర్భంగా దేశంలో పెరుగుతున్న ఊబకాయ సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో దేశ పౌరులంతా తమవంతు సాయం అందించాలని కోరారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

