SHAMI: దేశవాళీలో అదరగొడుతున్న షమీ
విజయ్ హజారే ట్రోఫీలో పేసర్ మహ్మద్ షమీ మరోసారి అద్భుత ప్రదర్శనతో మెరిశాడు. బెంగాల్ తరఫున బరిలోకి దిగిన అతడు హరియాణాతో మ్యాచ్‌లో 3 వికెట్లు తీశాడు. 10 ఓవర్లు వేసిన షమీ 61 పరుగులు ఇచ్చాడు. అంతకుముందు రౌండ్ 7 మ్యాచ్‌లోనూ మధ్యప్రదేశ్‌పై 42 పరుగులు చేసిన షమీ.. ఎనిమిది ఓవర్లు వేసి ఒక వికెట్ పడగొట్టాడు. దీంతో టీమిండియాలోకి షమీ ఎంట్రీ ఖాయం అని తెలుస్తోంది. గత ఆసీస్ పర్యటనకు ముందు కూడా దేశవాళీలో రాణించి అతడిని BGTలో తీసుకోలేదు. దీంతో ఆ సిరీస్‌ను భారత్ కోల్పోయిందని పలువురు మాజీ అభిప్రాయపడ్డారు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 11 వికెట్లు సాధించిన షమీ, విజయ్ హజారే ట్రోఫీలోనూ తన ఫిట్‌నెస్, ఫామ్‌ను కొనసాగిస్తున్నారు. మధ్యప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 42 పరుగులతో సత్తా చాటడం ద్వారా తన బ్యాటింగ్ నైపుణ్యాన్ని కూడా నిరూపించారు. ఇది అతడిని నమ్మకమైన ఆల్‌రౌండర్‌గా నిలిపే అవకాశాన్ని పెంచింది.
రీ ఎంట్రీ ఖాయమే
ఫిబ్రవరి 6 నుంచి భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో షమీ రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడనే వార్తలు జోరందుకున్నాయి. కుడి మడమకు శస్త్రచికిత్స చేయించుకున్న షమీని నేషనల్ క్రికెట్ అకాడమీ వైద్య బృందం నిశితంగా పరిశీలిస్తోందని తెలిసింది. మడమ గాయం నయమైనా, మోకాలిలో స్వల్ప వాపు ఉండటం వల్లే బోర్డర్-గావస్కర్ ట్రోఫీకి అతడ్ని ఎంపిక చేయలేదని టాక్. అయితే విజయ్ హజారే ట్రోఫీలో పేసర్ మహ్మద్ షమీ మరోసారి అద్భుత ప్రదర్శనతో మెరవడంతో టీమిండియా ఎంట్రీ ఖాయంగానే కనిపిస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీకి తీసుకుంటారా? పక్కన పెడతారా? అనేది చూడాలి. ఇప్పుడు విజయ్ హజారే ట్రోఫీలో రాణిస్తూ ఫిట్‌నెస్‌ను నిరూపించుకొనేందుకు కష్టపడుతోన్న షమీ.. ప్రధాన పేసర్‌గా ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడాలని బలంగా కోరుకుంటున్నాడు.
ఛాంపియన్స్ ట్రోఫీలో బుమ్రా ఆడతాడా.. ? లేదా..?
త్వరలో జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా పేసు గుర్రం బుమ్రా ఆడతాడా లేదా అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. బుమ్రా వెన్ను నొప్పితో బాధపడడంతో ఆస్ట్రేలియాతో జరిగిన ఐదో టెస్టులో బౌలింగ్ చేయలేదు. అయితే, బుమ్రా గాయంపై బీసీసీఐ ఇప్పటివరకు ఎలాంటి అప్‌డేట్ ఇవ్వకపోవడం అనుమానాలకు తావిస్తోంది. బోర్డు మౌనంగా ఉండటంతో బుమ్రా ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడతాడా లేదా అన్న దానిపై అనుమానాలు కొనసాగుతున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com