DHONI: ‘కెప్టెన్ కూల్’ ట్రేడ్ మార్క్ కోసం ధోనీ దరఖాస్తు

టీమిండియా మాజీ కెప్టెన్ MS ధోనీని అభిమానులు ముద్దుగా 'కెప్టెన్ కూల్' అని పిలుచుకుంటారు. ఈ పేరును తన సొంతం చేసుకునేందుకు ధోనీ ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ పేరును ట్రేడ్‌మార్క్‌గా నమోదు చేయాలని కోరుతూ ఆయన ట్రేడ్ మార్క్స్ రిజిస్ట్రీ పోర్టల్‌లో దరఖాస్తు చేశారు. దీనిని స్పోర్ట్స్ ట్రైనింగ్, కోచింగ్ సర్వీస్, ట్రైనింగ్ సెంటర్ల కోసం వినియోగించనున్నారు. ట్రేడ్ మార్క్స్ రిజిస్ట్రీ పోర్టల్ ప్రకారం ఆయన దరఖాస్తు ఇప్పటికే ఆమోదం తెలిపింది. 2025 జూన్ 16న ప్రచురితమైన అధికారిక ట్రేడ్‌మార్క్ జర్నల్‌లో ఇది వచ్చింది. అనేక ప్రయత్నాల తర్వాత చట్టం నుంచి ట్రేడ్‌మార్క్ పొందడంపై పట్ల ధోనీ న్యాయవాది మాన్సి అగర్వాల్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ ట్రేడ్ మార్క్ కోసం అనేక అడ్డంకులు ఎదురయ్యాయని ఆమె తెలిపారు. తాము మొదటగా ట్రేడ్ మార్క్ కోసం దరఖాస్తు చేసినప్పుడు రిజిస్ట్రీ ట్రేడ్‌మార్క్ చట్టంలోని సెక్షన్ 11(1) కింద అభ్యంతరం వ్యక్తం చేసిందని చెప్పారు. ఇప్పటికే రికార్డులో ఇలాంటి పదం ఉన్నందున ప్రజలు గందరగోళానికి గురయ్యే అవకాశం ఉందని అభిప్రాయపడిందని వివరించారు. కానీ, కెప్టెన్ కూల్ అన్న ట్యాగ్‌లైన్‌తో ధోనీకి ప్రత్యేకమైన అనుబంధం ఉందని రిజిస్ట్రీ ఎదుట వాదించామని తెలిపారు. ఈ ముద్దుపేరును అనేక సంవత్సరాలుగా ఆయన అభిమానులు, మీడియా విపరీతంగా వాడుతోందని తెలిపారు. కెప్టెన్ కూల్ అనే ట్యాగ్‌లైన్ ఆయనకు మారుపేరుగా మారిపోయిందని వివరించారు. ఇది కేవలం క్రీడలు, ఎంటర్టైన్మెంట్ సేవలకు మాత్రమే వాడతామని, దీంతో గందరగోళం అయ్యే అవకాశం లేదని వాదించారు. తాజాగా అతడిని 2025 ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చేర్చారు. ఏడుగురు దిగ్గజ క్రికెటర్లతో కలిసి ధోనీకి ఈ గౌరవం లభించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com