WPL 2025: చరిత్ర సృష్టించిన ముంబై

WPL 2025: చరిత్ర సృష్టించిన ముంబై
X
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ రెండో టైటిల్ కైవసం... రాణించిన హర్మన్‌ప్రీత్‌ కౌర్

మహిళల ప్రీమియర్‌ లీగ్‌లో ముంబై ఇండియన్స్‌ చరిత్ర సృష్టించింది. మూడు సీజన్లలో ఏకంగా రెండో టైటిల్‌తో అదరగొట్టింది. కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ 44 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 66 పరుగులు చేసి.. ముంబైకి కప్పును అందించింది. ఢిల్లీతో జరిగిన ఉత్కంఠ భరితమైన ఫైనల్‌ మ్యాచ్‌లో 8 పరుగుల తేడాతో ముంబై ఘన విజయం సాధించింది. రెండోసారి టైటిల్‌ను సొంతం చేసుకుంది.150 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ జట్టు 9 వికెట్ల నష్టానికి 141 పరుగులకు పరిమితమైంది. అంతకుముందు ముంబయి 7 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. దీంతో ఫైనల్లో ఢిల్లీ జట్టు స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక 8 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ప్రతీ సీజన్‌లోనూ ఢిల్లీ టేబుల్‌ టాపర్‌గా నిలిచి నేరుగా ఫైనల్‌కు వెళ్లినా.. అన్నిసార్లూ రన్నర్‌ప్‌గానే నిలిచింది.

రాణించిన హర్మన్‌ప్రీత్‌

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. హర్మన్‌ప్రీత్‌ కౌర్ (66; 44 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకుంది. ఢిల్లీ బౌలర్లలో మరిజేన్ కాప్ 2, జెస్ జోనాస్సెన్ 2, చరణి 2, అన్నాబెల్ సదర్లాండ్ ఒక వికెట్ తీశారు. కెప్టెన్‌ 33 బంతుల్లోనే అర్ధసెంచరీని పూర్తి చేసింది. మరో ఎండ్‌లో భారీ షాట్లు ఆడలేకపోయిన సివర్‌ను 15వ ఓవర్‌లో స్పిన్నర్‌ శ్రీచరణి అవుట్‌ చేసింది. దీంతో రెండో వికెట్‌కు 89 పరుగుల భారీ భాగస్వామ్యం ముగిసింది. సివర్‌ బ్రంట్‌ (30) మాత్రమే రాణించారు. కాప్‌, జొనాసెన్‌, శ్రీచరణిలకు రెండేసి వికెట్లు దక్కాయి.

ఒత్తిడికి చిత్తయిన ఢిల్లీ

150 పరుగుల లక్ష్య ఛేదనలో ఢిల్లీ తడబడింది. బ్యాటింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై పేలవ షాట్లతో వికెట్లను సమర్పించుకుంది. కాప్‌, జెమీమా పోరాటం ఏమాత్రం సరిపోలేదు. ఓపెనర్లు లానింగ్‌ (13), షఫాలీ (4).. 17 పరుగులకే పెవిలియన్‌ చేరారు. జెమీమా 11వ ఓవర్‌లో వెనుదిరగడంతో డీసీ 66/5 స్కోరుతో ఇక కష్టమే అనిపించింది. కాప్‌ జట్టును విజయతీరాలకు చేర్చే ప్రయత్నం చేసింది. 16వ ఓవర్‌లో 4,6,4తో 17 రన్స్‌ రాబట్టి ముంబై శిబిరంలో గుబులు రేపింది. ఇక గెలుపునకు 27 పరుగులు కావాల్సిన వేళ కాప్‌ను సివర్‌ అవుట్‌ చేయడం మ్యాచ్‌ పూర్తిగా ముంబై వైపు మళ్లింది. నికీ ప్రసాద్‌ కాస్త బ్యాట్‌ ఝుళిపించగా.. ఆఖరి ఓవర్‌లో 14 రన్స్‌ అవసరమయ్యాయి. సివర్‌ ఐదు పరుగులే ఇచ్చి ముంబైని సంబరాల్లో ముంచింది.

రెండో టైటిల్‌ గెలిచిన ముంబై

WPL 2025 ఫైనల్‌లో ముంబై ఇండియన్స్(MI) ఢిల్లీ క్యాపిటల్స్ (DC)ని ఎనిమిది పరుగుల తేడాతో ఓడించింది. దీంతో MI తమ రెండవ WPL టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఒకటి కంటే ఎక్కువ WPL టైటిళ్లను గెలుచుకున్న మొదటి జట్టుగా MI నిలిచింది. ఫైనల్‌లో MI 149/7 పరుగులు చేయగా DCని 20 ఓవర్లలో 141/9కి పరిమితమైంది. DC వరుసగా మూడు WPL ఫైనల్స్‌లో ఓడిపోయింది.


Tags

Next Story