IPL: ఉత్కంఠభరిత పోరులో ఢిల్లీ "రనౌట్"

IPL: ఉత్కంఠభరిత పోరులో ఢిల్లీ రనౌట్
X
ఢిల్లీపై 12 పరుగుల తేడాతో ముంబై విజయం... ఒకే ఓవర్లో ముగ్గురు ఢిల్లీ బ్యాటర్లు రనౌట్

ఐపీఎల్‌లో పరాజయాల పరంపరకు ముంబై ఇండియన్స్ చెక్ పెట్టింది. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ లో... ఢిల్లీ క్యాపిటల్స్‌కు షాక్ ఇచ్చింది. మెగా టోర్నీలో రెండో విజయాన్ని నమోదు చేసింది. ఢిల్లీలో జరిగిన మ్యాచ్ లో 12 పరుగుల తేడాతో ఢిల్లీపై ముంబై ఉత్కంఠభరిత విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో ఐదు వికెట్ల నష్టానికి 205 ప‌రుగులు చేసింది. మిడిలార్డర్ బ్యాట‌ర్, తెలుగు కుర్రాడు ఠాకూర్ తిల‌క్ వ‌ర్మ (33 బంతుల్లో 59, 6 ఫోర్లు, 3 సిక్స‌రలు) తో స‌త్తా చాటాడు. అనంత‌రం ఛేజింగ్ లో ఢిల్లీ 19 ఓవ‌ర్లలో 193 ప‌రుగులకు అలౌట్ అయింది. వ‌న్ డౌన్ బ్యాట‌ర్ క‌రుణ్ నాయ‌ర్ మెరుపు ఫిఫ్టీ (40 బంతుల్లో 89, 12 ఫోర్లు, 5 సిక్సర్లు)తో ఇంపాక్ట్ చూపించాడు. బౌల‌ర్లలో క‌ర్ణ్ శ‌ర్మ‌కు 3 వికెట్లు ద‌క్కాయి. తాజా విజయంతో పాయింట్ల పట్టికలో 7వ ప్లేస్ కు ముంబై చేరుకుంది. ఢిల్లీ రెండో స్థానానికి పడిపోయింది.

తిలక్‌ మరోసారి...

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇన్నింగ్స్‌లో ఓపెనర్‌ రికెల్టన్‌, సూర్యకుమార్‌తో పాటు మిడిలార్డర్‌లో తిలక్‌ వర్మ జట్టుకు అండగా నిలిచారు. అతడికి డెత్‌ ఓవర్లలో నమన్‌ ధిర్‌ అద్భుత సహకారం అందించాడు. ఐదో ఓవర్‌లో విప్రజ్‌ ఎల్బీతో వెనుదిరగ్గా తొలి వికెట్‌కు 47 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. కాసేపటికే కుల్దీప్‌ గూగ్లీకి రికెల్టన్‌ బౌల్డ్‌ అయ్యాడు. తిలక్‌ వర్మ (59: 33 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధశతకంతో చెలరేగాడు. ఓపెనర్‌ రోహిత్‌ శర్మ(18) మరోసారి నిరాశపరిచాడు. ఐదో ఓవర్లో విప్రజ్‌ వేసిన చివరి బంతికి ఎల్బీగా వెనుదిరిగాడు. మరో ఓపెనర్‌ రికెల్టన్‌(41: 25 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) దూకుడుగా ఆడాడు. రోహిత్‌ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన సూర్య కుమార్‌ యాదవ్‌(40: 28 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) కూడా బ్యాట్‌ ఝళిపించాడు. చివర్లో నమన్‌ (38*: 17 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు)ఉన్నంత సేపు దూకుడుగా ఆడాడు. దిల్లీ బౌలర్లలో విప్రజ్‌, కుల్దీప్‌ రెండేసి వికెట్లు.. ముకేశ్‌ ఒక వికెట్‌ తీశారు.

కరణ్ నాయర్ మెరుపు ఇన్నింగ్స్‌

206 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిల్లీకి తొలి బంతికే షాక్‌ తగిలింది. చాహర్‌ బౌలింగ్‌లో మెక్‌గుర్క్‌ క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో మరో ఓపెనర్‌ అభిషేక్‌ పోరెల్‌ (33: 25 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్స్‌)తో జట్టు కట్టిన కరుణ్‌ నాయర్‌ స్కోర్‌ బోర్డును పరుగులు పెట్టించాడు. బౌల్ట్‌ వేసిన రెండో ఓవర్లో మూడు ఫోర్లు కొట్టడంతో తన వేట మొదలైంది. ఓ వైపు అభిషేక్‌ నెమ్మదిగా ఆడినప్పటికీ కరుణ్‌ బౌండరీలతో విరుచుకుపడ్డాడు. ఆరో ఓవర్లో బుమ్రా బౌలింగ్‌లో రెండు సిక్స్‌లతో పాటు ఓ బౌండరీ బాదాడు. ఇదే ఓవర్లో నాయర్‌ అర్ధశతకం (22 బంతుల్లో) పూర్తిచేసుకున్నాడు.

ఒకే ఓవర్లో ముగ్గురు రనౌట్

15 ఓవర్లకు ఢిల్లీ 158/5 వికెట్లతో నిలవడంతో ఉత్కంఠ పెరిగింది. 16వ ఓవర్లో 6 పరుగులు , 17 ఓవర్లో 3 పరుగులే ఇచ్చారు. దీంతో సమీకరణం 18 బంతుల్లో 37 పరుగులుగా మారింది. అయితే శాంట్నర్‌ వేసిన 18వ ఓవర్లో విప్రాజ్‌ తొలి రెండు బంతుల్లో సిక్స్‌, ఫోర్‌ కొట్టాడు. ఐదో బంతికి విప్రాజ్‌ (14: 8 బంతుల్లో) ఔటయ్యాడు. ఈ ఓవర్లో మొత్తం 15 పరుగులు వచ్చాయి. 19వ ఓవర్‌లో బుమ్రా బౌలింగ్‌లో వరుస బంతుల్లో ముగ్గురు బ్యాట్స్‌మెన్‌ రనౌటయ్యారు. దీంతో ఢిల్లీ వరుస విజయాలకు బ్రేక్‌ పడింది.

Tags

Next Story