BCCI-Head Coach: టీమిండియా హెడ్‌ కోచ్‌ పోస్ట్.. అప్లై చేసిన మోడీ, అమిత్‌ షా

BCCI-Head Coach: టీమిండియా హెడ్‌ కోచ్‌ పోస్ట్.. అప్లై చేసిన మోడీ, అమిత్‌ షా
X
హెడ్‌ కోచ్‌ జాబ్‌ కోసం సుమారు 3 వేల దరఖాస్తులు

టీమ్‌ ఇండియా పురుషుల క్రికెట్ జ‌ట్టుకు హెడ్ కోచ్ ప‌ద‌వి కోసం బీసీసీఐ ఇటీవలే దరఖాస్తులను ఆహ్వానించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రధాన కోచ్ బాధ్యత‌ల‌ను రాహుల్ ద్రావిడ్ నిర్వర్తిస్తున్నాడు. అయితే జూన్ చివ‌రి నాటికి అత‌ని ప‌ద‌వీకాలం ముగియ‌నున్నది. అమెరికాలో జ‌రిగే టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ అత‌నికి చివ‌రి టోర్నీ కానున్నది. దీంతో హెడ్ కోచ్ ప‌ద‌వి కోసం బీసీసీఐ జారీ చేసిన ద‌ర‌ఖాస్తు గడువు కూడా మే 27తో ముగిసింది. ఈ నేపథ్యంలో గడువు ముగిసే సరికి హెడ్‌ కోచ్‌ పదవి కోసం సుమారు 3 వేల దరఖాస్తులు వచ్చినట్లు తెలిసింది. అయితే వాటిలో భారీ సంఖ్యలో నకిలీ దరఖాస్తులు ఉన్నాయి.

కొందరు ఆకతాయిలు ఏకంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ , కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా సహా క్రికెట్‌ దిగ్గజాలు సచిన్‌ టెండూల్కర్‌, ఎంఎస్‌ ధోనీ, హర్భజన్‌ సింగ్‌, వీరేంద్ర సెహ్వాగ్‌, బాలీవుడ్‌ స్టార్‌ నటుడు షారుక్‌ ఖాన్‌ సహా పలువురి పేర్లతో ఫేక్‌ అప్లికేషన్లు పంపారు. ఇప్పటి వరకూ అందిన దరఖాస్తుల్లో చాలా వరకూ మాజీ క్రికెటర్లు, ప్రముఖుల పేర్లే ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో బీసీసీఐ ఇప్పుడు ఫేక్‌ అప్లికేషన్లను ఏరివేసే పనిలో పడింది.

మరోవైపు సెలక్షన్‌ ప్రక్రియలో అప్లికేషన్లను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత వ్యక్తిగత ఇంటర్వ్యూలు ఉంటాయి. ఆ తర్వాత అభ్యర్థుల షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. కొత్తగా ఎంపికైన హెడ్ కోచ్ జూలై ఒక‌టో తేదీ నుంచి బాధ్యత‌ల‌ను చేప‌డతాడు. 2027, డిసెంబ‌ర్ 31వ తేదీ వ‌ర‌కు కొత్త కోచ్ త‌న బాధ్యత‌ల‌ను నిర్వర్తించ‌నున్నాడు. జూలైలో శ్రీలంక‌తో జ‌రిగే టెస్టు సిరీస్‌తో కొత్త కోచ్ బాధ్యత‌లు మొద‌ల‌వుతాయి. ఆ త‌ర్వాత స్వదేశంలో బంగ్లాదేశ్‌, న్యూజిలాండ్‌తో సిరీస్‌లు ఉంటాయి. ఇక బోర్డర్ గ‌వాస్కర్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియా వెళ్తారు. 2025లో పాకిస్థాన్‌లో చాంపియ‌న్స్ ట్రోఫీ ఉంటుంది. ఆ త‌ర్వాత ఏడాది ఇండియా, శ్రీలంక దేశాలు టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌కు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. 2027లో సౌతాఫ్రికాలో జ‌ర‌గ‌నున్న వ‌న్డే వ‌ర‌ల్డ్‌క‌ప్‌కు కూడా కొత్త కోచే ఉంటాడు. కోహ్లీ, రోహిత్ కెరీర్‌లు ద‌గ్గర‌ప‌డుతున్న నేప‌థ్యంలో.. కొత్త కోచ్ ఆ ఇద్దరి స్థానాల‌ను ఫిక్స్ చేయాల్సిన బాధ్యత‌ల‌ను తీసుకోవాల్సి ఉంటుంది. మరోవైపు హెడ్‌ కోచ్‌ పదవి కోసం ఇప్పటికే పలువురు మాజీ క్రికెట్‌ దిగ్గజాల పేర్లు వినిపించిన విషయం తెలిసిందే. గౌతమ్‌ గంభీర్‌, ఆస్ట్రేలియా క్రికెట‌ర్ రికీ పాంటింగ్ ‌(Ricky Ponting) వంటి ప్రముఖుల పేర్లు కూడా వినిపిస్తున్నాయి.

Tags

Next Story