Nasser Hussain: జేమ్స్ ఆండర్సన్‌పై నమ్మకం ఉంచండి: నాసిర్ హుస్సేన్

ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్‌పై ఆ జట్టు మాజీ కెప్టెన్ నాసిర్ హుస్సేన్ భరోసా ఉంచాడు. ఇటీవల జరిగిన యాషెస్ టెస్ట్ సిరీస్‌లో ఇంగ్లాండ్ జట్టు అద్భుత ప్రదర్శన చేసింది. కానీ ఆండర్సన్ మాత్రం పెద్దగా రాణించలేదు. 4 టెస్టుల్లో 85.40 సగటుతో 5 వికెట్లు మాత్రమే తీయగలిగాడు. అంతమాత్రాన ఆండర్సన్ పని అయిపోయిందని అనుకోవడం పొరపాటన్నాడు. అయితే ఆండర్సన్ టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా కొనసాగుతుండటం గమనార్హం. ఇంగ్లాండ్ జట్టుకు ఎన్నోసార్లు మరుపరాని ప్రదర్శనలు చేశాడు.
వచ్చే సంవత్సరం భారత పర్యటనకు రానున్న ఇంగ్లాండ్ పర్యటనలో ఆండర్సన్ తప్పకుండా కీలక ప్రదర్శన చేస్తాడన్నాడు. మళ్లీ తన పూర్వ వైభవాన్ని చాటుతాడన్నాడు. ఆండర్సన్‌కి భారత్‌పై మంచి రికార్డ్ ఉంది. 29.32 సగటుతో వికెట్లు తీశాడు. అలాగే ఆండర్సన్ 32 సార్లు 5 వికెట్ల మార్క్ దాటగా, అందులో 6 భారత్‌పైనే ఉన్నాయి.
"ఆండర్సన్‌కి భారత్‌పై మంచి రికార్డ్ ఉంది. జట్టుకు బౌలింగ్ విభాగంలో సమతూకం చాలా అవసరం. జిమ్మీ అనుభవం యువ బౌలర్లకి చాలా ఉపయోగకరం. కేవలం కొన్ని మ్యాచుల పేలవ ప్రదర్శనతో అతని పని అయిపోయిందనుకోవడం పొరపాటు. నేను అతనితో మాట్లాడాను. అతనిలో ఇంకా కసి పోలేదు, తన అత్యుత్తమ ఫాంకి చేరుకోవాలనుకుంటున్నాడు" అని అన్నాడు.
త్వరలోనే నెట్ ప్రాక్టీస్ కూడా మొదలెట్టనున్నాడు. అతను 700 వికెట్ల మైలురాయికి కేవలం 10 వికెట్ల దూరంలోనే ఉన్నాడు. ఈ మైలురాయే అతడిని మళ్లీ ఫాం అందుకునేలా చేస్తుందన్నాడు.
ఇంగ్లాండ్ మరో పేస్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ ఇటీవల యాషెస్ సిరీస్‌తో క్రికెట్‌కి గుడ్ బై చెప్పడంతో ఆండర్సన్‌పై పేస్ భారం మరింతగా పడనుంది. ఈ సమయంలో అతని సేవలు చాలా కీలకమన్నాడు.
"క్రిస్ వోక్స్ ఇంగ్లాండ్ అవతల రికార్డ్ బాగాలేదు. అలాగే అతను విదేశాల్లో ఆడటానికి సుముఖంగా లేదు. అతని మనసు మారుతుందేమో చూడాలి. స్టువర్ట్ బ్రాడ్, వోక్స్ వంటి వారు జట్టులో లేకుంటే జిమ్మీ ఆండర్సన్ లాంటి వారి అనుభవం జట్టుకు చాలా కీలకం" అన్నాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com