Javelin Throw: నీరజ్ చోప్రా ఖాతాలో మరో టైటిల్

Javelin Throw: నీరజ్ చోప్రా ఖాతాలో మరో టైటిల్

భారత ఒలంపిక్ బంగారు పతక విజేత, స్లార్ అథ్లెటిక్స్ ఆటగాడు నీరజ్ చోప్రా ప్రతిష్టాత్మక డైమండ్ లీగ్‌లో మరోసారి సత్తా చాటాడు. టోర్నీలో వరుసగా రెండోసారి మొదటిస్థానంలో నిలిచాడు. శుక్రవారం స్విట్జర్లాండ్‌లోని లాసెన్నెలో జరుగుతున్న డైమండ్ లీగ్ టైటిల్-2023 రెండవ లెగ్‌లో అందరి కంటే ఉత్తమంగా 87.66 మీటర్ల దూరం విసిరి టైటిల్ ఎగరేసుకుపోయాడు. దోహాలో జరిగిన మొదటి లెగ్‌లో కూడా నీరజే మొదటి స్థానంలో నిలిచాడు.

డైమండ్ లీగ్‌ మొదటి లీగ్ తర్వాత గాయపడి టోర్నీలోకి వచ్చిన నీరజ్ ప్రారంభం అసౌకర్యంగా, ప్రాక్టీస్‌ లేనట్లుగా అన్పించాడు. దీనికి అనుగుణంగానే తన విసిరిన మొదటి త్రో మిస్ చేశాడు. మొదటి రౌండ్ ముగిసే సరికి మొదటి మూడు స్థానాల్లో కూడా లేడు. జర్మనీకి చెందిన జూలియన్ వెబెర్ 86.20 మీటర్లు విసిరి మొదటిస్థానంలో నిలిచాడు.

రెండవ ప్రయత్నంలో 83.52 మీటర్లతో 3వ స్థానానికి చేరుకున్నాడు. రెండవ రౌండ్‌ చివరికి కూడా వెబెరే అగ్రస్థానంలో కొనసాగాడు.


తన మూడవ ప్రయత్నంలో 85.02 మీటర్లు విసిరిన నీరజ్ చోప్రా టాప్-3 లోకి ప్రవేశించి, రెండవ స్థానంలో నిలిచాడు. 86.20 మీటర్లతో జూలియన్ వెబెర్ మొదటి స్థానంలోనే ఉన్నాడు. 4వ ప్రయత్నంలో కూడా నీరజ్ తన త్రోని మిస్ చేసినప్పటికీ రెండవ స్థానంలోనే ఉన్నాడు.

నీరజ్‌కు అలవాటైన విధంగానే తన 5వ ప్రయత్నంలో అత్యధికంగా 87.66 మీటర్లు విసిరి నంబర్ 1 స్థానానికి ఎగబాకాడు. అప్పటిదాకా మొదటిస్థానంలో ఉన్న వెబెర్ 2వ ప్లేస్‌కి పడిపోయాడు.

చివరిదైన 6వ ప్రయత్నంలో నీరజ్ 84.15 మీటర్లు విసిరాడు. టైటిల్ కొట్టాలంటే 87.66 మీటర్ల కంటే ఎక్కువ దూరం విసరాల్సిన జూలియన్ వెబెర్ 87.03 మీటర్లు మాత్రమే విసరడంతో నీరజ్‌కి టైటిల్ ఖరారైంది.

విజయం తర్వాత నీరజ్ చోప్రా మాట్లాడుతూ.. గాయం నుంచి కోలుకునప్పటికీ కొంచెం ఆందోళగానే అసౌకర్యంగానే ఉన్నాను. ఇక్కడ చలిగా ఉంది. నా ఉత్తమ ప్రదర్శనకి ఇంకా దూరంగానే ఉన్నా. అయినప్పటికీ గెలుపు, గెలుపే. దాన్ని సంతోషంగా స్వీకరిస్తానన్నాడు.

మొదటి స్థానంలో నీరజ్ చోప్రా, రెండవ స్థానంలో జూలియన్ వెబెర్(జర్మనీ), మూడవ స్థానంలో జాకబ్ వాద్లెచ్(చెక్ రిపబ్లిక్) నిలిచారు.

Tags

Read MoreRead Less
Next Story