CWC 2023: బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన నెదర్లాండ్స్

ప్రపంచకప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో నెదర్లాండ్స్ ఘన విజయం సాధించింది. 87 పరుగుల తేడాతో ఆ జట్టుని నెదర్లాండ్స్ చిత్తుగా ఓడించింది. బంగ్లాదేశ్‌పై ఘన విజయంతో సెమీఫైనల్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. మరోవైపు పరాజయాల పరంపరను కొనసాగించిన బంగ్లాదేశ్ ఈ మ్యాచ్‌లోనూ పూర్తిగా చేతులెత్తేసింది. ఈ ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌కు షాక్ ఇచ్చిన డచ్ జట్టు... ఇప్పుడు బంగ్లాకు షాక్ ఇచ్చి తమ గెలుపు గాలివాటం కాదని నిరూపించింది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన నెదర్లాండ్స్ నిర్ణీత 50 ఓవర్లలో 229 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం 230 లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ కేవలం 48 ఓవర్లలో 190 పరుగులకే కుప్పకూలింది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన నెదర్లాండ్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. కానీ ఆరంభంలోనే డచ్ జట్టుకు కోలుకోలేని దెబ్బ తగిలింది. జట్టు స్కోరు మూడు పరుగుల వద్దే నెదర్లాండ్స్ తొలి వికెట్ కోల్పోయింది. భారత సంతతి ఆటగాడు విక్రమ్‌జిత్ సింగ్‌ను తస్కిన్ అహ్మద్ అవుట్ చేసి డచ్ జట్టును తొలి దెబ్బ కొట్టాడు. ఈ దెబ్బ నుంచి కోలుకునేలోపే నెదర్లాండ్స్ మరో వికెట్ కోల్పోయింది. నాలుగు పరుగుల వద్ద మరో ఓపెనర్ మ్యాక్స్ ఓ డౌడ్‌ను షోరిఫుల్ ఇస్లాం అవుట్ చేశాడు. డకౌట్‌గా ఓడౌడ్ వెనుదిరిగాడు. నాలుగు పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కానీ సారధి స్కాట్ ఎడ్వర్డ్స్ (68; 89 బంతుల్లో 6 ఫోర్లు), వెస్లీ బరేసి (41; 41 బంతుల్లో 8 ఫోర్లు) రాణించగా.. సిబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్ (35; 61 బంతుల్లో 3 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. చివర్లో వాన్ బీక్ (23; 16 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) దూకుడుగా ఆడి ఇన్నింగ్స్ ఆఖరి బంతికి ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. దీంతో నెదర్లాండ్స్229 పరుగులకు ఆలౌటైంది. బంగ్లా బౌలర్లలో తస్కిన్ అహ్మద్ 2, షోరిపుల్ ఇస్లామ్ 2, ముస్తాఫిజుర్ రహ్మన్ 2, మెహదీ హసన్ 2, షకీబ్ అల్ హసన్ ఒక వికెట్ తీశారు.
అనంతరం 230 పరుగుల లక్ష్యంతో బరిలోకి బంగ్లాదేశ్.. ఏ దశలోనూ లక్ష్యం సాధించే దిశగా కనిపించలేదు. టాప్-6 బ్యాటర్లలో ఇద్దరు మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. మెహదీ హసన్ మిరాజ్ (35) టాప్‌స్కోరర్‌గా నిలవగా.. తాంజిద్ హసన్ (15) పరుగులు చేశాడు. లిట్టన్ దాస్ (3), నజ్ముల్ హొస్సేన్ శాంటో (9), షకీబ్ అల్ హసన్ (5), ముష్ఫికర్ రహీమ్ (1) ఘోరంగా విఫలమయ్యారు. మహ్మదుల్లా (20), మోహదీ హసన్ (17) పరుగులు చేశారు. నెదర్లాండ్స్ బౌలర్లలో పాల్ వాన్ మీకెరెన్ 4, బాస్ డీ లీడే 2, ఆర్యన్ దత్, వాన్ బీక్, అకెర్మాన్ ఒక్కో వికెట్ పడగొట్టారు. బ్యాటర్లందరూ చేతులెత్తేయడంతో బంగ్లాదేశ్ కేవలం 48 ఓవర్లలో 190 పరుగులకే కుప్పకూలింది. ఈ పరాజయంతో బంగ్లా సెమీస్ ఆశలు గల్లంతయ్యాయి .
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com